రైతన్న ధర్మాగ్రహం ఓ ప్రమాదఘంటిక

ABN , First Publish Date - 2020-12-09T06:41:04+05:30 IST

ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయడం, ఎన్నికల్లో విజయం సాధించడం మొదలైన వ్యవహారాల్లో అవలంబించాల్సిన వ్యూహాలపై...

రైతన్న ధర్మాగ్రహం ఓ ప్రమాదఘంటిక

ఢిల్లీని చుట్టుముట్టిన రైతులను చూస్తుంటే ఎన్నికల్లో గెలవడానికీ, పార్లమెంట్‌లో బిల్లులు ఆమోదించడానికీ, ప్రజల మనసులను చూరగొనడానికీ తేడా ఉన్నదని స్పష్టమవుతోంది. ఇవాళ రైతు ప్రతినిధులతో అయిదారుసార్లు చర్చలు జరపడానికి పూనుకుంటున్న మోదీ, బిల్లులు రూపొందించే ముందు ఇలాంటి చర్చలు సాగిస్తే ఎవరు వద్దనేవారు? ఇప్పటికైనా మోదీ సర్కార్ రెండడుగులు వెనక్కి వేసి ఆత్మవిమర్శ చేసుకుని భవిష్యత్ కార్యాచరణకు పూనుకోవాలి.


ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేయడం, ఎన్నికల్లో విజయం సాధించడం మొదలైన వ్యవహారాల్లో అవలంబించాల్సిన వ్యూహాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, భారతీయ జనతాపార్టీకి ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది. ఇప్పుడు ఢిల్లీ సరిహద్దుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న నూతన వ్యవసాయ చట్టాల విషయంలో కూడా మోదీ సర్కార్‌కు ఒక స్పష్టత ఉన్నది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కనీస మద్దతు ధరను గతంలో ఉన్నదాని కంటే తగ్గించింది. రైతులకు కనీసమద్దతు ధరపై రాష్ట్రాలు బోనస్ ప్రకటించడంపై కూడా ఆంక్షలు విధించింది. దేశంలో వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే ఉత్పత్తి వ్యయాన్ని లెక్కగట్టి దానిపై 50 శాతం లాభం వచ్చే విధంగా కనీస మద్దతు ధర ఉండాలని స్వామినాథన్ కమిటీ చేసిన సిఫారసులను మోదీ ప్రభుత్వం పట్టించుకోకపోగా, వ్యవసాయ ఉపకరణాల ధరలు పెరుగుతున్న సమయంలో మద్దతు ధరను మరింత తగ్గించేందుకు పూనుకుంది. 2014లో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మోదీ ప్రభుత్వం బిజెపి ఎంపి శాంతాకుమార్ నేతృత్వంలో నియమించిన కమిటీ అసలు దేశంలో కనీస మద్దతు ధర కేవలం 6 శాతం రైతులకే ప్రయోజనం చేకూరుస్తున్నదని తీర్మానించింది. ఆహారధాన్యాల నిల్వలో ప్రైవేట్ సంస్థలకు వీలు కల్పించాలని, కనీస మద్దతు ధరపై బోనస్‌ను ఏ మాత్రం అనుమతించకూడదని, ఆహారధాన్యాల సేకరణతో పాటు అసలు మొత్తం మద్దతు ధర విధానాన్నే సమీక్షించాలని సిఫారసు చేసింది. 2018లో నీతి ఆయోగ్ ‘వినూత్న భారతానికి వ్యూహం’ అన్న పేరుతో ఒక డాక్యుమెంట్‌ను రూపొందించింది. ఈ డాక్యుమెంట్‌లోనే వ్యవసాయరంగానికి సంబంధించిన మార్కెట్ సంస్కరణలను సూచించింది. అసలు వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ (సిఏసిపి)నే రద్దు చేసి ఒక వ్యవసాయ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని, నిత్యావసర వస్తువుల చట్టాన్ని సవరించాలని, కనీస మద్దతు ధరను తీసేసి కనీస రిజర్వు ధరను ప్రవేశపెట్టాలని, కనీస మద్దతు ధరను పెంచడం అనేది రైతు సమస్యలకు ఒక సమగ్ర పరిష్కారం కానే కాదని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. 


‘2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం.’ అని మోదీ చెప్పడానికి ఈ నివేదికలే ఆధారం. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడం, కనీస మద్దతు ధర విధానానికి స్వస్తి చెప్పడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయగలమన్న ధీమా ఉంటే ఆ విషయమై విస్తృత చర్చ జరపాలి. ముందుగా సొంత పార్టీలో అంతర్గత చర్చ నిర్వహించాలి. పార్లమెంట్‌లో వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టాలి. వ్యవసాయం, వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీలు అనేవి రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి కనుక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు నిర్వహించాలి. జాతీయస్థాయిలో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలి. రైతుల ప్రతినిధులను పిలిచి చర్చించాలి. ఒక వేళ పార్లమెంట్‌లో బిల్లులు ప్రవేశపెట్టదలుచుకుంటే ఆ బిల్లులను ముందుగా స్థాయీసంఘాల పరిశీలనకు పంపాలి. పీవీ నరసింహారావు హయాంలో ఎరువుల సబ్సిడీ ఎత్తివేయాలని నిర్ణయించినప్పుడు జనతాదళ్ నేత దేవెగౌడ వెల్‌లోకి వచ్చి ధర్నా చేశారు. ‘ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు ఎజెండాను అమలు చేస్తున్నారు..’ అని బిజెపి నేత వాజపేయి విమర్శించారు. అప్పుడు పివి ఒక కమిటీ వేసి దేవెగౌడతో పాటు పలువురు ప్రతిపక్ష సభ్యులను కూడా కమిటీలో చేర్చి చివరకు తాను అనుకున్న నిర్ణయాన్నే అమలు చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో విస్తృత చర్చలు జరిపి అందర్నీ ఒప్పించారు.


కానీ మోదీ ప్రభుత్వం ఇవేమీ చేయలేదు. మొదటిసారి కన్నా రెండవ సారి పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక తమకు అడ్డేమీ లేదన్న ధీమాతో వ్యవహరిస్తోంది. కశ్మీర్‌లో 370 అధికరణ రద్దు, పౌరసత్వ చట్టం వంటివి సరే సరి, రాష్ట్రాల్లో తాము ఎన్నికల్లో గెలవకున్నా ఏదో ఒక మార్గంలో ప్రభుత్వాలను కూలద్రోసి అధికారంలోకి వచ్చే మార్గాలపై దృష్టి కేంద్రీకరించింది. దేశ ప్రజల జీవితాలపై, రాష్ట్రాల అధికారాలపై ప్రభావం పడుతుందని తెలిసినా ఇష్టారాజ్యంగా పార్లమెంట్‌లో బిల్లులను ప్రవేశపెట్టి వాటిని ఆమోదించుకునేందుకు దూకుడుగా వ్యవహరించింది. బలహీనమైన ప్రతిపక్షాలను అసలు లెక్కచేయకపోగా, కొన్ని ప్రాంతీయపార్టీలను లొంగదీసుకుని ఎటువంటి నిర్ణయమైనా అవలీలగా అమలు చేయగలమన్న అతి ఆత్మ విశ్వాసంతో వ్యవహరించింది. చివరకు కరోనా సమయంలో దేశమంతటా అట్టుడికిపోతున్న సమయంలో ఏదో కొంపలు మునిగినట్లు గత జులైలోనే వ్యవసాయ బిల్లులకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. అప్పటి నుంచి రైతులు తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పంజాబ్, హర్యానా రైతుల్లో కదలిక ప్రారంభమైంది. సెప్టెంబర్‌లో కేవలం 11 రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు ఏర్పాటుచేసి దూకుడుగా వ్యవసాయ బిల్లులతో పాటు అనేక కీలక బిల్లులను ఆమోదించారు. అప్పుడు కూడా రైతులు జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేసినా పట్టించుకోలేదు. బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీ తీర్మానాన్ని కూడా ఆమోదించింది. ఆఖరుకు తన కూటమిలో భాగస్వామి అయిన శిరోమణి అకాలీదళ్ తప్పుకుని తమ మంత్రితో రాజీనామా చేయించినా మోదీ ఏ మాత్రం చలించలేదు.


గత సెప్టెంబర్ 14న కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్రసింగ్ తోమర్ లోక్‌సభలో వ్యవసాయానికి సంబంధించిన మూడు బిల్లులను ప్రవేశపెట్టారు. ఆ బిల్లులను ప్రవేశదశలోనే ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. నిజానికి. వ్యవసాయం అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశమని ప్రతిపక్షాలు అభ్యంతరపెట్టాయి. అసలు ఈ బిల్లులను ఆమోదించేందుకు చట్టపరమయిన అర్హత పార్లమెంట్‌కు లేదని వాదించాయి. రాష్ట్రాల జాబితాలోని అంశంపై రాష్ట్ర శాసనసభలకే చట్టాలు చేసే అధికారం ఉంటుందని రాజ్యాంగంలోని 246(3) అధికరణ స్పష్టంగా చెబుతోంది. మొత్తానికి ఈ బిల్లులు వ్యవసాయానికి మృత్యుఘంటికలుగా మొత్తం ప్రతిపక్ష సభ్యులందరూ విమర్శించినా స్పీకర్ త్రోసిపుచ్చారు. కావాలంటే బిల్లులపై చర్చ సమయంలో మాట్లాడమని వారికి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17న లోక్‌సభలో అయిదుగంటల్లో చర్చను ముగించి బిల్లులను ఆమోదింపజేశారు అప్పటివరకూ మిత్రపక్షంగా ఉన్న అకాలీదళ్ నేత సుఖ్‌బీర్‌సింగ్ బాదల్‌ను పూర్తిగా మాట్లాడనివ్వలేదు. సభ్యులు వేసిన అనేక కీలక ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇవ్వలేదు. సెప్టెంబర్ 20న రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్, టిఆర్ఎస్ తో 12 ప్రతిపక్ష పార్టీల సభ్యులు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని అభ్యర్థిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తిరస్కరించారు. 


మోదీ ప్రభుత్వ వైఖరిని ఏమనుకోవాలి? ప్రతిపక్షాలన్నా, ప్రజలన్నా, రైతులన్నా, రాజ్యాంగమన్నా లెక్కలేదనుకోవాలా? ప్రతిపక్షాలు అత్యంత బలహీనంగా ఉన్న సమయంలో ఎన్నికల్లో తిమ్మినిబమ్మి చేసి గెలిచినంత మాత్రాన అప్రజాస్వామికంగా ఏ చర్యలైనా తీసుకోగలమని భావిస్తే ఏమి జరుగుతుందో ఇవాళ ఢిల్లీని చుట్టుముట్టిన రైతులను చూస్తుంటే అర్థమవుతోంది. ఎన్నికల్లో గెలవడానికీ, పార్లమెంట్‌లో బిల్లులు ఆమోదించడానికీ, ప్రజల మనసులను చూరగొనడానికీ తేడా ఉన్నదని స్పష్టమవుతోంది. కొంకర్లు తిరిగే చలిని కూడా లెక్కచేయకుండా లక్షలాది రైతులు దేశ రాజధానిని నలుమూలలా చుట్టుముట్టడం ఒక ఎత్తు అయితే ఏ రాజకీయపార్టీని కూడా తాము తమ వేదికపై ఆహ్వానించబోమని చెప్పడం మరో ఎత్తు. ప్రజలకు రాజకీయ పార్టీల పట్ల విశ్వాసం లేకపోవడం అనేది ప్రతిపక్షాలకు స్పష్టమైన సంకేతాలను పంపిస్తోంది. ప్రతిపక్షాలు లేకపోయినా ప్రజలు వీధుల్లోకి వచ్చే పరిస్థితి వస్తే ఎన్నికల్లో విజయాలు, పార్లమెంట్‌లూ, పోలీస్‌స్టేషన్లు, ఇతర వ్యవస్థలు అర్థరహితంగా మారినట్లే. రైతులతో పాటు నిరుద్యోగులు, కార్మికులు, ఇతర వర్గాలు కూడా ఇదే విధంగా స్పందిస్తే, ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలకే కాదు, ఇతర రాష్ట్రాలకు కూడా ఇలాంటి ఆందోళనలు వ్యాపిస్తే అదుపు చేయడం అంత సులభం కాదు. ఇది మోదీ సర్కార్‌కు ప్రమాద ఘంటికలను సూచిస్తోంది. ఇవాళ రైతు ప్రతినిధులతో అయిదారుసార్లు చర్చలు జరపడానికి పూనుకుంటున్న మోదీ బిల్లులు రూపొందించే ముందు ఇలాంటి చర్చలు సాగిస్తే ఎవరు వద్దనేవారు? మోదీ ప్రభుత్వం తరఫున ఇలాంటి సమస్యలను చర్చించడానికి తగిన రాజనీతిజ్ఞులు, తలపండినవారు లేరు. అసలు ప్రశ్నించే ధైర్యం లేకుండా ఇద్దరు పెద్దమనుషులు ఏమి నిర్ణయించినా డూడూ బసవన్నల్లాగా తల ఊపేవారుంటే ఏది మంచిదో, ఏది కాదో, ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో ఎలా తెలుస్తుంది? ఇప్పటికైనా మోదీ సర్కార్ రెండడుగులు వెనక్కి వేసి ఆత్మవిమర్శ చేసుకుని భవిష్యత్ కార్యాచరణకు పూనుకోవడం అవసరం. ఇంత వేడి రగిలినా ప్రతిపక్షాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్‌లో కాక రాకపోతే అవి ఉన్నా లేనట్లే లెక్క.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2020-12-09T06:41:04+05:30 IST