పొంచి ఉన్న రోగాల ముప్పు.. తస్మాత్ జాగ్రత్త..!

ABN , First Publish Date - 2020-10-24T12:25:28+05:30 IST

గ్రేటర్‌లోని దాదాపు ఏ వీధి చూసినా మురుగు పరుగులు తీస్తోంది. ఇటీవల వరదలు ముంచెత్తడంతో సివరేజీ సమస్యలు పెరిగాయి. ప్రధాన రహదారులతో పాటు కాలనీలు, వీధులు చిత్తడిగా మారాయి. మురుగుతో రోగాలు వ్యాపిస్తాయోమోనని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. వాహనదారులు

పొంచి ఉన్న రోగాల ముప్పు.. తస్మాత్ జాగ్రత్త..!

హైదరాబాద్‌ : గ్రేటర్‌లోని దాదాపు ఏ వీధి చూసినా మురుగు పరుగులు తీస్తోంది. ఇటీవల వరదలు ముంచెత్తడంతో సివరేజీ సమస్యలు పెరిగాయి. ప్రధాన రహదారులతో పాటు కాలనీలు, వీధులు చిత్తడిగా మారాయి. మురుగుతో రోగాలు వ్యాపిస్తాయోమోనని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. వాహనదారులు సైతం ప్రయాణానికి ఇబ్బందులు పడుతున్నారు. ఐదు రోజుల్లో సాధారణ పరిస్థితికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.


ఇళ్లలోనూ సమస్యలు

వాటర్‌బోర్డుకు సాధారణ సమయంలో గానీ, వర్షాలు వచ్చిన సందర్భంలో గానీ కాలనీ, వీధుల్లో తలెత్తిన సివరేజీ సమస్యపై ఫిర్యాదులు వచ్చేవి. ప్రస్తుతం వరదలు ముంచెత్తడంతో కాలనీలు, వీధులు, ప్రధాన రహదారులతో పాటు ఇళ్లలోనూ సివరేజీ సమస్యలు తలెత్తాయి. నగరంలోని ప్రతి ఇంటికీ సివరేజీ కనెక్షన్‌ ఉండగా, ఇళ్లలో స్నానాల గది, మరుగుదొడ్డి వ్యర్థాలన్నీ ఆ లైన్లలో కలుస్తాయి. వరదలతో పలు అపార్ట్‌మెంట్లు, ఇళ్లల్లో సివరేజీ పూర్తిగా రివర్స్‌ అయ్యింది. వీధుల్లో ప్రవహించే మురుగు కొన్ని చోట్ల ఇళ్లలోకి వచ్చేస్తోంది. నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ఇళ్లలోని మరుగుదొడ్లలో కాలకృత్యాలు తీర్చుకోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. దానికి తోడు దుర్వాసనతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. బహదూర్‌పురా, యాకత్‌పురా, కార్వాన్‌, మలక్‌పేట, ఫలక్‌నుమా, జియాగూడ, సులేమాన్‌నగర్‌, కాలాపత్తార్‌, మంగళ్‌హాట్‌, ఆసిఫ్‌నగర్‌, నాంపల్లి, అంబర్‌పేట, కాచిగూడ తదితర ప్రాంతాల్లో ఈ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. అసలే కరోనా కాలం.. ఈ సమయంలో ఇటువంటి అధ్వాన పరిస్థితులు ఏర్పడడం ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని ప్రజలు భయపడుతున్నారు.


సవాల్‌ను అధిగమించేందుకు..

ప్రస్తుతం ప్రతి రోజూ 8 గంటలు, సుమారు 500 మీటర్ల సివరేజీ పనులు చేపట్టే 142 ఎయిర్‌టెక్‌ మిషన్లు, జెట్టింగ్‌ యంత్రాలు రాత్రింబవళ్లు పని చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. పగటి వేళల్లో కాలనీలు, వీధుల్లో మిషన్లు పని చేస్తుండగా, రాత్రివేళలో ప్రధాన రహదారుల్లో సివరేజీ ఓవర్‌ఫ్లోను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. కోర్‌సిటీలో సివరేజీ నిర్వహణ చేపట్టే సుమారు 700ల మంది సిబ్బందికి అదనంగా మరో 700 మంది సిబ్బందిని తీసుకున్నారు. ప్రాంతాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సమస్యలను తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నారు. ముంపు ప్రాంతాల్లోని ఇళ్లకు ప్రత్యేకంగా క్లోరిన్‌ మాత్రలతో పాటు కిలో బ్లీచింగ్‌ పౌడర్‌ను అందజేస్తున్నారు.

Updated Date - 2020-10-24T12:25:28+05:30 IST