చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

ABN , First Publish Date - 2021-12-05T04:37:16+05:30 IST

చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి సూచించారు.

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
సదస్సులో మాట్లాడుతున్న ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి

ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి

సంగారెడ్డి క్రైం, డిసెంబరు 4 : చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో న్యాయ సేవాధికార సంస్థ, సఖి కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు వివిధ చట్టాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రజల్లో చట్టాలపై అవగాహనా లోపం ఉన్నదన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు వీలైనంత ఎక్కువమందికి చట్టాలపై అవగాహన కల్పించేందుకు సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో నిరక్షరాస్యులకు చట్టాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు. అన్ని విషయాలపై అవగాహన ఉన్నప్పుడే వారు ఆయా చట్టాల ద్వారా న్యాయం పొందగలుగుతారని చెప్పారు. చట్టాలపై అవగాహన ఉంటేనే అసమానతలు, లోపాలను సరిచేయడం సాధ్యమవుతుందన్నారు. 7వ అదనపు జిల్లా జడ్జి ఎ.కర్ణకుమార్‌ మాట్లాడుతూ మహిళలకు గృహహింస, ఫోక్సో చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఐదో అదనపు జిల్లా జడ్జి జై.మైత్రేయి మాట్లాడుతూ నేరం జరిగినప్పుడు ఫిర్యాదు చేయడం సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. చిన్న పిల్లలపై లైంగికదాడులు, దౌర్జన్యాలు జరిగితే ఫోక్సో వంటి కఠిన చట్టాలతో న్యాయం పొందవచ్చని పేర్కొన్నారు. రెండవ అదనపు జిల్లా జడ్జి టి.అనిత, జూనియర్‌ సివిల్‌ జడ్జి మహ్మద్‌ అబ్దుల్‌ జలీల్‌, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిహెచ్‌.ఆశాలత, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి పద్మావతి, డీఎస్పీ బాలాజీ, సఖి కేంద్రం నిర్వాహకులు, మహిళలు, న్యాయవాదులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-05T04:37:16+05:30 IST