వర్షమొస్తే ఎలా..?

ABN , First Publish Date - 2022-07-05T06:40:57+05:30 IST

వారంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో తలలు పట్టుకుని కూర్చున్నారు.

వర్షమొస్తే ఎలా..?
విజయవాడ రూరల్‌ మండలంలోని జగనన్న లే అవుట్‌

ఆందోళన చెందుతున్న జగనన్న ఇళ్ల లబ్ధిదారులు

 జిల్లావ్యాప్తంగా లే అవుట్లలో మౌలిక సౌకర్యాలు శూన్యం

 వర్షం వస్తే ప్లాట్లు బురదమయం

 పనులు ఎలా జరపాలంటున్న లబ్ధిదారులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అసలే వర్షాకాలం.. ఆపై మౌలిక సౌకర్యాలు శూన్యం.. ఎప్పుడు ఏమవుతుందా.. అని జగనన్న ఇళ్ల లబ్ధిదారులు భయాందోళన చెందుతున్నారు. వారంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో తలలు పట్టుకుని కూర్చున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని చాలా లే అవుట్లు లోతట్టు ప్రాంతాల్లోనే ఉన్నాయి. మెరక చేసే పరిస్థితి కూడా లేదు. ప్లాట్లు, రోడ్లు, ఇతర కామన్‌ సర్వీసుల కోసం మార్కింగ్‌ వేశారు. ఆ తరువాత అధికారులు పట్టించుకోకపోవడంతో  లబ్ధిదారులే సొంత ఖర్చుతో ఎవరి ప్లాట్లను వారు మెరక చేసుకుంటున్నారు. ఆ తరువాత ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 80 వేల ఇళ్ల నిర్మాణాలు తలపెట్టగా, ఇప్పటి వరకు కేవలం 5 వేలే పూర్తయ్యాయి. 25 వేల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. చాలా ఇళ్లు బేస్‌మెంట్‌ దశకే రాలేదు. వేసవిలో మందకొడిగా సాగిన పనులు.. వర్షాకాలంలో అయినా ఊపందుకుంటాయనుకుంటే మౌలిక సదుపాయాల లేమి పెద్ద సమస్యగా మారింది.

గత వర్షాకాలంలోనూ ఇంతే..!

కిందటి వర్షాకాలంలో జిల్లావ్యాప్తంగా జగనన్న లే అవుట్లు వర్షపు నీటితో నిండిపోయాయి. ఈ వేసవిలో ఎండల కారణంగా కొంత మేర పనులు చేపట్టారు కాబట్టి కాస్త పురోగతి ఉంది. అయినా భారీ వర్షం కురిస్తే ప్లాట్లు బురదమయమయ్యే అవకాశాలున్నాయి. లే అవుట్లలో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్ల పనులు ముందుకు సాగే పరిస్థితి కూడా ఉండదు. జిల్లాలో ఒక్క లే అవుట్‌లో కూడా రోడ్లు, డ్రెయిన్లు, స్ర్టామ్‌ వాటర్‌ డ్రెయిన్లు, మంచినీటి పైపులైన్లు, విద్యుత్‌ స్తంభాలు, వీధి దీపాల ఏర్పాటు వంటివి లేవు. 

మౌలిక సదుపాయాలకు నిధులేవీ?

జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఒక్క ఎన్టీఆర్‌ జిల్లాలోనే రూ.1,200 కోట్ల మేర ఖర్చవుతుంది. దీనికి సంబంధించిన అంచనాలను జిల్లా పంచాయతీరాజ్‌ శాఖ విభాగం ఇప్పటికే సిద్ధం చేసింది. అయితే, ప్రభుత్వం నుంచి నయాపైసా విడుదల కాలేదు. ఇక ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు బోర్లు వేశారు గానీ, పైపులైన్లు ఏర్పాటు చేయలేదు. 


Updated Date - 2022-07-05T06:40:57+05:30 IST