వర్షం..అన్నదాత హర్షం

ABN , First Publish Date - 2022-07-07T09:16:00+05:30 IST

నైరుతి మందగమనంతో కొద్దిరోజులు అరకొర వర్షాలు కురియగా... గడిచిన రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు అన్నదాతలకు ఉపశమనం కలిగించగా, పంటలకు ఊపిరిపోశాయి. జూన్‌లో వర్షాభావ పరిస్థితులు నెలకొనగా.

వర్షం..అన్నదాత హర్షం

  • రాష్ట్రంలో పంటలకు ఊపిరినిచ్చిన వానలు.. 
  • 24 గంటల్లో 22.2 మి.మీ వర్షపాతం 
  • మరో 3 రోజులు అతి భారీ వర్షాలు 
  • ప్రాజెక్టులకు క్రమంగా పెరుగుతున్న వరద
  • శ్రీరాంసాగర్‌కు 16,146 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో 
  • కృష్ణాలో ఆల్మట్టికి 42 వేల క్యూసెక్కులు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): నైరుతి మందగమనంతో కొద్దిరోజులు అరకొర వర్షాలు కురియగా... గడిచిన రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు అన్నదాతలకు ఉపశమనం కలిగించగా, పంటలకు ఊపిరిపోశాయి. జూన్‌లో వర్షాభావ పరిస్థితులు నెలకొనగా... జూలై ఆరంభం నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 8.7 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 22.2 మి.మీ నమోదైంది. అత్యధికంగా నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 49.4 మి.మీ, పెద్దపల్లిలో 47.6 మి.మీ వర్షపాతం నమోదైంది. కరీంనగర్‌, జగిత్యాల, జోగులాంబ గద్వాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, ములుగు, నిర్మల్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కాగా బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 36 శాతం అదనపు వర్షపాతం నమోదైంది. జూన్‌ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు 165.8 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 224.7 మి.మీ వర్షపాతం నమోదుకావటం గమనార్హం. కాగా,  రాగల మూడు రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 


అదేక్రమంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పలుచోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కాగా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద పరవళ్లు తొక్కుతోంది. బుధవారం దుమ్ముగూడెం (సీతమ్మసాగర్‌) ప్రాజెక్టుకు 94868 క్యూసెక్కుల వరద వస్తుండగా... సమ్మక్క బ్యారేజీ(తుపాకులగూడెం)కు 91500 క్యూసెక్కుల వరద వచ్చిచేరుతోంది. ఇక  కాళేశ్వరంలోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీకి 43,600, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 16,146, శ్రీపాద ఎల్లంపల్లికి 16508 క్యూసెక్కుల వరద వచ్చింది. ఇక కృష్ణా బేసిన్‌లో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఆల్మట్టి ప్రాజెక్టుకు 42858 క్యూసెక్కుల నీరు చేరింది. తుంగభద్రకు 34075 క్యూసెక్కులు వచ్చింది.  కాగా,  ఎగువ భాగాన కురిసిన భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం బుధవారం సాయంత్రం 15 అడుగులకు చేరుకుంది. పాల్వంచ మండలం కిన్నెరసాని రిజర్వాయర్‌ నీటిమట్టం 402.20 అడుగులకు చేరుకుంది. మేడిగడ్డ ప్రాజెక్టుకు ఎగువనుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో దిగువన ఉన్న సీతమ్మసాగర్‌ కాపర్‌ డ్యాం నీట మునిగింది,  


కాళేశ్వరం కింద 57 వేల ఎకరాలకు నీరు

వానాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 23.89 లక్షల ఎకరాల్లో వరి పంట సాగును నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నుంచి ఈ మేరకు నీటిని ఇవ్వాలంటూ గత నెల 14న సివమ్‌ (రాష్ట్రస్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక) కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 23 భారీ ప్రాజెక్టులు, 36 మధ్యతరహా ప్రాజెక్టుల కింద ఖరీ్‌ఫలో మొత్తం 39.04లక్షల ఎకరాలకు 365.74 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 57,600 ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. దీనికింద 48,500ఎకరాల్లో వరికి, 9100 ఎకరాల్లో ఆరుతడి పంటలకు నీరి వ్వాలని నిర్ణయించారు. జూలై ఆఖరులోగా నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని ఈఎన్‌సీ, సీఈలకు ప్రభుత్వం గుర్తు చేసింది. 


సాగు సంబురం

నైరుతి రుతుపవనాల ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వానలతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సాగు పనులు ముమ్మరమయ్యాయి. బోరుబావుల ఆధారిత సాగుతో పాటు వర్షాధార మెట్టసాగు, ప్రాజెక్టుల కింద సాగు మొదలైంది. సిరిసిల్ల జిల్లాలో వరినాట్లు జోరందుకున్నాయి. స్థానికంగా వ్యవసాయ కూలీల కొరత ఉండడంతో బెంగాల్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, తదితర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి వరి నాట్లు వేయించుకుంటున్నారు. 

Updated Date - 2022-07-07T09:16:00+05:30 IST