చెరువులు భద్రమేనా?

ABN , First Publish Date - 2020-07-10T10:50:11+05:30 IST

ప్రస్తుతం వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. జిల్లాలోని చెరువులు, కుంటలు జలకలను సంతరిం చుకుంటున్నాయి.

చెరువులు భద్రమేనా?

విస్తారంగా కురుస్తున్న వర్షాలు

మరమ్మతులకు నోచుకోని చెరువులు, కుంటలు

తూములు, కాలువల పరిస్థితి మరీ అధ్వానం

మధ్యలోనే నిలిచిపోయిన మిషన్‌ కాకతీయ

మూడేళ్లుగా విడుదల కాని నిధులు 

పనులు చేయలేమని చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు


(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

ప్రస్తుతం వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. జిల్లాలోని చెరువులు, కుంటలు జలకలను సంతరిం చుకుంటున్నాయి. అటు ఎగువన మహారాష్ట్రలో కురు స్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతుండడంతో ఆసిఫాబాద్‌ సమీపంలోని కుమరం భీం ప్రాజెక్టు పూర్తిస్థాయి జలకలను సంతరిం చుకుంటోంది. గత ఏడాదితో పోల్చి చూసినపుడు ఈ సారి వర్షపాతం ఆశాజనకంగా కనిపిస్తున్న నేపథ్యంలో చెరువులు, కుంటలన్నీ సెప్టెంబరు కంటే ముందే పూర్తి స్థాయిలో నిండిపోయే అవకాశాలు మెండుగా ఉన్నా యి. జిల్లాలోని మేజర్‌, మీడియం జల వనరులను మినహాయిస్తే చిన్న తరహా నీటి పారుదల శాఖ పరిధిలో చిన్నవి, పెద్దవి కలుపుకొని మొత్తం 560 చెరువులున్నాయి. ఇందులో ఇప్పటి వరకు కాస్తో కూస్తో మరమ్మతులకు నోచుకున్న చెరువుల సంఖ్య 416 ఉన్నట్లు నీటి పారుదల శాఖ అధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే మరో 154 చెరువుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. కొన్ని చెరువుల పరిస్థితి అయితే అసలు నామరూపాలు కూడా కనిపించని స్థాయిలో కనుమరుగై పోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. 


వేసవి కాలంలోనే చెరువు కట్టలు, తూములను మరమ్మతులు చేయాల్సి ఉండగా నిధులు లేక ఎలాంటి పనులు చేపట్టలేదు. ఫలితంగా చెరువుల కట్టలన్నీ బలహీనంగా తయారయ్యాయి. పిచ్చి మొక్కలు మొలిసి చెరువుల అంతర్భాగంలోనూ పూర్తి స్థాయి నీరు నిలువ ఉండే పరిస్థితులు లేవని వివిధ గ్రామాలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు చెబుతున్నారు. కానీ అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని పేర్కొంటున్నారు. అనధికార సమాచారం ప్రకారం జిల్లా వ్యాప్తంగా రెండు డివిజన్లలో సుమారు 200కుపైగా చెరువులు బలహీనంగా ఉన్నట్లు గుర్తించారు.


ఈ చెరువుల్లో ముఖ్యంగా తరచుగా గండ్లు పడడం, అదనపు నీరు బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేయకపోవడం వంటి కారణలతో భారీగా వరదలు వచ్చినపుడు చెరువులు తెగిపోతున్నట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని అధికారులను సంప్రదిస్తే అక్కడక్కడ కొన్ని చెరువుల్లో సమస్యలున్న మాట వాస్తవమేనని వాటిని మరమ్మతులు చేయాలన్నా నిధులు లేక నిస్సహాయంగా ఉండిపోతున్నట్లు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా గత మూడేళ్లుగా ఒక్క పైసా విడుదల చేయకపోవడం వల్ల ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని చెబుతున్నారు. 


ఇదీ మిషన్‌ కాకతీయ దుస్థితి

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొదటి విడత అధికారంలోకి రాగానే మిషన్‌ కాకతీయ పేరిట చెరువుల పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా కొత్త చెరువుల ప్రతిపాదనను ప్రభుత్వానికి అందజేశారు. ఈ క్రమంలో మిషన్‌ కాకతీయ ఫేజ్‌-1, ఫేజ్‌-2, ఫేజ్‌-3, ఫేజ్‌-4లుగా విభజించి మొత్తం 500 చెరువులను పునరుద్ధరించేందుకు పనులు ప్రారంభించారు. ఇందు లో మిషన్‌ కాకతీయలో ఫేజ్‌-1లో పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు. ఇక ఫేజ్‌-2 నుంచి   పనులకు నిధుల కష్టాలు మొదలయ్యాయి. దాంతో ఫేజ్‌-3, ఫేజ్‌-4లో చేపట్టిన పనులు కూడా అరకొరగా ప్రారంబింభి నిధుల లేమితో మధ్యలోనే వదిలేసిన పరిస్థితి దాపురించింది. 


రూ.17కోట్ల పైనే పెండింగ్‌ బిల్లులు

జిల్లాలో మిషన్‌ కాకతీయ మూడు దశలకు సంబంధించిన అభివృద్ధి పనులతో పాటు 14 కొత్త పనులకు సంబంధించి మొత్తం రూ.17 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు చిన్న నీటి పారుదల శాఖ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా మిషన్‌ కాకతీయ ఫేజ్‌-2, ఫేజ్‌-3, ఫేజ్‌-4 పనులకు సంబందించిన బిల్లులే సుమారు రూ.5కోట్ల నుంచి 6కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మిషన్‌ కాకతీయ పనులు చేపట్టిన వారంతా స్థానికంగా ఉండే చోటమోట కాంట్రాక్టర్లే. బ్యాంకుల్లో, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రుణాలు తీసుకొని   పనులు చేపట్టి బిల్లులు రాక ప్రస్తుతం ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. 


మూడు సంవత్సరాలుగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో అటు అధికారులపైనా ఒత్తిడి పెరుగుతోంది. ఇదిలా ఉంటే మరో 14 పనులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో పనులు ఒక్క అడుగు కూడా ముందుకు కదలడంలేదు. భూ సేకరణ, అభివృద్ధి పనులకు సంబంధించి రూ.12కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా జిల్లాలో ఇటీవల డీఎంఎఫ్‌టీ నిధులతో చేపట్టిన పనులకు మాత్రం కాస్తోకూస్తో ఆర్థిక వనరులు అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నిధులతో సిర్పూర్‌ నియోజకవర్గంలోని చింతల మానేపల్లి మండలం బాబాసాగర్‌ చెరువు కింద కాలువల మరమ్మతు పనులకు రూ.45 లక్షలు మంజూరు చేయడంతో ప్రస్తుతం పనులు సాగుతున్నాయి.


అలాగే ఇవే నిధులతో జిల్లా వ్యాప్తంగా మొత్తం 18చోట్ల చెక్‌డ్యాంలను నిర్మించాలని తలపెట్టారు. ఇందులో ఎనిమిది చెక్‌డ్యాంలు సిర్పూర్‌ నియోజకవర్గంలో  నిర్మించడానికి రూ.18.56 కోట్లు అంచనాలు తయారు చేసి పరిపాలన ఆమోదం కోసం పంపించారు. అలాగే ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో పది చెక్‌డ్యాంల కోసం రూ.34.89 కోట్లు ఆంచనాలు తయారు చేసి ఆమోదానికి పంపించారు. త్వరలోనే వీటికి ఆమోద ముద్ర పడే ఆవకాశం ఉన్నట్లు ఆంచనా వేస్తున్నారు. 

Updated Date - 2020-07-10T10:50:11+05:30 IST