సింగరేణి కార్మికులకు వయోపరిమితి పెంపు

ABN , First Publish Date - 2021-07-27T06:18:55+05:30 IST

సింగరేణి కార్మికుల వయోపరిమితి 61సంవత్సరాలకు పెంచుతూ సింగరేణి బోర్డు సోమవారం ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో జరిగిన బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.

సింగరేణి కార్మికులకు వయోపరిమితి పెంపు
బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న సీఎండీ శ్రీధర్‌

- లింగభేదం లేకుండా కారుణ్య నియామకాలు

- సీఎండీ శ్రీధర్‌

గోదావరిఖని, జూలై 26: సింగరేణి కార్మికుల వయోపరిమితి 61సంవత్సరాలకు పెంచుతూ సింగరేణి బోర్డు సోమవారం ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో జరిగిన బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారం రోజుల క్రితం కార్మికుల రిటైర్డ్‌మెంట్‌ వయో పరిమమితి 61సంవత్సరాలకు పెంచాలం టూ ఆదేశాలు జారీ చేయడంతో సింగరేణి భవన్‌లో 557వ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ సమావేశం దీనికి ఆమోదం తెలిపింది. ఈ సమావేశానికి సింగరేణి డైరెక్టర్లతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బోర్డు ప్రతినిధులు హాజరయ్యారు. గతంలో సింగరేణి సంస్థలో పనిచేసే ఉద్యోగులందరికీ 60సంవత్సరాలుగా రిటైర్‌మెంట్‌ వయసు ఉండగా, ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సింగరేణిలో కూడా ఒక ఏడాది పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు. దీంతో సింగరేణి అధికారులు, కార్మికులు కలిపి మొత్తం 43,899 మందికి లబ్ధి చేకూరుతుంది. మార్చి 31వ తేదీ నుంచి జూన్‌ 30 తేదీ మధ్య రిటైర్‌మెంట్‌ అయిన 39మంది అధికారులకు, 680మంది కార్మికులను కూడా విధుల్లోకి తీసుకోనున్నారు. దీనిపై సమగ్రమైన విధి విధానాలు రూపొందించాలని సంబంధిత శాఖలకు సీఎండీ ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానం సింగరేణి విద్యా సంస్థల్లో కూడా అమలవుతుందని, కారుణ్య నియామక ప్రక్రియ కింద ఇప్పటి వరకు కుమారులకు, అవివాహిత కుమార్తెలకు అవకాశం కల్పించే వారు. ఇక నుంచి లింగబేధం లేకుండా విడాకులు పొందిన కుమార్తెలకు, ఒంటరి మహిళలకు, ఉద్యోగ వయోపరిమితికి లోబడి కారుణ్య నియామక ఉద్యోగ ప్రక్రియలో వారసత్వ ఉద్యోగం పొందేందుకు బోర్డు ఆమోదించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సీఎస్‌ఆర్‌ నిధులు రూ.60కోట్లు వెచ్చించడానికి, అలాగే వివిధ గనులకు కావాల్సిన యంత్రాలు, కాంట్రాక్టు పనులు తదితర అంశాలకు బోర్డు ఆమో దం తెలుపగా, కొత్తగా గోదావరిఖనిలో ప్రారంభించే ఓసీపీ-5కి సంబంధించి రెండు కొత్త రోడ్ల నిర్మాణానికి అవసరమయ్యే బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు శ్రీరాంపూర్‌ నర్పూర్‌ వద్ద జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నిర్వాసితులైన స్థానికులకు సింగరేణి నిర్వాసిత కాలనీలో 85 చదరపు గజాల చొప్పున 201ప్లాట్లను కేటాయించడం, ఫస్ట్‌ క్లాస్‌ మైన్‌ మేనేజర్‌ సర్టిఫికెట్‌ ఉన్న మైనింగ్‌ అధికారుల డిజిగ్నేషన్‌ మార్పుపై కూడా బోర్డు ఆమోదం తెలిపింది. సీఎండీ శ్రీధర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, ఇంధనశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, కేంద్ర బొగ్గు శాఖ డైరెక్టర్‌ పీఎస్‌ఎల్‌ స్వామి, డిప్యూటీ డైరెక్టర్‌ హజితేష్‌కుమార్‌, వెస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్‌ సీఎండీ మనోజ్‌కుమార్‌, సింగరేణి డైరెక్టర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T06:18:55+05:30 IST