Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 19 Nov 2021 02:17:32 IST

కొండంతా వాన

twitter-iconwatsapp-iconfb-icon
కొండంతా వాన

తిరుపతి-తిరుమల అల్లకల్లోలం

కడపలో బీభత్సం.. నెల్లూరు జిల్లాలోనూ కుండపోత

అతలాకుతలమైన చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు.. తిరుపతి-తిరుమల వీధుల్లో జల ప్రవాహం

ఘాట్‌ రోడ్లపై కూలిన వృక్షాలు, కొండచరియలు.. 2 ఘాట్‌ రోడ్లూ మూసివేత.. నడకదారులు నేడూ మూత

శేషాచల కొండల నుంచి తిరుపతిని ముంచెత్తిన నీరు.. ఉధృతంగా ఉరకలెత్తిన కపిల తీర్థ జలపాతం

తిరుపతిలో నదులను తలపించిన 80 శాతం వీఽధులు.. కొట్టుకుపోయిన వాహనాలు, వస్తువులు, పశువులు

ఆరుగురు గల్లంతు.. వాయుగుండంగా మారిన అల్పపీడనం.. నేడు, రేపు కూడా అతి భారీ వర్షాలు

తిరుపతి-తిరుమల అల్లకల్లోలం

కడప, నెల్లూరు జిల్లాల్లోనూ కుండపోత

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)


వీధులు నదులయ్యాయి. వస్తువులన్నీ పడవల్లా తేలిపోయాయి. వరద నీటిలో వాహనాలు బొమ్మల్లాగా కొట్టుకుపోయాయి. ఇది తిరుపతి నగరంలో కనిపించిన దృశ్యం! వాయుగుండం చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు పెద్దగండం తెచ్చిపెట్టింది. తిరుమల-తిరుపతి అతలకుతలమయ్యాయి. వాయుగుండం ప్రభావంతో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో కురుస్తున అతిభారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. వాగులు, వంకలు, రిజర్వాయర్లు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక చెరువులకు గండ్లు పడ్డాయి. పలు రహదారులు నీటమునిగి రాకపోకలు నిలిచిపోయాయి. ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. ముఖ్యంగా చిత్తూరు  జిల్లాలో బుధవారం రాత్రి నుంచీ ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో శ్రీవారి ఆలయం మాడవీధులన్నీ జలమయమయ్యాయి. ఎన్నడూలేని విధంగా మాడవీధుల్లో బురదతోపాటు మోకాళ్ల లోతు నీరు ప్రవహించింది. భక్తులు దర్శనానికి వెళ్లే వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ల్లోకి కూడా నీరు భారీగా చేరింది. కపిలతీర్థం ఆలయంలో 2 రాతి స్తంభాలు, వేణుగోపాలస్వామి ఆలయ ప్రధాన మండపం పైకప్పు కూలిపోయాయి. తిరుమల రోడ్లపై వర్షం నీరు నదిలా ప్రవహించడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


చిత్తూరు-తిరుపతి సిక్స్‌ లేన్‌ హైవేపై పూతలపట్టు మండలం పి.కొత్తకోట రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద ఐదడుగుల నీరు ప్రవహించి లారీ, పలు కార్లు నీటిలో చిక్కుకుపోయాయి. గాదంకి వద్ద రాడార్‌ కేంద్రం ప్రహరీ నీటి ఉధృతికి కూలిపోయింది. జిల్లాలో  రెండు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలను జిల్లాకు రప్పించారు. 


సహాయక చర్యలు ముమ్మరం..: సీఎం

చిత్తూరు, నెల్లూరు, కడప కలెక్టర్లతో సీఎం జగన్‌ సమీక్షించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు వివరాలు అందించాలని, ఏం కావాలన్నా, వెంటనే అడగాలని, తాను నిరంతరం అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.


ఎన్టీఆర్‌ ట్రస్ట్‌తో సాయం: చంద్రబాబు

తిరుపతి, తిరుమల నిరాశ్రయులైన ప్రజలకు అండగా నిలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భక్తులకూ అండగా నిలవాలని సూచించారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సైతం తమవంతు సహాయం అందజేస్తుందని తెలిపారు. 


నీట మునిగిన కడప 

కడప జిల్లాలో కుండపోత వర్షం కురవడంతో కడప నగరం సహా రాజంపేట, రైల్వేకోడూరు పట్టణాలు జలమయమయ్యాయి. రహదారులన్నీ చెరువులను తలపించాయి. పంటలు దెబ్బతిన్నాయి. బుగ్గవంక ప్రాజెక్టు నుంచి 8 వేల క్యూసెక్కుల నీరు వదిలారు. సీకేదిన్నె మండలంలోని ఎర్రవంక, మూలవంక, ఉధృతంగా ప్రవహించడంతో బుగ్గవంక కాలువలోకి సుమారు 19 వేల క్యూసెక్కుల నీరు పారుతోంది. కడప నగరంలోని బుగ్గవంక పరిసర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల జనం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కొన్ని కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కడప ప్రధాన రోడ్లలో సుమారు మూడు అడుగుల మేర నీరు పారింది. రాజపేట పట్టణానికి చుట్టూ ఉన్న వాగులు ఒంకలు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వేకోడూరు-తిరుపతి రహదారిలోని బాలపల్లి వద్ద కొండను తొలిచి నిర్మించిన రహదారి వద్ద ఇరువైపులా నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రళయాన్ని తలపించేలా రోడ్డుపై నీరు పారుతోంది. ఒక వ్యక్తి రోడ్డు పైనే నీటి ఉఽధృతికి కొట్టుకుపోయాడు. రాజుకొండ వద్ద చిట్వేలు-నెల్లూరు జిల్లాకు రాక పోకలు నిలిచిపోయాయి.  కడప నగరం ఎస్సార్‌నగర్‌కు చెందిన పొలిచెర్ల వెంకటసాయికి ఈ నెల 21న వివాహం జరుగనుంది. ఇటీవల కురిసిన వర్షానికి ఆ ప్రాంతంలో సుమారు 5 అడుగులపైగా నీరు నిలిచింది. దీంతో పెళ్లి పనులు, రాకపోకలకు ఒక బోట్‌ను రూ.4 వేలు వెచ్చించి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారు. దీంతోపాటు వాటర్‌ ట్యాంక్‌ను మరో బోటుగా మార్చి నీళ్లలో పెళ్లిపనులకు రాకపోకలు సాగిస్తున్నారు. 


‘సోమశిల’కు లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..

నెల్లూరు జిల్లావ్యాప్తంగా బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.  కైవల్యా నది, పెద్దవాగు, మాల్లేరువాగు, కేతమన్నేరు, బొగ్గేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు మండలాలు,  గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాపూరు ఘాట్‌లోకి వాహనాలను ఆపేశారు. కడప-నెల్లూరు మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. 

కొండంతా వాన

తిరుమలలో ఆర్జితం ఆఫీస్‌ కిందభాగంలోని టీటీడీ సర్వర్ల గదుల్లోకి నీరు ప్రవేశించడంతో అన్ని యంత్రాలకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. తిరుపతి నుంచి తిరుమలకు చేరుకునే రెండవఘాట్‌ రోడ్డులో 9, 12 కిలోమీటర్లు, హరిణి వద్ద కొండచరియలు విరిగి పడ్డాయి. మరికొన్ని ప్రదేశాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి.  సాయంత్రం రెండు ఘాట్‌రోడ్లనూ మూసివేశారు. తిరిగి ఎప్పుడు తెరిచేదీ టీటీడీ తర్వాత ప్రకటించనుంది. బుధవారం నుంచి మూసివేసిన రెండు నడకదారులను శుక్రవారం కూడా మూసే ఉంచనున్నట్టు  దేవస్థానం ప్రకటించింది. తిరుమలలో నారాయణగిరి కాటేజీ వెనుకభాగంలోని కొండల నుంచి భారీగా వర్షం నీరు ప్రవహించడంతో కొండచరియలు విరిగి కాటేజీలపై పడి దాదాపు నాలుగు గదులు ధ్వంసమయ్యాయి. ఆ గదుల్లో భక్తులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. తిరుమలలోని జేఈవో క్యాంపు కార్యాలయం నీట మునిగింది. కాగా, గురు, శుక్ర, శనివారాల్లో దర్శన టికెట్లు కలిగి తిరుమలకు రాలేకపోయిన భక్తులను తరువాతి రోజుల్లో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఈవో జవహర్‌ రెడ్డి తెలిపారు. తిరుమల కొండల నుంచీ భారీగా దిగువకు వచ్చిపడుతున్న వర్షం నీరు తిరుపతి నగరాన్ని ముంచెత్తింది. కపిలతీర్థంలో జలపాతం ఉధృతి పెరగడంతో పుష్కరిణి నిండిపోయి ఆలయంలోకి నీరు ప్రవేశించింది. ఇక తిరుపతిలో 80 శాతం వీధులన్నీ జలమయమయ్యాయి. వర్షం నీరు ఇళ్లలోకి చేరింది. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.