పత్తికి వాన గండం

ABN , First Publish Date - 2022-08-17T05:52:34+05:30 IST

అధిక వర్షాలు పత్తి రైతుల పుట్టి ముంచుతున్నాయి. నెల పదిహేను రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో నల్ల రేగడి నేలలన్నీ జాలువారి పత్తి చేలన్నీ ఎర్రబారి పోతున్నాయి.

పత్తికి వాన గండం

- ఎర్రబారుతున్న మొక్కలు

- వర్షాలతో విపరీతంగా కలుపు

- ఆకు ముడత, తెల్ల, పచ్చ దోమ బెడద

- కూలీలు దొరకని వైనం

- క్రిమిసంహారక మందులకు అదనపు భారం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

అధిక వర్షాలు పత్తి రైతుల పుట్టి ముంచుతున్నాయి. నెల పదిహేను రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో నల్ల రేగడి నేలలన్నీ జాలువారి పత్తి చేలన్నీ ఎర్రబారి పోతున్నాయి. ఆకులు ముడతవేసి పేనుబంక, పచ్చదోమ, తెల్ల దోమ రోగాలు వస్తున్నాయి. మొక్క ఎదుగుదల లేక పంట దిగుబడి సగానికి సగం తగ్గిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలే ఎదుగుదల లేని పత్తి మొక్కలను పూర్తిగా తీసివేసి ప్రత్యామ్నాయ పంట వేసే ఆలోచనకు రైతులు వస్తున్నారు. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకున్న రైతులు 6 నుంచి 8 క్వింటాళ్లు వస్తే అదే చాలు అనే పరిస్థితికి వచ్చారు. పురుగు మందులు, యూరియా వేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావడంతో ఎకరాకు వెయ్యి నుంచి 1500 రూపాయల వరకు ఖర్చు పెరుగుతున్నదని, అలాగే కలుపు తీసేందుకు కూలీల కోసం మరో వెయ్యి రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. 

జిల్లాలో 57 వేల ఎకరాల్లో సాగు

జిల్లాలో ఈ వానాకాలం 57 వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అయితే జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల్లో పత్తిసాగు జరిగింది. జూలై మాసం నుంచి అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాల కారణంగా అధిక వర్షపాతం నమోదవుతున్నది. ఒకటి అర రోజులు గెరువు ఇచ్చినా తరచుగా కురుస్తున్న వానలతో నల్ల రేగడి నేలలన్నీ జాలువారి పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిళ్లుతున్నది. జూలై నెలలో సాధారణ వర్షపాతం 265.9 మిల్లీ మీటర్లు కాగా 25 రోజులపాటు వర్షాలు కురిసి 705.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. అలాగే ఆగస్టు 16వ తేదీ వరకు పది రోజులు వర్షాలు కురిశాయి. ఈ 16 రోజులకుగాను సాధారణ వర్షపాతం 110.1 మిల్లీ మీటరు కాగా 130 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. గడిచిన 47 రోజులలో 35 రోజులు వర్షాలు కురియడంతో పత్తిచేలకు ముప్పు వాటిళ్లింది. రెండు నెలల మొక్కలైన ఎదుగుదల లేక పూత తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. దోమ, పేనుబంక రోగాలే కాకుండా కలుపు బెడద కూడా పెరిగిపోయింది. కొన్ని చేలలో మొక్కలకంటే కలుపు మొక్కలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తరచు వర్షాలు కురుస్తుండడంతో రేగడి నేలలు ఎండక ఇంకా బురదగానే ఉండి కలుపు తీసేందుకు దౌరకొట్టే వీలు లేకుండా పోతున్నది. కూలీలతో కలుపు మొక్కలు తీసేందుకు కూడా పరిస్థితి అనుకూలంగా లేదు. ఎక్కడా కూలీలు దొరకడం లేదు. మొక్కలు ఎర్రబడి పోయి ఆకు ముడత వచ్చినచోట ఎదుగుదల కోసం యూరియా వేసి దోమ, పేనుబంక ఆశించకుండా చూసేందుకు ఎకరాకు 200 ఎంఎల్‌ మోనోక్రోటోఫాస్‌ కాని ఇతర క్రిమిసంహారక మందులుకాని పిచికారి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని కోసం ఎకరాకు 1500 రూపాయలకు పైగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రైతులకు ఉత్పన్నమయింది. 45 వేల ఎకరాలలో సుమారు 5 వేల ఎకరాల పత్తి పీకేసి వేరే పంటలు వేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నట్లు ఆయా మండలాలలో ఉన్న పరిస్థితిని బట్టి తెలుస్తున్నది. మిగతా ప్రాంతాల్లో రైతులు సగం దిగుబడి వచ్చినా చాలనే అభిప్రాయానికి వచ్చి మందులు కొడుతూ కలుపు తీయించుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. అయితే వ్యవసాయాధికారులు మాత్రం మొక్కలు కోలుకుంటాయని, మందులు పిచికారి చేయడంతో దిగుబడి కొంత తగ్గినా ఆందోళన పడాల్సిన అవసరం లేదని అంటున్నారు. రైతులు మాత్రం గత అనుభవాల నేపథ్యంలో దిగుబడి తగ్గిపోతుందని ఆందోళనకు గురవుతున్నారు. 

మూడెకరాల పంటకు నష్టం జరిగింది

- రాజిరెడ్డి, వెదిర

మూడెకరాలలలో పత్తి పంట వేశాను. వర్షం కారణంగా పూర్తిగా దెబ్బతిన్నది. పంట ఎదగలేక గడ్డిలో కలిసిపోయింది. బాగుపడే పరిస్థితి లేకపోవడంతో అలాగే వదిలేశాను. మొత్తం పంట నష్టపోయాను.

గడ్డిలో కలిసిపోయింది

- లింగయ్య, గంగాధర

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పత్తి పంట మొత్తం గడ్డిలో కలిసిపోయింది. పత్తి కర్ర కంటే గడ్డి మొక్కలు ఎక్కువగా పెరిగి కనిపించకుండా పోయింది. ఇప్పటికి రెండు నెలల మొక్కకు రెండుసార్లు మందు వేయాల్సి ఉంది. దౌర వేయడానికి వస్తలేదు. నాకున్న మూడెకరాలలో పత్తి వేసినా, ఇప్పటికి 50 వేల పెట్టుబడి అయింది. అప్పులు మీద పడ్డాయి. 

దిగుబడి తగ్గుతుంది

- జడ ఆంజనేయులు, చెర్లబుత్కూర్‌

భారీ వర్షాలకు పత్తి చేలలో నీరు నిల్వ ఉండి పత్తి పంట ఎర్రబడిపోయింది. ఆకు ముడత తెగులు, జాలువారడంతో పురుగు మందులు, ఎరువులు ఎక్కువగా వేయాల్సి ఉంటుంది. ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చే పత్తిపంట ఆరు నుంచి 8 క్వింటాళ్లకు తగ్గిపోయే అవకాశం ఉంది. 

Updated Date - 2022-08-17T05:52:34+05:30 IST