అకాల వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో భారీగా నష్టం: లోకేష్‌

ABN , First Publish Date - 2020-10-31T00:52:59+05:30 IST

అకాల వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో భారీగా నష్టం వచ్చిందని టీడీపీ నేత లోకేష్‌ తెలిపారు. రైతులను ఆదుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదని తప్పుబట్టారు.

అకాల వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో భారీగా నష్టం: లోకేష్‌

అమరావతి: అకాల వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో భారీగా నష్టం వచ్చిందని టీడీపీ నేత లోకేష్‌ తెలిపారు. రైతులను ఆదుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదని తప్పుబట్టారు. రైతులను ఆదుకోవడంలో సీఎం జగన్‌ మాట తప్పారని, మడమ తిప్పారని ధ్వజమెత్తారు. రైతు భరోసా విషయంలోనూ జగన్‌ మోసం చేశారని మండిపడ్డారు. దేశ చరిత్రలో రైతుకు కులం అంటించిన ఘనత జగన్‌దేనని చెప్పారు. సున్నా వడ్డీ పథకంలో రైతులకు అందింది సున్నానేనని చెప్పారు. వ్యవసాయ బడ్జెట్‌ రూ.17వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్లకు తగ్గించారని, ధాన్యం కొనుగోళ్లలో రూ.2వేల కోట్ల బకాయి పెట్టారని నారా లోకేష్‌ తెలిపారు. 


‘‘టీడీపీ హయాంలో పోలవరాన్ని 70శాతం పూర్తిచేశాం. జగన్‌రెడ్డి వచ్చాక పోలవరం కేవలం 2శాతమే పూర్తయింది. జగన్‌ తన ప్యాలెస్‌లను తాకట్టుపెట్టి డబ్బులు తీసుకురావచ్చు కదా... కొత్తగా మీటర్లు బిగించి రైతులను ఇబ్బంది పెట్టడం ఎందుకు?. దళిత రైతులకు బేడీలు వేసి జైలుకు తీసుకెళ్తారా?. జగన్‌కు ఓటేయడమే రైతులు చేసిన తప్పా?. జగన్‌రెడ్డి ప్రభుత్వంలో 750మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదేనా జగన్‌రెడ్డి తీసుకొస్తానన్న రైతు రాజ్యం’’ అని నారా లోకేష్ నిలదీశారు.

Updated Date - 2020-10-31T00:52:59+05:30 IST