సీబీఐ ప్రశ్నల వర్షం

ABN , First Publish Date - 2020-06-02T08:48:22+05:30 IST

డాక్టర్‌ సుధాకర్‌ కేసు దర్యాప్తులో సీబీఐ అధికారులు వేగం పెంచారు..

సీబీఐ ప్రశ్నల వర్షం

ఫోర్త్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సుమారు ఐదు గంటల పాటు సాగిన విచారణ

కేసు సీడీ ఫైల్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన సీబీఐ అధికారులు

సీబీఐ కార్యాలయంలో డాక్టర్‌ సుధాకర్‌ కుమారుడిని విచారించిన మరో బృందం 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ సుధాకర్‌ కేసు దర్యాప్తులో సీబీఐ అధికారులు వేగం పెంచారు. రెండు బృందాలుగా విడిపోయి సోమవారం విచారణ సాగించారు. ఇద్దరు అధికారులతో కూడిన బృందం డాక్టర్‌ సుధాకర్‌ను పోలీసులు గత నెల 16న అదుపులోకి తీసుకున్న ప్రాంతాన్ని సందర్శించింది. అనంతరం కార్యాలయానికి చేరుకుని విచారణలో భాగంగా పోలీసులు, బాధితుడు ఇచ్చిన వాంగ్మూలాలు, సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అయిన వీడియోల ఆధారంగా ఒక రిపోర్టు తయారుచేసింది. ఆ తరువాత ఇరువురూ సాయంత్రం ఐదు గంటలకు అధికారులు ఫోర్త్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు.


అదే సమయంలో ఈస్ట్‌ ఏసీపీ కులశేఖర్‌, ద్వారకా ఏసీపీ మూర్తి అక్కడకు చేరుకోవడంతో అందరూ కలిసి సీఐ గదిలో సమావేశమయ్యారు. కేసు సీడీ ఫైల్‌ను ఎస్‌ఐ సూర్యనారాయణ నుంచి తీసుకున్నారు. సుమారు 170 పేజీలున్న సీడీ ఫైల్‌ను సీబీఐ అధికారులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అనంతరం తమ దర్యాప్తునకు అవసరం లేదని భావించిన కొన్ని పేపర్లను అందులో నుంచి తొలగించారు. సీడీ ఫైల్‌లోని ప్రతి పేజీపైనా ఎస్‌ఐతో సంతకం చేయించారు. అనంతరం స్టేషన్‌లో ఏసీపీలతో సుమారు ఐదు గంటలపాటు భేటీ అయ్యారు. ఘటనకు సంబంధించి మొదట సమాచారం అందడం మొదలుకుని, సమాచారం అందుకున్న సిబ్బంది, ఘటనా స్థలానికి వెళ్లిన సిబ్బంది, వారిని అక్కడికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు ఇచ్చిన అధికారుల వివరాలు, వాటికి సంబంధించిన ఆధారాలపై ఆరా తీశారు.


డాక్టర్‌ సుధాకర్‌ను స్టేషన్‌కు తీసుకువచ్చిన సమయం, తీసుకువచ్చిన సిబ్బంది, ప్రైవేటు వ్యక్తుల వివరాలు, డాక్టర్‌ సుధాకర్‌ను స్టేషన్‌కు తీసుకువచ్చినపుడు స్టేషన్‌ రికార్డుల్లో నమోదు, ఆస్పత్రికి తీసుకువెళ్లడం వంటి వివరాలను తెలుసుకున్నారు. సాధారణంగా ఎవరినైనా అరెస్టు చేసినప్పుడు ఆస్పత్రికి తరలిస్తారా? లేక ప్రత్యేకంగా డాక్టర్‌ సుధాకర్‌ను మాత్రమే తీసుకువెళ్లారా? అనేదానిపై కూడా పోలీసులను ఆరా తీసినట్టు తెలిసింది. రాత్రి పది గంటల సమయంలో సీబీఐ అధికారులు స్టేషన్‌ నుంచి బయటకు వెళ్లిపోయారు. కాగా మరో బృందం డాక్టర్‌ సుధాకర్‌ కుమారుడు లలిత్‌ను ఎంవీపీ కాలనీలోని తమ కార్యాలయానికి పిలిపించి పలు అంశాలపై ప్రశ్నించింది. ఘటన జరగడానికి ముందు లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘన అభియోగంపై ఫోర్త్‌టౌన్‌ పోలీసులు లలిత్‌పై కేసు నమోదు చేయడం, అనంతరం బైక్‌ను విడిపించేందుకు డాక్టర్‌ సుధాకర్‌ ఫోర్త్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా, అక్కడి సిబ్బందితో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే.


ఆ తర్వాత కొద్దిరోజులకే డాక్టర్‌ సుధాకర్‌, పోలీసుల మధ్య జాతీయ రహదారిపై వివాదం తలెత్తింది. డాక్టర్‌ సుధాకర్‌ను పోలీసులు చేతులు కట్టేసి లాఠీలతో కొట్టి స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు డాక్టర్‌ సుధాకర్‌ కుమారుడు లలిత్‌నుంచి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.  పోలీస్‌ స్టేషన్‌లో గొడవ జరిగిన సందర్భంగా డాక్టర్‌ సుధాకర్‌ను పోలీసులు బెదిరించడం, ఇతర హెచ్చరికలు చేయడం వంటివి జరిగాయా? అనేదానిపైనా ప్రశ్నించినట్టు తెలిసింది. 

Updated Date - 2020-06-02T08:48:22+05:30 IST