చేతులెత్తేశావా జగనన్నా!’

ABN , First Publish Date - 2022-08-07T09:33:31+05:30 IST

తన వెంట్రుకను కూడా ఎవరూ పీకలేరంటూ ఓ కార్యక్రమంలో వీరావేశంతో ప్రతిపక్షాలను సవాల్‌చేసిన సీఎం జగన్‌...

చేతులెత్తేశావా జగనన్నా!’

  • డర్టీ వీడియోపై 3 రోజులైనా నాన్చుడే 
  • ఎంపీ మాధవ్‌పై సజ్జలదీ నీటి మూటే
  • సర్వేల్లోనూ, ప్రజల్లోనూ పార్టీకి ఎదురుగాలి
  • దీంతో నేతల వ్యవహారాలపై సీఎం నిస్సహాయత


(అమరావతి, ఆంధ్రజ్యోతి): తన వెంట్రుకను కూడా ఎవరూ పీకలేరంటూ ఓ కార్యక్రమంలో వీరావేశంతో ప్రతిపక్షాలను సవాల్‌చేసిన సీఎం జగన్‌... ఎంపీ మాధవ్‌ డర్టీ వీడియో వ్యవహారంలో మాత్రం అచేతనుడైపోయారా? అక్కలు, చెల్లెమ్మలను వేధిస్తే ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు పెట్టి 21 రోజుల్లో ఉరి తీస్తామన్న జగనన్న.. ఓ మహిళ ఎదుట అసభ్య ప్రదర్శన చేసిన సొంత పార్టీ ఎంపీపై ఉదారత ప్రదర్శిస్తున్నారా? ముఖ్యమంత్రి హోదాలో తీసుకోవాల్సిన కనీస చట్టపరమైన చర్యల విషయంలోనూ చేతులెత్తేశారా?... మూడురోజుల క్రితం వీడియో బయటకు వచ్చి...సభ్య సమాజం ఛీకొడుతున్నా ఇంకా నాన్చుడి ధోరణే కొనసాగిస్తున్న తీరు చూస్తున్నవారు ఈ ప్రశ్నలకు ఔను అనే సమాధానం ఇస్తున్నారు. పభుత్వ సలహాదారు, సజ్జల రామకృష్ణారెడ్డి మూడు రోజుల కిందట మీడియాతో మాట్లాడిన మాటలను వీరు గుర్తుచేస్తున్నారు. మాధవ్‌ వీడియో నిజమని తేలితే.. భవిష్యత్‌లో ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కఠిన నిర్ణయాలు ఉంటాయన్న ఆయన హెచ్చరికలు ఇప్పుడు ఏమయ్యాయని వారు ప్రశ్నిస్తున్నారు.


 మహిళల భద్రత, ఆగ్మగౌరవ పరిరక్షణ విషయంలో వైసీపీ, ప్రభుత్వం వైఖరి ఏమిటనేది తాజా ఉదంతం తేటతెల్లం చేసిందని పలువురు ఆగ్రహిస్తున్నారు. ప్రతిపక్షాలే కాదు..సొంత పార్టీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేసినా సీఐడీని రంగంలోకి దించడం జగన్‌ సర్కారుకు పరిపాటిగా మారింది. ఇప్పుడు ఆ దూకుడు ఎటుపోయింది? ప్రభుత్వ పనితీరు, విధానాల్లోని లోపాలను ఎత్తిచూపుతూ మాట్లాడుతున్న సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీఐడీకేసు నమోదయింది. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తనకు వచ్చిన పోస్టును వేరెకరికి పంపినందుకే గుంటూరు జిల్లాకు చెందిన అరవై ఏళ్లు పైబడ్డ మహిళపై కేసు పెట్టారు. వ్యతిరేక పోస్టు వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ కుమార్తె తెలుగుదేశం పార్టీ నాయకురాలు శిరీషను  సీఐడీ అధికారులు విచారణకు పిలిచారు. అదే సమయంలో ఎంపీ మాధవ్‌ వ్యవహారంలో మాత్రం మూడు రోజులుగా నిమ్మనడం లేదు. అత్యంత ఆధునిక సాంకేతిక వ్యవస్థను కలిగిన పోలీసు యంత్రాంగం రోజులు గడుస్తున్నా బయటకు పొక్కిన వీడియో నిజమైందా లేక కల్పితమా అనేది కూడా చెప్పలేకపోతోంది మరి! ఒకవేళ.. మాధవ్‌ పేరిట చలామణి అవుతున్న వీడియో ఆవాస్తవమని తేలితే.. దానిని ప్రభుత్వం అధికారికంగా బహిర్గతం చేయవచ్చు కదా.. అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 


ఒకటో, రెండో ఘటనలట!

శాసనసభలో దిశ బిల్లును ప్రవేశ పెట్టినప్పుడు అసెంబ్లీ వేదికగా వైఎస్‌ జగన్‌ ప్రదర్శించిన వీరావేశం ఇంకా రాష్ట్ర మహిళలు మరిచిపోలేదు. ఆడపిల్లలను తాకితే ఖబడ్దార్‌ అంటూ ఆయన తీవ్రస్వరంతో హెచ్చరించారు. కానీ, రాష్ట్రంలో అత్యాచారాలు ఆగలేదు. పైగా అకృత్యాల తీవ్రత పెరిగి చివరకు సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే వివాహితపై అఘాయిత్యానికి పాల్పడే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ప్రధాన నిందితుడిని పోలీసులు పట్టుకోలేకపోయారు. బాధితుల కుటుంబాలను పరామర్శించి చేతిలో నష్టపరిహారం పెట్టి రావడం మినహా .. నేరస్తులను శిక్షించే ఘటనలు నమోదుకాకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. పైగా రాష్ట్రంలో ఒకటో .. రెండో (అత్యాచార) ఘటనలు జరిగితే.. ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయంటూ జగన్‌ అనడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.  ఇలాంటి ఘటనలు తన కుటుంబ సభ్యులలో ఎవరికైనా జరిగితే ముఖ్యమంత్రి ఇదే తరహాలో స్పందించేవారా అని ప్రతిపక్షాలు అప్పట్లో నిలదీశాయి. ఇప్పుడు .. మాధవ్‌ డర్టీ వీడియో వ్యవహారంపైనా చర్యలు లేకపోవడం ముఖ్యమంత్రి పనితీరుకు నిలువెత్తు నిదర్శనమన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. 


నిలదీతలు మొదలయ్యాయి

అధినేతపై పార్టీలో నిలదీతలు మొదలయ్యాయి. నియోజకవర్గాలవారీగా జరుపుతున్న సమీక్ష సమావేశాల్లో ఎమ్మెల్యేలు.. రోడ్ల దుస్థితి నుంచి స్తంభించిన అభివృద్ధి కార్యక్రమాల వరకు ధైర్యంగా ప్రస్తావించగలుగుతున్నారు. నిధులు కావాలని సూటిగా అధినేతను అడుగుతున్నారు. వైసీపీ ప్రస్తుత స్థితిపై ఇటీవల.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఓ రహస్య సర్వే నివేదిక ఇచ్చారు. వైసీపీకి రాష్ట్రంలో ఎదురుగాలి వీస్తోందని ఈ నివేదికలో పీకే స్పష్టం చేసినట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఇంకోవైపు.. సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిలదీతలతో.. జగన్‌ ఉక్కిరిబిక్కిరైపోతున్నారని చెబుతున్నారు. ఈ నిస్సహాయత కారణంగానే.. సొంత నేతలపై సైతం చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2022-08-07T09:33:31+05:30 IST