నైరుతి తెచ్చిన వాన

ABN , First Publish Date - 2021-06-15T08:04:41+05:30 IST

నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలో వర్షాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలో పలుచోట్ల వర్షం కురవడంతో..

నైరుతి తెచ్చిన వాన

  • రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు
  • కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోయిన ధాన్యం
  • పొంగిన వాగులు.. కొట్టుకుపోయిన కల్వర్టులు
  • దుక్కులు తడవడంతో పంటల సాగు వాయిదా
  • రాష్ట్రంలో మరో 3 రోజులు తేలికపాటి వర్షాలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలో వర్షాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలో పలుచోట్ల వర్షం కురవడంతో.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు పొంగి ప్రవహించాయి పంట పొలాల్లోకి నీళ్లు చేరాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు పలు చోట్ల కుండపోతగా వర్షం కురిసింది. సిరిసిల్ల జిల్లాలో పలు చోట్ల ధాన్యం తడిసి రైతులు నష్టపోయారు. జిల్లా కేంద్రంలో కార్మికవాడలు, రోడ్లు జలమయమయ్యాయి. చందుర్తి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లాలో కురిసిన వర్షానికి పలు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న 4,500 క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. యాదాద్రిభువనగిరి జిల్లాలో కురిసిన వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి నీరు చేరి రైతులు ఇబ్బందులు పడ్డారు. 


నిజామాబాద్‌ జిల్లాలో పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విత్తనాలు వేసేందుకు దున్నిన దుక్కులు తడవడంతో ఆ కార్యక్రమాన్ని రైతులు వాయిదా వేసుకున్నారు. అయితే ఆరుతడి పంటలైన మొక్కజొన్న, పసుపు, సోయా, కందితో పాటు ఇతర పంటలు వేసిన వారికి ఈ వర్షం ఉపయోగపడింది. కామారెడ్డి జిల్లాలో నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు బోరుబావుల కింద నారుమళ్లను సిద్ధం చేస్తున్నారు. నిజాంసాగర్‌, కౌలా్‌సనాలా, పోచారం ప్రాజెక్టుల్లోకి స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది. వాగులు జలకళను సంతరించుకుంటున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వర్షం కురవడంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభిస్తున్నారు. పలు చోట్ల పత్తి విత్తనాలు నాటుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఆదివారం అర్ధరాత్రి ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. అత్యధికంగా ఇంద్రవెల్లి మండలంలో 119 మిలీమీటర్ల వర్షం కురిసింది. బోథ్‌ మండలంలోని పొచ్చెర జలపాతం వరద నీటితో పరవళ్లు తొక్కింది. కొన్ని చోట్ల భారీ వర్షానికి కల్వర్టులు కొట్టుకుపోయాయి. హైదరాబాద్‌ నగరంలో వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.


3 రోజులు తేలికపాటి వర్షాలు

రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. ఉత్తర పశ్చిమ అల్పపీడన ద్రోణి బలహీనపడిందని, అల్పపీడనం నైరుతి దిశగా తెలంగాణ వైపు ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది.

Updated Date - 2021-06-15T08:04:41+05:30 IST