వదలని వర్షం

ABN , First Publish Date - 2022-08-10T06:14:52+05:30 IST

వరుణుడు వదలడం లేదు. నెల రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మళ్లీ రెండు రోజులుగా ముసురుతో కూడిన వర్షం పడుతోంది. ముసురులోనే రైతులు వరినాట్లు వేసుకుంటున్నా అధిక వర్షాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

వదలని వర్షం
వర్షంలో నాట్లు వేస్తున్న మహిళలు

- రెండు రోజులుగా ముసురు 

- జిల్లాలో పెరిగిన భూగర్భ జలాలు 

- బోయినపల్లిలో 1.43 మీటర్ల లోతున నీళ్లు 

- సరాసరి 3.91 మీటర్ల లోతులో భూ గర్భజలాలు 

- ఈ సీజనల్‌లో అధిక వర్షపాతం 

  (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

వరుణుడు వదలడం లేదు. నెల రోజులుగా  వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మళ్లీ రెండు రోజులుగా ముసురుతో కూడిన వర్షం పడుతోంది. ముసురులోనే రైతులు వరినాట్లు వేసుకుంటున్నా అధిక వర్షాలతో  ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ సారి సాధారణ వర్షపాతానికి మించి  కురవడంతో జిల్లాలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. జూన్‌లో 9.37 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు జూలై 31 వరకు 3.91 లోతులో ఉబికి వచ్చాయి. గత సంవత్సరం జూలైలో 5.20 మీటర్ల లోతులో ఉండగా ఈ సారి మరింత పెరిగాయి. బోయినపల్లి మండలంలో 1.43 మీటర్ల లోతులోనే నీళ్లు లభ్యమవుతుండగా వేముల వాడ అర్బన్‌లో 13 మీటర్లలో ఉన్నాయి. జిల్లాలో గతంలో పాతాళంలో నీళ్లు ఉండేవి. కాళేశ్వరం జలాలకు తోడుగా అధిక వర్షాలతో జిల్లాలోని చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి.  వాగులు, ఒర్రెలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో జిల్లాలో భూగర్భ జలాలు పెరిగాయి.  జిల్లాలో భూగర్భ జలాల పెరుగుదల ఇప్పటికే ముస్సోరిలో ఐఏఎస్‌లకు పాఠ్యాంశంగా చేర్చారు.  

అధికవర్షాలతో అన్నదాత ఉక్కిరిబిక్కిరి 

అధిక వర్షాలతో అన్నదాతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో ఇప్పటికే వానాకాలం సాగు నాట్లు చివరి దశకు చేరుకోవాలి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సాగు పనులు అలస్యమవుతున్నాయి. జిల్లాలో 2.44 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు లక్ష్యంగా ఉండగా ఇప్పటివరకు 1.71 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. 1.50 లక్షల ఎకరాల వరి సాగుకు 110840 ఎకరాల్లో నాట్లు పడ్డాయి. పత్తి 80,900 ఎకరాలకు  58,654 ఎకరాల్లో విత్తనాలు వేసుకున్నారు. మొక్కజొన్న 807 ఎకరాలు, కందులు 1295 ఎకరాలు, పెసర 93 ఎకరాల్లో వేశారు.  మళ్లీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వర్షాలు మొదలవడంతో ఆందోళన చెందుతున్నారు. 

జిల్లాలో సాధారణం కంటే 82 శాతం అధికం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 82 శాతం అధికంగా నమోదైంది. ఇప్పటి వరకు 446.0 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి  810.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మంగళవారం పొద్దంతా వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో మంగళవారం ముసురుతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలో సరాసరి 4.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బోయినపల్లి మండలంలో 10.8 మిల్లీమీటర్లు,  అత్యల్పంగా ఇల్లంతకుంట మండలంలో 0.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.  రుద్రంగి 9.9,  కోనరావుపేట 8.3,  చందుర్తి 6.6, వేములవాడ 6.1, గంభీరావుపేట 4.2, వేములవాడ రూరల్‌లో 4.0,  సిరిసిల్ల 3.1, ఎల్లారెడ్డిపేట 1.9, ముస్తాబాద్‌ 1.3, తంగళ్లపల్లిలో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.




Updated Date - 2022-08-10T06:14:52+05:30 IST