మళ్లీ వానలు

ABN , First Publish Date - 2022-08-08T08:17:25+05:30 IST

వానలు మళ్లీ మొదలయ్యాయి. శనివారం రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

మళ్లీ వానలు

రాష్ట్రవ్యాప్తంగా ముసురు వాతావరణం

ఉమ్మడి ఖమ్మం, నల్లగొండలో వరద ఉధృతి

పలు గ్రామాలకు రాకపోకలు బంద్‌ 

నేడు, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు

పది జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ 

శ్రీశైలానికి 1.52 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో  

జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో.. గేట్ల మూసివేత

నాగార్జున సాగర్‌లో పర్యాటకుల సందడి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)


వానలు మళ్లీ మొదలయ్యాయి. శనివారం రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీగా, చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. ఉమ్మడి ఖమ్మం, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి.  వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సగటున 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాగుల ఉధృతి కారణంగా జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెంలో సగటు వర్షపాతం 5.1 సెంటీమీటర్లుగా ఉంది. తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టుల నుంచి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రెండు రోజుల్లో 60వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఉమ్మడి నల్లగొండలో ఆదివారం వర్షం భారీ వర్షాలతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లాలో వాగు దాటుతూ ఓ రైతు గల్లంతయ్యాడు. భారీ వరదల కారణంగా కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని అడ ప్రాజెక్టు కట్ట దగ్గర నీళ్లు లీక్‌ కావడం, ఇప్పటికే కట్టకు పగుళ్లు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. ఆదివారం హైదారాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షాలకు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రామాంతాపూర్‌లో 1.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 


బంగాళాఖాతంలో అల్పపీడనం

వాయవ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అఽధికారులు తెలిపారు. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం అత్యంత భారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరించింది. పది జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. రాగల మూడు రోజులు గంటకు 30-40 కిలోమీటర్ల వీస్తాయని తెలిపింది. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన జిల్లాల జాబితాలో ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు ఉన్నాయి.


శ్రీశైలానికి 1.52 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో  

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. డ్యామ్‌ సైట్‌ దగ్గర 1.52 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఏపీ, తెలంగాణ విద్యుత్‌ కేంద్రాల్లో పవర్‌ హౌస్‌ జనరేషన్‌ నుంచి మూడు స్పిల్‌వే గేట్ల ద్వారా 1.47 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 213.40 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి జూరాలకు వరద తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టు స్పిల్‌వే గేట్లను మూసివేశారు. 


సాగర్‌లో పర్యాటకుల సందడి

నాగార్జునసాగర్‌కు వరద కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి 1,47,115 క్యూసెక్కుల నీరు వస్తోంది.  నాగార్జునసాగర్‌లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. నూతన లాంచీ స్టేషన్‌ నుంచి మూడు జాలీ ట్రిప్పులు నడిపినట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. 


శ్రీరామ సాగర్‌ 9 గేట్ల ఎత్తివేత 

నిజామాబాద్‌ జిల్లా శ్రీరామ సాగర్‌ ప్రాజెక్టుకు ఆదివారం ఎగువ నుంచి 65,210 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 9 గేట్ల ద్వారా 50వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 1088.3 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. 

Updated Date - 2022-08-08T08:17:25+05:30 IST