మరో ముప్పు

ABN , First Publish Date - 2021-11-29T06:34:00+05:30 IST

అన్నదాతల ఆశలపై భారీవర్షం నీళ్లు చల్లుతోంది.

మరో ముప్పు
వరికంకులు పాలుపోసుకునే దశలో ఉన్న పొలం

వాతావరణ హెచ్చరికలతో రైతుల ఆందోళన

నేలవాలిన వరికంకులు మొలకెత్తే ప్రమాదం

రెండు, మూడు తీత దశల్లో పత్తి.. తడిస్తే నష్టమే

ఈ నెల ఆరంభం నుంచీ వెంటాడుతున్న వర్షాలు


అన్నదాతల ఆశలపై భారీవర్షం నీళ్లు చల్లుతోంది. ఆరుగాలం శ్రమ ఫలితం చేజారిపోతోంది. నిండుగా కంకులతో కళకళలాడుతున్న వరి పంటను ఈ నెల ఆరంభం నుంచి వెంటాడుతున్న వర్షాలు విడతలవారిగా ముంచేస్తున్నాయి. ఇప్పటివరకు కురిసిన వర్షాలు కొంత పైరును దెబ్బతీయగా, ఆదివారం ఉదయం నుంచి మళ్లీ ప్రారంభమైన వర్షంతో ఈ ఏడాది వరి చేతికి వచ్చేనా? అనే ఆందోళన రైతుల్లో మొదలయింది. 


ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతుల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కొద్దిరోజుల్లో పంటచేతికి వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్న రైతులను మళ్లీ మొదలైన వర్షాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ వర్షాలు మరో రెండు రోజులు ఇలానే కొనసాగితే కోతకు సిద్ధంగా ఉన్న వరి నేలవాలి, కంకులు మొలకెత్తుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ కోస్తాతీరం వెంబడి సోమ, మంగళవారాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. జిల్లాలోని సముద్రతీరం వెంబడి ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షాల కారణంగా ఎగువ నుంచి వచ్చిన నీరు పొలాల్లోకి చేరే అవకాశం ఉన్నందున వరికోతలు మరింత ఆలస్యమవుతాయి. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. 


ఈ వర్షంతో ఇబ్బందే

జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 2.38 లక్షల హెక్టార్లలో వరిసాగు జరిగింది. రెండు వారాలుగా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో అధికారుల సూచనల మేరకు వరికోతలను వాయిదా వేసుకున్నారు. అయినా భారీ వర్షాల కారణంగా చాలా వరకు పంట నష్టం వాటిల్లింది. రెండు మూడు రోజులుగా కాస్త తెరిపివ్వడంతో యంత్రాల ద్వారా కోతలు ఊపందుకోగా, ఇంతలోనే మళ్లీ వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం ఎడతెరిపిలేకుండా కురుస్తూనే ఉంది. ఈ వర్షం కారణంగా పాలుపోసుకునే దశలో ఉన్న వరికంకులకు ప్రమాదం ఉంది. ఇటీవలి వర్షాలకు వరికంకులకు ఉన్న గింజలు పగిలి నలుపు రంగుకు మారిపోయాయి. ఇలా రంగు మారిన గింజలు తప్ప, తాలుగా మారాయి. మరో రెండు, మూడు రోజులు వర్షాలు కురిస్తే, ప్రస్తుతం నిలబడి ఉన్న పైరు నేలవాలుతుందని, పొలంలోకి చేరిన నీరు బయటకు పోయేలోగా కంకులు మొలకెత్తుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనే సమయంలో తప్ప, తాలు మూడుశాతం వరకు అనుమతిస్తారని, అంతకు మించి ఉంటే ధాన్యం ధరలో కోత పెడతారని రైతులు అంటున్నారు. 

Updated Date - 2021-11-29T06:34:00+05:30 IST