హైదరాబాద్: భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమైంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కూడా కురుస్తోంది. పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండటంతో బీజేపీ సభకు వెళ్లేందుకు ఆ పార్టీ కార్యకర్తలు ఇబ్బందిపడుతున్నారు. కాసేపట్లో పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయసంకల్ప సభ మొదలుకానుంది. ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు బీజేపీ ముఖ్య నేతలంతా ఈ సభలో పాలుపంచుకుంటుండటంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వర్షం పడినా సభకు ఆటంకం కలగకుండా ఉండేలా సభా ప్రాంగణాన్ని మందపాటి టెంట్లతో కవర్ చేశారు. విజయసంకల్ప్ సభలో మోదీ ప్రసంగంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీపై కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.
కేసీఆర్ 9 ప్రశ్నలు సంధించి మరీ సభలో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సవాల్‌పై ప్రధాని ఎలా స్పందిస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. పరేడ్ గ్రౌండ్స్ సభలో ప్రధాని మోదీ ఏం చెప్పబోతున్నారు? కేసీఆర్ సవాల్‌ను ప్రధాని మోదీ స్వీకరిస్తారా? మోదీ ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు? బీజేపీ దగ్గరున్న లెక్కలేంటనే ప్రశ్నలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సాయంత్రం 6.30 గంటలకు సభా వేదికపైకి ప్రధాని మోదీ రానున్నారు. సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగం చేసే అవకాశం ఉంది. బహిరంగ సభ అనంతరం అక్కడి నుంచి నేరుగా ప్రధాని మోదీ రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. రాజ్‌భవన్‌లోనే ప్రధాని రాత్రి బస చేయనున్నారు.