వర్షం కోసం జమ్మి, వేపచెట్లకు పెళ్లి

ABN , First Publish Date - 2022-06-03T15:11:12+05:30 IST

దిండుగల్‌ జిల్లా నత్తం సమీపం సముద్రాపట్టినం గ్రామంలో వర్షం కోసం, ప్రపంచ శాంతి కోసం గ్రామస్థులంతా కలిసి పక్కపక్కనే పెరిగిన జమ్మిచెట్టు,

వర్షం కోసం జమ్మి, వేపచెట్లకు పెళ్లి

చెన్నై, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): దిండుగల్‌ జిల్లా నత్తం సమీపం సముద్రాపట్టినం గ్రామంలో వర్షం కోసం, ప్రపంచ శాంతి కోసం గ్రామస్థులంతా కలిసి పక్కపక్కనే పెరిగిన జమ్మిచెట్టు, వేపచెట్టుకు ఘనంగా వివాహం జరిపారు. ఈ వేడుకల్లో పరిసర గ్రామాల ప్రజలంతా విందు భోజనంలో పాల్గొన్నారు. సముద్రాపట్టినం గ్రామానికి చెందిన కైలాసం అనే రైతు కొన్నేళ్ల క్రితం మగసంతానం కోసం ఓ జమ్మిచెట్టు నాటారు. కొన్ని నెలలుగడిచాక జమ్మిచెట్టు, దాని పక్కనే మొలచిన వేప చెట్టు ఏపుగా పెరిగాయి. దీంతో గ్రామస్థులంతా ఆ రెండు దేవతావృక్షాలుగా భావించి శుక్ర, మంగళవారాల్లో పూజలు నిర్వహించేవారు. ఈ నేపథ్యంలో ఆ రెండు వృక్షాలకు వివాహం జరపాలని గ్రామస్థులు నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా అన్ని ఏర్పాట్లు చకచకా ప్రారంభమయ్యాయి. పెళ్ళి పత్రికలను ముద్రించి గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్నకోంబైపట్టి, సంబాపట్టి, పూదకుడి, అమ్మపట్టి, సడయంపట్టి, పుదుపట్టి గ్రామాల్లో పంచిపెట్టి పెళ్ళిరమ్మంటూ ఆహ్వానించారు. ఆ పెళ్ళి పత్రికలో జమ్మిచెట్టును వరుడిగాను, వేపచెట్టును వధువుగాను పేర్కొన్నారు. బుధవారం ఉదయం గ్రామస్థుల సమక్షంలో పెళ్ళి వేడుకలు ప్రారంభమయ్యాయి. జమ్మిచెట్టుకు పట్టు ధోవతి, అంగవస్త్రం, వేపచెట్టుకు పట్టు చీర ధరింపజేశారు. మంగళవాయిద్యాల నడుమల పుదుకోట జిల్లా తేనిమలై మురుగన్‌ ఆలయ ప్రధాన పూజారి వేపచెట్టుకు మంగళసూత్రాన్ని కట్టారు. ఈ వింత పెళ్ళికి హాజరైన గ్రామస్థులందరికి విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-06-03T15:11:12+05:30 IST