భారీ వర్షాలతో బెంబేలు

ABN , First Publish Date - 2022-10-07T06:25:55+05:30 IST

భారీ వర్షాలతో బెంబేలు

భారీ వర్షాలతో బెంబేలు
బందరు మండలం వెంకటదుర్గాంబపురంలో నీటమునిగిన వరిపైరు

జిల్లాలోని చాలా ప్రాంతాల్లో నీట మునిగిన పంటలు

దుబ్బు దశలో ఉన్న వరికి కష్టాలే

వర్షపు నీటిలో నిండిన రహదారులు

బంటుమిల్లిలో అత్యధికంగా 182.4 మిల్లీమీటర్లు

ఈ ఏడాది ఇదే అత్యధిక సగటు వర్షపాతం

పొంగి పొర్లుతున్న డ్రెయిన్లు

ఎడతెరిపిలేని వానతో జనజీవనం అస్తవ్యస్తం


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : భారీవర్షం జిల్లాను అతలాకుతలం చేసింది. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురవడం వల్ల జనజీవనం స్తంభించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడటంతో జిల్లావ్యాప్తంగా బుధ, గురువారాల్లో భారీ వర్షాలు కురిశాయి. బంటుమిల్లి మండలంలో గురువారం ఉదయం 8.30 గంటల వరకు అత్యధికంగా 182.4, కృత్తివెన్నులో 163.6, నాగాయలంకలో 108.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా పమిడిముక్కల మండలంలో 12.6 మిల్లీమీటర్లు నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 53.6 మిల్లీమీటర్లు కాగా, ఈ ఏడాది ఇదే అత్యధికం. కాగా, రెండు రోజుల పాటు వర్షాలుంటాయని, అల్పపీడనం ఏర్పడి మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

లోతట్టు ప్రాంతాలు జలమయం

మచిలీపట్నం, గుడివాడ, పెడన పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మచిలీపట్నంలోని ఆర్ట్టీసీ కాలనీ, బైపాస్‌ రోడ్డు, వడ్డీ రంగారావు కాలనీతో పాటు ప్రధాన రహదారులు వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. గుడివాడ పురపాలక సంఘ పరిధిలోని పంచవటి కాలనీ, వాంబేకాలనీ, ఎన్టీఆర్‌ కాలనీల్లోని రహదారులపైకి వర్షపు నీరు నిలిచిపోయింది. గుడివాడ మండలం చౌటపల్లిలో నాలుగు ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. 

ప్రమాదం అంచున వరి

భారీ వర్షాలతో జిల్లాలోని సముద్రతీరం వెంబడి ఉన్న మండలాల్లో వరిపైరు నీటమునిగింది. మచిలీపట్నం మండలం తుమ్మలచెరువు, వాడపాలెం, వెంకటదుర్గాంబపురం, తుమ్మలపాలెం, తదితర గ్రామాల్లోని 1,500 ఎకరాల్లో వరిపైరు నీటమునిగింది. న్యూకోన డ్రెయిన్‌ పొంగి ప్రవహించింది. ఈ ప్రాంతంలో వరిపైరుపై నాలుగు అంగుళాలకు పైగా నీరు నిల్వ ఉండిపోయింది. కోడూరు మండలం ఊటగుండం, దింటిమెరక తదితర గ్రామాల్లో ఇటీవలే వరినాట్లు పూర్తిచేయగా, భారీ వర్షాల తాకిడికి పైరు నీటిలో తేలియాడుతోంది. నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే వరి కుళ్లిపోతుందని రైతులు భయపడుతున్నారు. తీరప్రాంత మండలాలైన కోడూరు, అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను తదితర మండలాల్లో ఆలస్యంగా వరినాట్లు పూర్తిచేశారు. ఈ మండలాల్లో ప్రస్తుతం వరిపైరు దుబ్బు దశలో ఉంది. పొలంలో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే గాలి తగలక పిలక దశలో ఉన్న వరి చనిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఎకరాకు రూ.13 వేలకు పైగా ఖర్చు చేశామని, ఈ దశలో వరిపైరు చనిపోతే నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోడూరు మండలం ఈస్ట్‌ చానల్‌ 15వ నెంబరు కాల్వ పరిధిలో డ్రెయిన్లు సక్రమంగా లేకపోవడంతో నారుమడుల దశలోనే పంట నీట మునిగింది. ఈ కాల్వ కింద మూడు విడతలుగా నారుమడులు పోసి ఎట్టకేలకు వరినాట్లు పూర్తిచేశారు. భారీ వర్షాల తాకిడికి పైరు నీటిలో ఉండిపోయింది. నీరు తగ్గాక పైరు చనిపోతే మళ్లీ మరో విడత వరినాట్లు వేయలేమని రైతులు చెబుతున్నారు. 

పొట్టదశలో తెగుళ్ల బెడద

పామర్రు, గుడ్లవల్లేరు, కంకిపాడు, ఉయ్యూరు, పమిడిముక్కల, తోట్లవల్లూరు, గుడివాడ తదితర ఎగువ మండలాల్లో ముందస్తుగా వరినాట్లు పూర్తిచేశారు. వరిపైరు పొట్టదశలో ఉంది. ఆఖరి కోటాగా పొటాష్‌ ఎరువును కూడా చల్లారు. పొలంలో నీరు లోతుగా నిల్వ ఉండిపోవడంతో పొట్టదశలో ఉన్న పైరుకు ప్రస్తుతం సుడిదోమ, తెల్లదోమ పోటు అధికంగా ఉంది. నీరు తగ్గిన కొలదీ ఈ రెండూ మరింతగా విజృంభిస్తాయని రైతులు చెబుతున్నారు. పొడ, అగ్గి తెగుళ్లు వ్యాపిస్తాయని రైతులు చెబుతున్నారు.

జిల్ల్లాలో వర్షపాతం ఇలా..

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గురువారం నమోదైన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి. కోడూరులో 84.6 మిల్లీమీటర్లు, అవనిగడ్డలో 71.2, మచిలీపట్నంలో 58.6, పెడనలో 56.2, గుడివాడలో 52.2, బాపులపాడులో 47.6, గన్నవరంలో 46.8, పామర్రులో 42.6, ఉంగుటూరులో 42.4, పెనుమలూరులో 40.2, మొవ్వలో 38.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెదపారుపూడిలో 35.6 మిల్లీమీర్లు, మోపిదేవిలో 35.0, చల్లపల్లిలో 33.8, గూడూరులో 32.2, కంకిపాడులో 32.0, ఉయ్యూరులో 31.2, గుడ్లవల్లేరులో 27.6, తోట్లవల్లూరులో 24.4, నందివాడలో 23.2, ఘంటసాలలో 18.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.




Updated Date - 2022-10-07T06:25:55+05:30 IST