చినుకు వణుకు

ABN , First Publish Date - 2021-04-24T04:49:58+05:30 IST

దాళ్వా పంట మాసూళ్ళకు వాతావరణ మార్పు గడిగడి గండంగా మారింది.

చినుకు వణుకు
మబ్బుగా ఉండడంతో పాలకోడేరులో బరకంతో రక్షణ

అకాలవర్షంతో అన్నదాత ఆందోళన

వరుణుడి కరుణకు వేడుకోలు

భీమవరంరూరల్‌/కాళ్ళ/ఆచంట/ఉండి/ ఆకివీడు/ వీరవాసరం/ పోడూరు,  ఏప్రిల్‌ 23 : దాళ్వా పంట మాసూళ్ళకు వాతావరణ మార్పు గడిగడి గండంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు ఎక్కడ నష్టాల పాలు చేస్తాయోనని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. వాతావరణంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా మార్పు వచ్చి చినుకులు పడడంతో రైతాంగ గుండెల్లో గుబులు మొదలైంది. కల్లాల్లో వేసిన ధాన్యం రాసులు ఒబ్బిడి చేసేందుకు రైతన్నలు పరుగులు పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో పంట చేలలో వర్షం నీరు చేరడంతో మాసూళ్ళుకు మరికొన్ని రోజులు పట్టేలా చేసిందని రైతులు అంటున్నారు. గడిచిన నాలుగు రోజులుగా చిన్నపాటి చినుకులు, జల్లులు, పంట మాసూళ్లు చేయడానికి ముందుకు వెళ్లకుండా ఆపేస్తున్నాయి. కోతలు పూర్తయిన రైతులు మాత్రం ఆరబెట్టిన ధాన్యాన్ని గుట్టలుగా పెట్టి బరకాలు కప్పారు. మరికొంత మంది తూకం తూసి విక్రయిస్తున్నారు. దాళ్వా పంటలో కూడా పకృతి రైతాంగాన్ని వెంటాడుతుందని పలువురు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే వాతావరణం ఉంటే పంట గట్టెక్కేది ఎలా అన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. కాళ్ల మండలంలో సుమారు 8 వేల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. ఇప్పటికే 40 శాతం మేర కోతలు పూర్తయ్యాయి. ఆకివీడు మండలంలో 2989 హెక్టార్లలో వరిసాగు చేశారు. ప్రస్తుతానికి 1800 హెక్టార్లలో కోతలు కోశారని ఏదో ప్రియాంక శుక్రవారం తెలిపారు. కోతకు సిద్ధంగా ఉన్న పంట పొలాలు అకాల వర్షం వస్తే నష్టపోయే అవకాశం ఉందని అన్నదాతలు గాబరా పడుతున్నారు. కోతలు పూర్తయ్యే వరకూ వరుణుడు కరుణించాలని ఆకాశం వైపు చూసి రైతులు వేడుకుంటున్నారు. 

Updated Date - 2021-04-24T04:49:58+05:30 IST