మరో 24 గంటలు వర్షసూచన

ABN , First Publish Date - 2022-07-14T01:49:08+05:30 IST

తీవ్ర అల్పపీడనం బుధవారం నాటికి దక్షిణ ఒడిశా పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనిపై సముద్ర మట్టానికి

మరో 24 గంటలు వర్షసూచన

విశాఖపట్నం: తీవ్ర అల్పపీడనం బుధవారం నాటికి దక్షిణ ఒడిశా పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనిపై సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించిన ఉపరితల ఆవర్తనం నైరుతి వైపునకు ఒంగి ఉంది. దీనికితోడు రుతుపవన ద్రోణి, షీర్‌ జోన్‌ దక్షిణ ఒడిశా పరిసరాల మీదుగా విస్తరించి ఉన్నాయి. దీని ప్రభావంతో బుధవారం కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో ఎక్కువచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు పడతాయని పేర్కొంది. రుతుపవన కరెంట్‌ బలంగా వుండడంతో సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నందున ఈనెల 16వ తేదీ వరకు కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. 


ఏపీలో జూలై ఒకటి నుంచి 12వ తేదీ వరకు 45 మి.మీ.గాను 78.7 (75 శాతం ఎక్కువ) వర్షపాతం నమోదైంది. చిత్తూరు, కడప తప్ప మిగిలిన 11 జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే విజయనగరం జిల్లాలో 167 శాతం, తూర్పుగోదావరిలో 159, పశ్చిమ గోదావరిలో 154, కృష్ణాలో 151, గుంటూరులో 109, శ్రీకాకుళంలో 87, విశాఖపట్నంలో 36, నెల్లూరులో 32, అనంతపురంలో 25, ప్రకాశంలో 19, కర్నూలు జిల్లాలో ఆరు శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైంది.

Updated Date - 2022-07-14T01:49:08+05:30 IST