తుఫానుతో అపారనష్టం

ABN , First Publish Date - 2020-11-28T07:28:35+05:30 IST

నివర్‌ తుఫాను కారణంగా చిత్తూరు జిల్లాలో అపారనష్టం

తుఫానుతో అపారనష్టం
సదుం గార్గేయ నది ప్రవాహ వుధ్రుతిలో కొట్టుకుపోయిన బ్రిటీషు కాలం నాటి వంతెన

ప్రవాహాల్లో కొట్టుకుపోయి ఐదుగురి మృతి

లభించని మరో ఇద్దరి ఆచూకీ

మృతి చెందిన వైసీపీ నేత వినయ్‌

కుటుంబానికి ఎమ్మెల్యే చెవిరెడ్డి సాయం

దెబ్బతిన్న 1100 ఇళ్ళు... 42 చెరువులకు గండ్లు

తెగిన పింఛా ప్రాజెక్టు ఆనకట్ట.... వృధాగా వెళ్ళిన నీరు

గార్గేయ నదిలో కొట్టుకుపోయిన చారిత్రక బ్రిడ్జి

పీలేరులో పింఛా నదిలో గల్లంతైన మూడు ఇళ్ళు

523 కి.మీ. మేర దెబ్బతిన్న రహదారులు


తిరుపతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): నివర్‌ తుఫాను కారణంగా చిత్తూరు జిల్లాలో అపారనష్టం సంభవించింది. గురు, శుక్రవారాల్లో నీటి ప్రవాహాల్లో మొత్తం ఏడుగురు గల్లంతయ్యారు. వారిలో ఐదుగురి మృతదేహాలు లభ్యం కాగా మిగిలిన ఇద్దరి ఆచూకీ తెలియలేదు.నీటి ప్రవాహాల్లో మరో రెండు మృతదేహాలు దొరకగా వారెవరనేదీ గుర్తించాల్సి వుంది.రేణిగుంట రాళ్ళవాగులో కొట్టుకుపోయిన ప్రసాద్‌ (34) మృతదేహం శుక్రవారం లభ్యమైంది.ఆయన కుటుంబాన్ని పరామర్శించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందజేశారు. అలాగే కేవీపల్లె మండలం ముప్పిరెడ్డిగారిపల్లె సమీపంలో ఆటో డ్రైవరు రెడ్డిబాషా గురువారం రాత్రి చెరువు మొరవ నీటి ప్రవాహాన్ని దాటే ప్రయత్నంలో ఆటోతో పాటు కొట్టుకుపోయాడు. శుక్రవారం ఉదయం గాలించగా కిలోమీటరు దూరంలో మృతదేహం లభ్యమైంది. ఐరాల మండలం కాణిపాకం సమీపంలో మండల వైసీపీ నాయకుడు పాలకూరు వినయ్‌ రెడ్డి గురువారం రాత్రి కారులో వెళుతూ వాహనంతో పాటు వాగులో కొట్టుకుపోయారు. శుక్రవారం ఆయన మృతదేహం లభించింది.ఆయన కుటుంబాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పరామర్శించారు. అంత్యక్రియలకు తక్షణసాయంగా రూ. లక్ష అందించిన ఆయన మృతుడి పిల్లల చదువులకు రూ. 10 లక్షలు అందజేస్తానని ప్రకటించారు. సదుం మండలంలో రామలక్ష్మమ్మ (43) అనే మహిళ భర్తతో కలసి పాలవ్యానులో స్వగ్రామం వెళుతూ వాగులో కొట్టుకుపోయారు. డ్రైవరు, ఆమె భర్త సురక్షితంగా బయటపడగా ఆమె గల్లంతయ్యారు. మృతదేహం శుక్రవారం రాత్రివరకూ లభ్యం కాలేదు. నిమ్మనపల్లె మండలం బాహుదా నది దాటే ప్రయత్నంలో దేవరింటి శివ (40) అనే వ్యక్తి నీటి ఉధృతికి గల్లంతయ్యాడు. శుక్రవారం రాత్రి వరకూ గాలించినా మృతదేహం దొరకలేదు. గుర్రంకొండ మండలం టి.పసలవారిపల్లె వద్ద శుక్రవారం పందిళ్ళ వాగులో కారు కొట్టుకుపోగా అందులో ప్రయాణిస్తున్న కడప జిల్లా రాజంపేట పట్టణం మన్నూరులోని సాయినగర్‌కు చెందిన రవి(55), సుబ్బయ్య(55) మృతి చెందారు. కాగా పీలేరు వద్ద ఒకటి, శ్రీరంగరాజపురం వద్ద మరొకటి చొప్పున నీటి ప్రవాహాల్లో మహిళల మృతదేహాలు కొట్టుకువచ్చాయి. వారిని గుర్తించాల్సివుంది. కాగా పీలేరు శివార్లలోని మదనపల్లె మార్గంలో పింఛా నది మధ్యలో గుట్టపై ఇంటిలో వున్న వారు గురువారం రాత్రి  నీటి ప్రవాహం పెరగడంతో దాటుకోలేక చిక్కుకుపోయారు.పోలీస్‌, ఏపీఎస్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి శుక్రవారం ఉదయం నుంచీ ప్రయత్నించగా ఎట్టకేలకు సాయంత్రం ఏడు గంటలకు గుట్టపైకి చేరుకున్నారు. చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌, మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి అక్కడకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొని ఆరుగురు బాధితులను కాపాడారు. 

15 వేల హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు

 జిల్లావ్యాప్తంగా ప్రాధమిక అంచనాల మేరకు 15 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. అలాగే 1100 ఇళ్ళు పూర్తిగానూ, పాక్షికంగానూ ధ్వంసమయ్యాయి. పీలేరు వద్ద పింఛా నదిలో మూడిళ్ళు కొట్టుకుపోయాయి. 42 చెరువులకు గండ్లు పడగా కంభంవారిపల్లె మండలంలోని పింఛా ప్రాజెక్టు ఆనకట్ట 80 మీటర్ల మేరకు తెగిపోయి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్టులోని నీరంతా వృధాగా వెళ్ళిపోయింది. సదుం మండల కేంద్రంలో గార్గేయ నది ఉధృతికి 1934లో బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్మించిన చారిత్రక బ్రిడ్జి కూలిపోయి ప్రవాహంలో కొట్టుకుపోయింది. వర్షాలకు, నీటి ప్రవాహ వేగానికి రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని 523 కిలోమీటర్ల మేరకు రహదారులు ధ్వంసమయ్యాయి. 11 చోట్ల రోడ్లకు భారీ గోతులు ఏర్పడగా 32 కల్వర్టులు దెబ్బతిన్నాయి. 54 చోట్ల రహదారులు కోతకు గురి కాగా ఆ శాఖకు చెందిన 44 వృక్షాలు కూలిపోయాయి. దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు రూ. 146 కోట్లు అవసరమని సంబంధిత శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు అంచనా వేశారు. మరోవైపు వర్షాలకు, నీటి ప్రవాహాలకు 21 పాడి పశువులు, 98 గొర్రెలు, మేకలు గల్లంతయ్యాయి. కోళ్ళఫారాల్లోకి నీరు ప్రవేశించడంతో 8 వేల కోళ్ళు మృతిచెందాయి.

భారీ ఈదురుగాలులకు తిరుమలలో కూలిన వృక్షాలు

 తిరుమల, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో తిరుమల, పరిసర ప్రాంతాల్లో దాదాపు 300 భారీ వృక్షాలు వేర్లతో సహా కుప్పకూలాయి. బుధ, గురువారాల్లో వర్షంతో పాటు భారీగా ఈదురుగాలులు వీచిన క్రమంలో తిరుమలతో పాటు చుట్టుపక్కల ఉండే శ్రీవారిపాదాలు, ధర్మగిరి, శిలాతోరణం, పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, వేణుగోపాల స్వామి ఆలయం,  రెండు ఘాట్‌రోడ్లలో భారీ వృక్షాలు రోడ్డుపై పడ్డాయి. టీటీడీ ఫారెస్ట్‌, గార్డెన్‌ విభాగానికి చెందిన దాదాపు 350 మంది సిబ్బంది గురువారం రాత్రంతా శ్రమించి విశ్రాంతి భవనాల వద్ద, రోడ్డుకు అడ్డుగా పడిన వృక్షాలను తొలగించారు. మరోవైపు చెట్ల ఆకులు, పుష్పాలు, చిన్నపాటి కొమ్మలు, మట్టితో తిరుమలలోని రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారిన  క్రమంలో పారిశుధ్య కార్మికులు శుభ్రత పనుల్లో నిమగ్నమయ్యారు.మాడవీధుల్లో వర్షానికి కొట్టుకొచ్చిన మట్టి, ఇసుకను కూడా శుక్రవారం వేకువజామునే తొలగించి శుభ్రపరిచారు.















Updated Date - 2020-11-28T07:28:35+05:30 IST