చినుకు రాలదు.. అరక సాగదు!

ABN , First Publish Date - 2022-06-28T05:35:04+05:30 IST

జిల్లాలో ఈ ఏడాది తొలకరి సాగుకు వాతావరణం అనుకూలంగా కనిపించడం లేదు. జూన్‌ ఆఖరివారం వచ్చినా పంటల సాగుకు ఉపకరించే విధంగా చినుకులు రాలక.. అరకలు సాగక రైతులు ఆందోళన చెందుతున్నారు.

చినుకు రాలదు.. అరక సాగదు!
ఒంగోలు సమీపంలో దుక్కి దున్నివదిలేసిన చేను

నైరుతి మందగమనం 

జిల్లాలో వర్షాభావ పరిస్థితి

తొలకరి సాగుకు అనుకూలించని వాతావరణం

దుక్కులు దున్ని వాన కోసం రైతుల ఎదురుచూపు

వేసిన పైర్లు వాడుముఖం

మబ్బులు కమ్మి చల్లబడుతున్నా కురవని వర్షం

ఒంగోలు, నాగులుప్పలపాడు, మద్దిపాడు మండలాల్లో నువ్వు, పెసర, మినుము పైర్లు సాగు చేశారు. ముందుగా వేసిన  నువ్వు మొలిచి అడుగు ఎత్తున  పెరిగింది. మిగతా పంటలు కొన్నిచోట్ల మొలకెత్తలేదు. పంట వేసి 40రోజులు దాటినా చినుకు జాడలేదు. దీంతో మొక్కలు పూర్తిగా గిడసబారిపోయాయి. మినుము, పెసర కూడా ఎదుగుదల లోపించి చీడ ఆశించడంతో ఆకులకు రంధ్రాలు పడిపోయాయి. ఏవీ చేతికొచ్చే పరిస్థితి లేకుండాపోయింది. 

కంభం, బేస్తవారపేట, అర్ధవీడు మండలాల్లో వర్షం జాడ కరువైంది. జూన్‌లో కంభం సబ్‌డివిజన్‌లో 6వేల హెక్టార్లలో పైర్లు సాగు కావాల్సి ఉన్నా కేవలం 500 ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి. ఈ ఏడాది తొలకరి సాగుపై దాదాపు ఆశలు వదులుకునే పరిస్థితి నెలకొంది. మేలో 60మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 10మి.మీ మించి కురవలేదు. జూన్‌లో 65మి.మీ కురవాల్సి ఉండగా 10 మి.మీ మాత్రమే పడింది.

రైతులను ఏటా వాన కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. జూన్‌ ముగుస్తున్నా చినుకు రాలక తొలకరి పంటల సాగుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ముమ్మరంగా వర్షాలు కురిసి పొలాల్లో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావాల్సిన తరుణంలో ఎండలు మండిపోతున్నాయి. వానలు కురవక, అరక సాగక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా జిల్లాలోని పశ్చిమప్రాంతంపై గత మూడేళ్లుగా వరుణుడు అలకబూనాడు. ఈసారి కొందరు రైతులు ఆశతో భూములను దున్ని వర్షం పడితే పంటలు వేసేందుకు సిద్ధపడగా, మరికొందరు వర్షాభావంతో దున్నేందుకు సైతం ముందుకు రావడం లేదు. దీంతో  అక్కడి భూములన్నీ బీళ్లుగా దర్శనమిస్తున్నాయి.

ఒంగోలు, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి)/ ఒంగోలు(రూరల్‌): జిల్లాలో ఈ ఏడాది తొలకరి సాగుకు వాతావరణం అనుకూలంగా కనిపించడం లేదు. జూన్‌ ఆఖరివారం వచ్చినా పంటల సాగుకు ఉపకరించే విధంగా చినుకులు రాలక.. అరకలు సాగక రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  ప్రవేశించిన నైరుతి రుతుపవనాలతో వర్షాలు పడుతూ వ్యవసాయ సీజన్‌ పనులు ప్రారంభం కాగా జిల్లాలోని రైతులు మాత్రం వాన కోసం ఆకాశం వైపు చూస్తూ నిరాశ చెందుతున్నారు. ఏరువాక వెళ్లి పది రోజులు గడిచినా మృగశిర కార్తె పోయి ఆరుద్ర వచ్చినా ఆకాశంలో మబ్బులు పట్టి వాతావరణం చల్లబడటం తప్ప చినుకు రాలడం లేదు. దీంతో పంటల సాగు ముందుకు సాగకపోగా పొలంలో ఉన్న పైర్లు సైతం వాడుముఖం పట్టాయి. సాధారణంగా ప్రస్తుత సమయానికి జిల్లాలో లక్షా 80వేల హెక్టార్లలో ఖరీఫ్‌ పంటలు సాగవుతాయి. అందులో ఇంచుమించు 75వేల హెక్టార్లలో ఒక్క కంది పంట ఉంటుంది. పత్తి, మిర్చి, వరి వంటివి ఒక్కొక్కటి ఇంచుమించు 25నుంచి 30వేల హెక్టార్లలో సాగవుతాయి. మిగిలిన విస్తీర్ణంలో నువ్వు, పెసర, మినుము, సజ్జ, ఇతరత్రా ఆహార, పశుగ్రాస పంటలు వేస్తారు. 


పచ్చిరొట్ట, కంది సాగు ఎక్కువ

ఖరీఫ్‌ సీజన్‌ జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు కాగా జిల్లాలో మేలో కురిసే చెదురుమదురు వర్షాలతో రైతులు మే ఆఖరు నుంచే తొలకరి పైర్లు వేస్తారు. ప్రధానంగా  మాగాణి ప్రాంతంలో రబీ వరి సాగు చేసే పొలంలో పెసర, పొగాకు.. శనగ సాగు చేసే ప్రాంతంలో నువ్వు, సజ్జలతోపాటు జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట ఎరువు పైర్లు, పశుగ్రాస పంటలు సాగు చేస్తారు. జూన్‌ రెండో పక్షం నుంచి ప్రధాన ఖరీఫ్‌ పంటల సాగుకు ఉపక్రమించే రైతులు ఏరువాక నుంచి ఆ పంటల సాగుకు వీలుగా దుక్కులు దున్ని సిద్ధం చేస్తారు. అలాంటిది ఈ ఏడాది జూన్‌ ముగింపునకు వచ్చినా తొలకరి పైర్లు వేయలేకపోయారు. వాస్తవానికి మే రెండో వారంలో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో ఈ సీజన్‌ సాగుకు వాతావరణం అనుకూలిస్తుందన్న ఆశతో రైతులు తొలకరి పైర్ల సాగుకు సిద్ధమయ్యారు. అయితే అప్పుడు కురిసిన వర్షాలతో భూములు దున్నిన రైతులు మరో వర్షం కురిస్తే విత్తనాలు వేద్దామని సిద్ధం చేసుకోగా అత్యధిక ప్రాంతాల్లో ఇంచుమించు నెలన్నర రోజులుగా సరైన వర్షమే లేదు.


వేసిన పంటలు వాడుముఖం

కొద్దిప్రాంతాల్లో మాత్రమే నువ్వు, పశుగ్రాస పంటలు వేయగలిగినా నెల రోజులకు పైగా జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో అవి కూడా వాడుముఖం పట్టాయి. సాధారణంగా ఈ సమయానికి జిల్లాలో తొలకరి పంటలైన సజ్జ, నువ్వు, పెసర వంటివి 15వేల హెక్టార్లలో సాగు కావాలి. అలాగే పశుగ్రాస  పంటలు మరో నాలుగైదు వేల హెక్టార్లలో వేస్తారు. ఇక వేసవిలో వేసిన పత్తి మరికొంత విస్తీర్ణంలో ఉంటుంది. అలా ఈ సమయానికి జిల్లాలో 20వేల నుంచి 25వేల హెక్టార్లలో పైర్లు ఉండటంతోపాటు కీలక ఖరీఫ్‌ పంటల సాగుకు వీలుగా భూములు సిద్ధం చేసే పక్రియ సాగుతుంటుంది. అలాంటిది ప్రస్తుతం వర్షాభావం వెంటాడుతోంది. ఈనెలలో జిల్లాలో సాధారణ వర్షపాతం 58.0మి.మీ కాగాఅందులో ఇప్పటివరకు 51మి.మీ కురవాల్సి ఉంది. కానీ 38మి.మీ మాత్రమే పడింది.  


కనిపించని నైరుతి ప్రభావం

ఇప్పటివరకు కేవలం 6,865 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగు కాగా అందులో సగం విస్తీర్ణం వేసవి పత్తి ఉంది. మిగిలిన దానిలో నువ్వు, పశుగ్రాస పంటలు ఉండగా దాదాపు మూడు వారాలకుపైగా జిల్లాలో ఎక్కడా కొత్తగా విత్తనం వేసిన దాఖలాలు లేవు. పైగా పొలంలో ఉన్న పైర్లు సైతం వాడుమఖం పట్టాయి. ఇదిలాఉండగా జిల్లాలో నైరుతి రుతుపవనాల ప్రభావం అంతగా కనిపించడం లేదు. వారం క్రితం వరకూ ఎండల తీవ్రత అధికం గానే ఉంది. మూడు, నాలుగు రోజులుగా  ఆకాశంలో మబ్బులు పట్టి వాతావరణం కొంత చల్లబడినప్పటికీ చినుకు మాత్రం రాలడం లేదు. ఇప్పటికే తొలకరి మించిపోతుండగా ఖరీఫ్‌ కీలక పంటల సాగుకు దుక్కులు దున్నిన రైతులు నిత్యం వాన కోసం ఆకాశం వైపు ఆశతో చూస్తూ ఆందోళన చెందుతున్నారు. 




Updated Date - 2022-06-28T05:35:04+05:30 IST