గేట్లెత్తేశారు.. జంట జలాశయాల నీరు మూసీపాలు!

ABN , First Publish Date - 2021-09-05T15:54:00+05:30 IST

గేట్లెత్తేశారు.. జంట జలాశయాల నీరు మూసీపాలు!

గేట్లెత్తేశారు.. జంట జలాశయాల నీరు మూసీపాలు!

హైదరాబాద్‌ సిటీ : హైదరాబాద్‌ జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ గేట్లను మరోసారి ఎత్తారు. నీరు వృథాగా మూసీనది పాలవుతోంది. ఒక సీజన్‌లో రెండు సార్లు జలాశయాల గేట్లను ఎత్తి నీటిని వదలడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. నగర అవసరాలకు జంట జలాశయాల నీటిని వినియోగించడంలో అధికారులు విఫలమయ్యారని నిపుణులు అంటున్నారు. జంట జలాశ యాల నుంచి వాటర్‌బోర్డుకు రోజుకు కేవలం 20 మిలియన్‌ గ్యాలన్ల నీటిని మాత్రమే తీసుకునే సామర్థ్యం ఉంది.


ఇక్కడి నీటిశుద్ధి కేంద్రాలు ఏళ్లనాటివి కావడంతో ప్రస్తుతం రోజుకు 16 మిలియన్‌ గ్యాలన్ల నీటిని మాత్రమే వినియోగిస్తున్నారు. జంట జలాశయాల వద్ద రోజుకు 90మిలియన్‌ గ్యాలన్ల నీటిని వినియోగించుకునే సామర్థ్యం కలిగిన నీటిశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి గతంలో ప్రతిపాదనలు రూపొందిం చినా, ఆచరణలో జరిగింది లేదు. గండిపేట జలాశయం నుంచి నగర ప్రజలకు తాగునీటిని సరఫరా చేసేందుకు నాడు షేక్‌పేట, ఆసిఫ్‌నగర్‌ (మెహిదీపట్నం)లో ఫిల్టర్‌బెడ్స్‌ను నిర్మించారు. హిమాయత్‌ సాగర్‌ జలాశయం నుంచి నగర ప్రజలకు తాగునీటిని సరఫరా చేసేందుకు మిరాలం వద్ద ఫిల్టర్‌బెడ్స్‌ను ఏర్పాటు చేశారు. నీటిని శుద్ధి చేసిన తర్వాత నగరానికి తరలిస్తారు. ఆయా ఫిల్టర్‌బెడ్స్‌ వరకు నీటిని గ్రావిటీ ద్వారా తరలించేందుకు ఆనాడు రాతి కాలువలను నిర్మించారు. గ్రావిటీ ద్వారా వచ్చే 16 మిలియన్‌ గ్యాలన్ల వరకు మాత్రమే రోజూ శుద్ధి చేస్తున్నారు.


ఉస్మాన్‌సాగర్‌ నుంచి రోజుకు 8.7 మిలియన్‌ గ్యాలన్ల నీటిని తెస్తుండగా, హిమాయత్‌సాగర్‌ నుంచి 7.2 మిలియన్‌ గ్యాలన్ల నీటిని తీసుకుంటున్నారు. దశాబ్దాలపాటు నగరవాసుల దాహార్తి తీర్చిన ఈ జంట జలాశయాలు విస్తరించిన మహానగరం నీటి అవసరాలు పూర్తిగా తీర్చలేకపోయాయి. దీంతో నగర ప్రజలు అదనంగా సింగూరు, మంజీర, కృష్ణా, గోదావరి జలాలపై ఆధారపడాల్సి వచ్చింది. భారీగా కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు నిండడంతో  అధికారులు గేట్ల ను ఎత్తి దిగువకు నీళ్లను వదులుతున్నారు. 


గతేడాది వారం రోజులపాటు నీటిని దిగువకు వదలగా, ఈ సీజన్‌లోనూ ఇప్పటికే రెండుసార్లు గేట్లు ఎత్తి నీటిని వదిలారు. 90 మిలియన్‌ గ్యాల న్ల నీటిశుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తే జంట జలాశయాల నుంచి నీటిని ఎప్పటికప్పుడు వినియోగించు కోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. జంట జలాశయాలను కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాలతో నింపుతామని సీఎం కేసీఆర్‌ హామీనిచ్చారని, ఈ నేపథ్యంలోనైనా 90 మిలియన్‌ గ్యాలన్ల నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని సూచిస్తున్నారు.

Updated Date - 2021-09-05T15:54:00+05:30 IST