వాన జాడ కరువై... ఎండుతున్న వేరుశనగ

ABN , First Publish Date - 2021-09-29T05:44:16+05:30 IST

మండలంలో సాగు చేసిన వేరుశనగ పంట బెట్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం పంట ఊడలు, బుడ్డ లు దిగే దశలో ఉంది.

వాన జాడ కరువై... ఎండుతున్న వేరుశనగ
వర్షం లేక బెళుగుప్పలో ఎండుతున్న వేరుశనగ పంట

బెళుగుప్ప, సెప్టెంబరు 28: మండలంలో సాగు చేసిన వేరుశనగ పంట బెట్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం పంట ఊడలు, బుడ్డ లు దిగే దశలో ఉంది. వరుణుడు మొహం చాటేయడంతో పంటకు నీటి జాడ లేక ఎండిపోతోంది. నెల రోజులకు పైగా తీవ్ర వర్షాభావంతో వేరుశనగ రైతుల ఆశలన్నీ ఆఅవిరవుతున్నాయి. మండలంలో ఎర్రనేల భూముల రైతులకు వేరుశనగ పంట ప్రధాన జీవనాధారం. సుమారు 7800 హెక్టార్ల లో వేరుశనగ సాగుచేశారు. ఈపంటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులకు ప్రతిఏటా కరువు పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఈ ఏడాదీ క ష్టాలు తప్పడంలేదు. విత్తన సాగుకు వేలాది రూపాయలు వెచ్చించారు. ఎ కరాకు రూ.15వేలకు పైగా ఖర్చుపెట్టామని, ప్రస్తుతం వరణుడు కరుణించకపోవడంతో దిక్కుతోచడం లేదంటూ వేరుశనగ రైతులు వాపోతున్నారు. పంటకాపు దశలో తేమలేక పైర్లు నిలువునా ఎండిపోతున్నాయి. ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. 


నమ్ముకున్న పంట నిలువునా ముంచుతోంది:

రైతు లక్ష్మానాయక్‌, బెళుగుప్ప తండా

వేరుశనగ పంట మాకు వ్యవసాయ జీవనాధారం. ఎంతో ఆశతో వేలాది రూపాయలు పెట్టు బడి పెట్టి 10 ఎకరాల్లో వేరుశనగ పంట సాగుచేశా. వర్షం లేక నిలువునా ఎండిపోతోంది. పంట కాపు దశలో ఉంది. తేమలేక వేరుకుళ్లు తెగులు సోకింది. ప్రతి ఏటా దిగుబడులురాక అప్పులు పాలవుతున్నాం. ప్రభుత్వమే ఆదుకోవాలి. 


యూరియా పిచికారీ చేయాలి:

జగదీ్‌షబాబు, వ్యవసాయాధికారి, బెళుగుప్ప 

వర్షం లేక తేమశాతం తక్కువగా ఉండడంతో పైర్లు ఎండిపోతున్నాయి. వేరుశనగ పంట వాడుపట్టింది. లీటరు నీటికి 2 గ్రాముల యూరియా పిచికారీ చేయాలి. దీంతో కొది రోజులు ఎండ నుంచి మొక్క తట్టుకోగలదు. ఎకరాకు 200 లీటర్లు పిచికారీ చేయాలి. వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలని ఆయన కోరారు.


Updated Date - 2021-09-29T05:44:16+05:30 IST