ముసురు

ABN , First Publish Date - 2022-08-15T05:54:58+05:30 IST

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం వేకువజాము నుంచి ముసురు పెట్టింది. ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు కురువడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ముసురు
గొట్టాబ్యారేజి నుంచి ప్రవహిస్తున్న వంశధార

- అల్పపీడన ప్రభావంతో జిల్లా అంతటా వర్షం
- కవిటిలో అధిక వర్షపాతం
- వంశధారకు మొదటి ప్రమాద హెచ్చరిక
- కంట్రోల్‌ రూం(08942-240557)ఏర్పాటు
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/ కలెక్టరేట్‌, ఆగస్టు 14:
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం వేకువజాము నుంచి ముసురు పెట్టింది. ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు కురువడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నమోదైన వర్షపాతం పరిశీలిస్తే... అత్యధికంగా కవిటి మండలం రాజపురంలో 15.0 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. వజ్రపుకొత్తూరు మండలంలో అత్యల్పంగా 0.25 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆమదాలవలసలో 14.0, ఇచ్ఛాపురంలో 13.75, శ్రీకాకుళంలో 13.5, ఎచ్చెర్లలో 13.0, సరుబుజ్జిలిలో 11.25, గారలో 11.25, రణస్థలంలో 11.25, పొందూరులో 11.0, సోంపేటలో 10.75, బూర్జలో 9.75, కోటబొమ్మాళిలో 9.25, సంతబొమ్మాళిలో 8.75, పోలాకిలో 7.75, మందసలో 7.5, పలాసలో 7.25, టెక్కలిలో 6.25, జలుమూరులో 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

అప్రమత్తం చేయండి : కలెక్టర్‌  
వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. వంశధార  నదికి 35 వేల క్యూసెక్కుల నీరు చేరడంతో మొదట ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆదివారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వంశధార నదికి  వరద మరింత పెరిగే అవకాశం ఉందని, లోతట్టు గ్రామ ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా కొత్తూరుభామిని, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, సరుబుజ్జిలి, పోలాకి, ఆమదాలవలస, జలుమూరు, నరసన్నపేట మండలాల తహసీల్దార్లు తమ పరిధిలోని ముంపు ప్రాంతాల్లో చాటింపు వేయాలని సూచించారు. కలెక్టర్‌  కార్యాలయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని, ఏ సమస్య ఉన్నా 08942-240557 నంబర్‌కు ఫోన్‌ చేయాలని తెలిపారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా కాశీనగరం నుంచి నీటి ప్రవాహం అధికంగా ఉందన్నారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రెవెన్యూ, పంచాయతీరాజ్‌, పోలీస్‌, నీటిపారుదలశాఖ, విపత్తుల నివారణ సంస్థ, తదితర శాఖ సిబ్బంది సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్‌ డోల తిరుమలరావు మాట్లాడుతూ.. అధికారులు  24 గంటలూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సహాయక చర్యల్లో గ్రామ వలంటీర్లును వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో జేసీ ఎం.విజయసునీత, ఎస్పీ రాధిక , డీఆర్వో ఎం.రాజేశ్వరి, శ్రీకాకుళం, టెక్కలి, పలాస ఆర్డీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


ఉధృతంగా వంశధార
హిరమండలం: ఒడిశాలోని క్యాచ్‌మెంట్‌ ఏరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు వంశధార ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గొట్టాబ్యారేజీ వద్ద నీటి మట్టం పెరుగుతుండడంతో 20 గేట్లు 50 సెంటీమీటర్ల పైకెత్తి వచ్చిన నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. ఆదివారం సాయంత్రం 6గంటలకు 35,199 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా..  37,319 క్యూసెక్కులవరద నీటిని సముద్రంలోకి విడిచి పెట్టారు. ఎడమ ప్రధాన కాలువ ద్వారా 1,670, కుడి ప్రధాన కాలువ ద్వారా 529 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. అర్ధరాత్రికి నదిలో వరద ప్రవాహం 50 వేల క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని డీఈఈ క్రాంతికుమార్‌ చెప్పారు. క్యాచ్‌మెంట్‌ ఏరియాలో ఆదివారం ఉదయం వరకు 250.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని  తెలిపారు.  దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

 

Updated Date - 2022-08-15T05:54:58+05:30 IST