ఐదోరోజూ ముంపులోనే...

ABN , First Publish Date - 2020-10-17T11:21:56+05:30 IST

కుండపోత వర్షాలు.. భారీ వరదలకు రైతులకు కడగండ్లే మిగిలాయి. వేలాది ఎకరాలు ఇంకా నీటి నుంచి తేరుకోలేదు. ఉప్పుటేరు, యనమదుర్రు డ్రెయిన్లు ..

ఐదోరోజూ ముంపులోనే...

రైతులకు మిగిలింది కన్నీరే 



కుండపోత వర్షాలు.. భారీ వరదలకు రైతులకు కడగండ్లే మిగిలాయి. వేలాది ఎకరాలు ఇంకా నీటి నుంచి తేరుకోలేదు. ఉప్పుటేరు, యనమదుర్రు డ్రెయిన్లు పోటెత్తడంతో డెల్టా ప్రాంతం తీవ్ర ముంపునకు గురైంది. చేపలు, రొయ్యల చెరువులు వరద పాలయ్యాయి. మత్స్య సంపద నీటిలో కొట్టుకుపోకుండా రైతులు వలలు అడ్డుకట్ట వేస్తున్నా ఫలితం కనిపించడం లేదు.


భీమవరం/తాడేపల్లిగూడెం రూరల్‌/ఆకివీడు రూరల్‌, అక్టోబరు 16 : ఏజెన్సీ మెట్ట ప్రాంతం నుంచి, ప్రధాన మురుగు కాలువల నుంచి కాలువల నీరు ప్రవాహం పెరగడంతో దిగువన యనమదుర్రు, ఉప్పుటేరు డ్రెయిన్‌లకు వరద పోటు పెరిగింది. ఉప్పుటేరులో 30 వేల క్యూసెక్కులకుపైగా నీరు ప్రవహిస్తుండగా, యనమదుర్రు మురుగు నీటి కాలువలో 24 వేల క్యూసెక్కులకు పెరిగింది. ఈ కారణంగానే ఆకివీడు మండలంలో ఉప్పుటేరు గండిపడింది.


ఆకివీడు, కాళ్ల, భీమవరం, మొగల్తూరు మండలాల్లో మేజర్‌, మీడియం డ్రెయిన్లన్నీ ఎగదన్నడంతో అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ఉప్పుటేరులో కలిసే రుద్రాయకోడు, బొండాడ డ్రెయిన్‌, గునుపూడి సౌత్‌ డ్రెయిన్‌, గొంతేరులు వరుసుగా రెండో రోజు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. పరివాహక ప్రాంతాల్లో అనేక గ్రామాలకు వరద నీరు చేరింది. యనమదుర్రు డ్రెయిన్‌కు గండి పడడంతో గణపవరం మండలం పిప్పర, మొయ్యేరు ఆయుకట్టులోని పెదబాడవ, చినబాడవ పొలాలను నానుతున్నాయి. పొలాల ముంపు పెరగకుండా అడ్డుకునేందుకు 1,250 ఇసుక బస్తాలను వినియోగించినప్పటికి ఫలితం కనిపించడం లేదు. 


శాంతించిన ఎర్ర కాల్వ

నాలుగు రోజులుగా ఎర్రకాలువ పరి వాహక ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన వరద శుక్ర వారం నిలకడగా ఉండడంతో ప్రజల్లో ఒకింత ఆశ చిగురించింది. శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు తాడేపల్లిగూడెం మండలం జగన్నాథ పురం లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరి ఇళ్లన్నీ మునిగిపోయాయి. వీరం పాలెంలో రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు ఎర్ర కాలువపై వేసుకున్న వైరు వంతెన ధ్వంసమైంది. మారంపల్లి, నందమూరు, ఆరుళ్ల గ్రామాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి.


ఇన్‌ చార్జ్‌ ఎంపీడీవో కొయ్యే వెంకట్రావు జగన్నాథపురంలో ఇళ్ల్ల లోకి చేరిన నీటిని మోటార్ల సాయంతో బయటకు తర లించేఏర్పాటు చేశారు. నందమూరులో ఎర్రకాలువ వరద నీటిలో జాలర్లు వేసిన వలలో కొండచిలువ కొట్టుకు రావడంతో స్థానికులు చంపేశారు. నిడదవోలు మండలం లోని చేలు ఎర్రకాలువ వరద నీటిలోనే నానుతున్నాయి. కాటకూటేశ్వరం, తాడిమళ్ళ, ఉనకరమిల్లి, కంసాలిపాలెం, రావిమెట్ల, శంకరాపురం, శింగవరం, తాళ్ళపాలెం గ్రామాల్లోని ఐదు వేల ఎకరాలు వరదనీట మునిగాయి.


ఉప్పుటేరు నీటి మట్టం 2.92 మీటర్లు 

కొల్లేరు పరివాహక ప్రాంతంలోని ముంపు నీటిని తీసు కెళ్లేందుకు పశ్చిమ, కృష్ణా జిల్లాల సరిహద్దులో ఉన్న ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం దీని నీటిమట్టం 2.92 మీటర్లు ఉందని డ్రెయినేజీ అధికారులు తెలిపారు. 1986 తరువాత ఇప్పుడే అప్పటికన్నా పెద్ద వరద వచ్చిందని అప్పటి నీటిమట్టం 2.22 మీటర్లు. రెండు మూడు రోజులపాటు నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని, ఎగువ నుంచి నీరు భారీగా వచ్చి చేరుతుండడం, అమావాస్య కావడంతో సముద్రం పోటు ఎక్కువగా ఉండడంతో నీటి మట్టం పెరిగిపోతున్నదని తెలిపారు. 


స్వల్పంగా తగ్గిన గోదావరి నీటిమట్టం

పోలవరం, అక్టోబరు 16 : పోలవరంలో గోదావరి నీటి మట్టం స్వల్పంగా తగ్గింది. శుక్రవారం ఉదయానికి 19.407  మీటర్ల నుంచి 19.296కు చేరుకోగా, కాపర్‌ డ్యాం వద్ద 21.896 మీటర్ల నుంచి 21.800కు చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో కొండ వాగుల నీరు, ఉప నదుల నీరు కలుస్తుండటం వల్ల గోదావరి నీటిమట్టం పెరుగుతోందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు అదనపు జలాలను సముద్రంలోకి విడుదల చేయడం వల్ల నీటిమట్టం క్రమబద్ధీకరిస్తున్నట్టు చెప్పారు.  


ఉప్పుటేరు ములక గట్టుకు గండి

ఆకివీడు మండలం సిద్ధాపురంలోని కురుపాక వద్ద ఉప్పుటేరు ములక గట్టుకు భారీ గండి పడింది. శుక్రవారం ఉదయం ఆరున్న రకు గట్టుకు గండిపడి నేరుగా పంట పొలాలను ముంచేసింది. 1986లో కురుపాకలోనే గండిపడి సిద్ధాపురాన్ని చుట్టుముట్టింది. ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొనడంతో సిద్ధాపురం ప్రజలు భయాం దోళనకు గురవుతున్నారు. సుమారు 400 ఎకరాలు వరి పైరు ముంపునకు గురైంది. ఉప్పుటేరు వరద తీవ్రత వల్ల చేపల రైతులు ఆందోళన చెందుతున్నారు. వంద ఎకరాలకు పైగా తమ చెరువులు ఇప్పటికే నీట మునిగాయని, వలతో సం రక్షించుకుంటున్నామని, గండి పడడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని వారు వాపోతున్నారు. చేప లను కాపాడుకోవడానికి వలలు కడు తున్నట్లు తెలిపారు.


కొనసాగుతున్న  వర్షాలు

ఏలూరు సిటీ, అక్టోబరు 16 : బంగా ఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటినా జిల్లాలో ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పోడూరు మం డలంలో 38.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా జిల్లా సరాసరి 2.7 మి.మీ. పెనుగొండ 24, పెనుమంట్ర 19.6, అత్తిలి 18.2, ఆచంట 9.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

Updated Date - 2020-10-17T11:21:56+05:30 IST