జిల్లా అంతటా వానలు

ABN , First Publish Date - 2022-09-30T06:01:26+05:30 IST

జిల్లావ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం దాకా విస్తారంగా వర్షాలు కురిశాయి.

జిల్లా అంతటా వానలు
శెట్టివీడు రహదారిపై ప్రవహిస్తున్న ఎర్రవంక

ఇళ్లు, పంట పొలాల్లో చేరిన నీరు
ఉప్పొంగిన వాగులు, వంకలు

నంద్యాల టౌన్‌, సెప్టెంబరు 29 :
జిల్లావ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం దాకా విస్తారంగా వర్షాలు కురిశాయి. కొత్తపల్లె, పాములపాడు మండలాల్లో మినహా మిగతా అంతటా వర్షం కురిసినట్లు కలెక్టరేట్‌ కార్యాలయ అధికారులు  ప్రకటన విడుదల చేశారు. కోవెలకుంట్లలో అత్యధికంగా 106.8మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.  రుద్రవరం, శిరివెళ్ల, ప్యాపిలి మండలాల్లో 1.4మిల్లీ మీటర్ల  వర్షపాతం, జిల్లాలో సరాసరి 32.1మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

నీట మునిగిన పంట పొలాలు

చాగలమర్రి: చాగలమర్రి మండలంలో భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కలుగొట్లపల్లె, బ్రాహ్మణపల్లె, వక్కిలేరు వంతెనలపై వరద నీరు ప్రవహించడంతో  గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. శెట్టివీడు, ముత్యాలపాడు గ్రామాల మధ్యలో గల వంకలు, రహదారిపై పొంగి ప్రవహించాయి. ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తి, వేరుశనగ, వరి పంటలు నీట మునిగాయి. రబీలో సాగు చేసిన మినుము, జొన్న పంటలకు ఈ వర్షం జీవం పోసింది.

కోవెలకుంట్ల జలమయం

కోవెలకుంట్ల:  భారీ వర్షానికి కోవెలకుంట్ల పట్టణం జలమయమైంది.  బుధవారం అర్ధరాత్రి నుంచి ఉదయం 5:30వరకు 106.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో కోవెలకుంట్ల పట్టణంలోని వివిధ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరింది. స్వామి నగర్‌ కాలనీలో వర్షపునీరు  ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంతమార్కెట్‌ ప్రధాన వీధిలో మోకాలి లోతు నీరు ప్రవహించింది. మండలంలోని వల్లంపాడు, చిన్నకొప్పెర్ల, పెద్దకొప్పెర్ల, గోవిందిన్నె, బిజినవేముల గ్రామాల మధ్యన ఉన్న వాగులు ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఉప్పొంగిన వంకలు, వాగులు

ఉయ్యాలవాడ: మండలంలో నమోదైన 50.2 మి.మీటర్ల వర్షపాతానికి వాగులు, వంకలు ఉప్పొంగాయి. ఇంజేడు గ్రామ సమీపంలోని కుందరవాగు వంతెనపై వరద నీరు ప్రవహించింది. ఉయ్యాలవాడ, ఆళ్లగడ్డ పట్టణాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్‌.పాంపల్లె, ఇంజేడు, ఉయ్యాలవాడ గ్రామాల్లో పత్తి, మిరప పంటలు నీట మునిగాయి.

Updated Date - 2022-09-30T06:01:26+05:30 IST