Rain: నిర్మల్‌ జిల్లాలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం

ABN , First Publish Date - 2022-08-09T00:14:52+05:30 IST

జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం మోస్తరు వర్షం (Rain) కురిసింది. జిల్లాలోని కుభీర్‌ మండలంలో అత్యధికంగా 54.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Rain: నిర్మల్‌ జిల్లాలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం

నిర్మల్‌: జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం మోస్తరు వర్షం (Rain) కురిసింది. జిల్లాలోని కుభీర్‌ మండలంలో అత్యధికంగా 54.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి జిల్లాకేంద్రంతో పాటు ఖానాపూర్‌, ముథోల్‌, భైంసా తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్ట్‌లైన కడెం, గడ్డెన్న, స్వర్ణ ప్రాజెక్ట్‌లకు ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతోంది. కడెం ప్రాజెక్టు (Kadem project)లోకి 13,461 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. అధికారులు ఏడు గేట్లు ఎత్తి 9843 క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి వదిలారు. కడెం ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 684.225 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 4.171 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. కడెం ప్రాజెక్ట్‌ గేట్లకు మరమ్మతులు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు 11 గేట్లకు మరమత్తులు పూర్తి చేసి కిందికి దించగా.. ఇంకా ఏడు గేట్లు తెరిచే ఉన్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో ముసురు వర్షం పడింది. జిల్లాలోని సాత్నాల ప్రాజెక్టుకు 1000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 286.5మీటర్లు కాగా.. ప్రస్తుతం 284.75 మీటర్ల నీటిమట్టం ఉంది. 

Updated Date - 2022-08-09T00:14:52+05:30 IST