వాన లేక.. మొక్కలకు కాక!

ABN , First Publish Date - 2021-06-23T09:09:30+05:30 IST

తొలకరిలో మురిపించిన వాన పత్తా లేకుండా పోవడంతో రైతులు తల పట్టుకుంటున్నారు.

వాన లేక.. మొక్కలకు కాక!

  • వాడుతున్న మొక్కలకు నీళ్లు పోస్తున్న రైతులు
  • నెమ్మదించిన ప్రాణహిత..  మేడిగడ్డలో ఒక గేటు ఎత్తివేత


భీంపూర్‌, మహదేవపూర్‌, ఖమ్మం, జూన్‌ 22: తొలకరిలో మురిపించిన వాన పత్తా లేకుండా పోవడంతో రైతులు తల పట్టుకుంటున్నారు. తడి లేక మొలకెత్తిన పత్తి, ఇతర ఆరుతడి పంట మొక్కలు నీళ్లు లేక వాడిపోతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండల పరిధిలో రెండు వారాల క్రితమే విస్తృతంగా పత్తిపంటను సాగు చేశారు. ఇప్పటికే పెట్టుబడి కోసం వేలల్లో ఖర్చుచేయడంతో మొలిచిన మొక్కలను బతికించుకునేందుకు బిందెలు, స్ర్పే పంపులతో నీళ్లు పోస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 10 రోజులుగా పత్తి విత్తనాలు వేస్తున్నారు. ఇప్పటిదాకా జిల్లావ్యాప్తంగా 25వేల ఎకరాల్లో పత్తి పంట వేశారు. చాలాచోట్ల విత్తనాలు మొలకెత్తినా.. వానలు లేకపోవడంతో వాడిపోతున్నాయి. ఇక కాళేశ్వరానికి ప్రాణాధారమైన ప్రాణహిత ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. వారం రోజుల క్రితం ఉప్పొంగిన ఈ నది, ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కాళేశ్వరం వద్ద నెమ్మదించింది. దీంతో మేడిగడ్డకు బ్యారేజీలోకి 17వేల క్యూసెక్కుల నీరే వస్తోంది. మరో 5,400 క్యూసెక్కుల నీటిని కన్నెపల్లి పంప్‌హౌజ్‌లోని 11 మోటార్ల ద్వారా అన్నారం బ్యారేజీలోకి ఎత్తిపోస్తున్నారు. మేడిగడ్డలో 10.62 టీఎంసీల నీరు ఉండగా ఒక్క గేటు ఎత్తి 1400 క్యూసెక్కులను వదులుతున్నారు. అన్నారం పంప్‌హౌజ్‌ నుంచి 20,500 క్యూసెక్కుల నీటిని సుందిళ్ల బ్యా రేజీలోకి ఎత్తిపోస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-06-23T09:09:30+05:30 IST