Abn logo
Sep 22 2021 @ 00:50AM

ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి

మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ

సిరిసిల్ల, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): యాసంగిలో దొడ్డు రకం వరి సాగు చేయవద్దని ప్రత్యామ్నాయ పం టల వైపు రైతులకు అవగాహన కల్పించడానికి కార్య క్రమాలు చేపట్టాలని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్‌ కార్యాలయంలో స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. విద్య, వైద్యం, ప్రణాళిక, ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, నిర్మాణ పనుల స్టాండింగ్‌ కమిటీల సమావేశాలకు జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ అధ్యక్షత వహించగా వ్యవసాయ కమిటీకి వైస్‌ చైర్మన్‌ సిద్ధం వేణు, మహిళా సంక్షేమ కమిటీకి తంగళ్లపల్లి జడ్పీటీసీ పూర్మాణి మంజుల, సాంఘీక సంక్షేమ కమిటీకి బోయినపల్లి జడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య అధ్యక్షతన సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ మాట్లాడుతూ రైతు వేదికల్లో ఈ నెల చివరి వరకు ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇందుకు వ్యవసాయ అధికారులు కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆయిల్‌పాం సాగుకు రైతులను ప్రోత్సహించాలన్నారు. మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో ఆయిల్‌పాం పంటలను పరిశీలిం చడానికి రైతులను ఖమ్మ జిల్లాకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా పడి చెరువులు, కుంటలు రిజర్వాయర్‌లు నిండిన వేళ చేపపిల్లలను ఎక్కువ సంఖ్యలో పెంచే విధంగా చేయాలన్నారు. పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ చేస్తున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నందున శక్తిమాన్‌ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను త్వరగా మరమ్మత్తు చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న మిషన్‌భగీరథపనులు పూర్తి చేయకుంటే  చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ  ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలన్నారు. గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. జిల్లాలోని మహిళలు సఖి సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వయో వృద్ధులకు, వికలాంగులకు  ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.  గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను సక్రమంగా నిర్వహించాలన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌  అర్హులందరికీ అందించాలని, జిల్లాను మొదటిస్థానంలో నిలపాలని అన్నారు. పాఠశాలలు ప్రారంభమైన తరుణంలో విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.  ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా మంజూరైన రుణాలకు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రజక, నాయీబ్రాహ్మణులకు  ఉచిత కరెంట్‌పై అవగాహన కల్పించాలన్నారు. సమావేశాల్లో జడ్పీ సీఈవో గౌతం రెడ్డి, జడ్పీటీసీలు మ్యాకల రవి, ఏశ వాణి, కొమిరిశెట్టి విజయ, గుగులోతు కళావతి, చీటి లక్ష్మణ్‌రావు, గట్ల మీనయ్య, నాగం కుమార్‌, గుండం నర్సయ్య, కో ఆప్షన్‌ సభ్యులు చాంద్‌పాషా, అహ్మద్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.