ముంచెత్తిన వాన

ABN , First Publish Date - 2022-07-01T06:10:16+05:30 IST

మండల వ్యాప్తంగా గురువారం తెల్లవారు జాము 3 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు భారీ వర్షం కురిసింది.

ముంచెత్తిన వాన
జలమయమైన గోపవరం రహదారి

- కొయ్యూరు మండలంలో ఆరు గంటల పాటు భారీ వర్షం

- గోపవరం గ్రామంలోని ఇళ్లల్లోకి వరద నీరు

- ముంచంగిపుట్టులో ఈదురు గాలుల బీభత్సం

కొయ్యూరు, జూన్‌ 30: మండల వ్యాప్తంగా గురువారం తెల్లవారు జాము 3 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు భారీ వర్షం కురిసింది. చిట్టింపాడు పంచాయతీ గోపవరం గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది. ఈ వర్షానికి జనజీవనం స్తంభించింది. మండలంలోని నడింపాలెం, శరభన్నపాలెం, రావణాపల్లి తదితర పంచాయతీలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా చిట్టింపాడు, మూలపేట, గదభపాలెం, డౌనూరు పంచాయతీ పరిధిలో కుండపోత వర్షం కురిసింది. చిట్టింపాడు పంచాయతీ గోపవరం గ్రామంలోని పలు ఇళ్లల్లోకి వరద నీరు వచ్చింది. దీని వల్ల గ్రామస్థులు ఇబ్బందులు పడ్డారు. రెండు కొండల మధ్య ఈ గ్రామం ఉండడం, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వరద నీరు పోటెత్తింది. అలాగే ఈ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పలు చోట్ల కోతకు గురైంది. గదభపాలెం గ్రామంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయం 10 గంటల సమయంలో వర్షం తగ్గడంతో పంచాయతీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. కొండవాగు ప్రవాహాలు వరద నీటితో నిండుగా ప్రవహించాయి. 

ఈదురు గాలుల బీభత్సం

ముంచంగిపుట్టు: ఈదురు గాలులతో పాటు భారీ వర్షం కురవడంతో  గురువారం మండలంలో గల వనుగుమ్మ పంచాయతీ పనస గ్రామంలో ఓ ఇంటిపై భారీ చెట్టు పడింది. కె.శుక్ర అనే మహిళకు చెందిన ఇంటి పైకప్పు ధ్వంసమైంది. ఇంట్లోని గృహోపకరణాలు దెబ్బతిన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.  సర్పంచ్‌  కె.మిల్కి ఆ ఇంటిని పరిశీలించి ప్రభుత్వ సహాయం అందేలా చూస్తానని బాధితురాలికి హామీ ఇచ్చారు.

ఫొటో రైటప్‌, 30పిడిఆర్‌ రూరల్‌ 2: కిరాణా షాపు వద్ద తనిఖీలు చేస్తున్న విజిలెన్స్‌ అధికారులు

కిరాణా షాపులపై విజిలెన్స్‌ దాడులు

- 10 మంది వ్యాపారులపై కేసులు నమోదు

పాడేరురూరల్‌, జూన్‌ 30: పాడేరులోని కిరాణా షాపులపై గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విజిలెన్స్‌ అధికారులు విస్తృతంగా దాడులు చేశారు. 10 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. మోదకొండమ్మ ఆలయ పరిసరాల్లో కిరాణా తదితర వ్యాపారాలను సాగించే వర్తకులు ఎంఆర్పీ ధరల కంటే అధికంగా సరకులు విక్రయిస్తున్నట్టు అందిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు. విజిలెన్స్‌ ఎస్పీ జి.స్వరూపరాణి ఆదేశాల మేరకు అధికారులు డి.రవికుమార్‌, ఆర్‌.జగన్మోహనరావుల బృందం ఈ దాడులు చేశాయి. వివిధ రకాల సామగ్రిని ఎంఆర్పీ ధరల కంటే అధికంగా విక్రయిస్తున్నట్టు గుర్తించి 10 మంది వ్యాపారులపై లీగల్‌ మెట్రాలజీ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వినియోగదారులను మోసగించే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. పాడేరులో వర్తకులు ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు తమకు సమాచారం అందితే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్‌ సిబ్బందితో పాటు తూనికలు కొలతల శాఖ అధికారిణి అనురాధ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T06:10:16+05:30 IST