వర్షం గుబులు.. అన్నదాత దిగులు

ABN , First Publish Date - 2022-04-23T06:48:39+05:30 IST

ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు.. కమ్ముకుంటున్న మ బ్బులు అన్నదాత గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తుండడంతో కల్లాలు, రహదారులపై రాశులు గా పోసిన ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్ఫాలిన్‌లను కప్పుతున్నారు.

వర్షం గుబులు.. అన్నదాత దిగులు

జిల్లాలో అకాల వర్షాలు, వడగళ్లు 

జోరుగా కొనసాగుతున్న వరి కోతలు 

ఊపందుకోని కొనుగోళ్లు 

త్వరగా చేపట్టాలంటున్న రైతులు 

ఇప్పటి వరకు 383 కేంద్రాల ఏర్పాట్చు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు.. కమ్ముకుంటున్న మ బ్బులు అన్నదాత గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తుండడంతో కల్లాలు, రహదారులపై రాశులు గా పోసిన ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్ఫాలిన్‌లను కప్పుతున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రా ల్లో త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆర్థిక అవ సరాల తో కొందరు రైతులు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. 

ఊపందుకోని కొనుగోళ్లు..

జిల్లాలో వరి కోతలు జోరందుకున్నా ధాన్యం కొనుగోళ్లు ఇంకా ఊపందుకోలేదు. వర్షాల భయంతో రైతులు హార్వెస్టర్‌లకు అధిక డబ్బులైనా పెట్టి రాత్రింబవళ్లు వరి కోతలు చేస్తున్నారు. డీజిల్‌ ధరలు పెరిగినా.. రాత్రి, పగలు అనే తేడా లేకుండా హార్వెస్టర్‌ల ద్వారా కోతలు చేపడుతున్నారు. ధాన్యాన్ని కల్లాలు, రోడ్డుపై ఆరబోస్తూ అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. అయితే వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల వల్ల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడేందుకు టార్ఫాలిన్‌ల కోసం తిప్పలు పడుతున్నారు. అక్కడక్కడ వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. జిల్లా లో బోధన్‌ డివిజన్‌లో ఇప్పటికే సగానికిపైగా కోతలు పూర్తికాగా ధాన్యాన్ని కూడా వ్యాపారులకు అమ్మ కాలు చేశారు. వర్ని, మోస్రా, చందూర్‌, రుద్రూర్‌, కోటగిరి మండలాల పరిధిలో 90 శాతానికి పైగా ధాన్యాన్ని రైతులు వ్యాపారులకు విక్రయించారు.

ఇప్పటి వరకు 383 కేంద్రాల ఏర్పాటు..

జిల్లాలో ఇప్పటి వరకు 383 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 191 కొనుగోలు కేంద్రాల ద్వారా 30వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. సీరియల్‌ నెంబర్‌ వారీగా తీసుకువచ్చేవిధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల ధ్రువీకరణ పత్రం ఆధారంగా కొనుగోలు చేసేవిధంగా ఏర్పాట్లను చేశారు. క్వింటాలు రూ.1960 కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధరకు అనుగుణంగానే ధాన్యం తీసుకురావాలని రైతులను అధికారులు కోరుతున్నారు. అయితే వర్షాలు వస్తే ధాన్యం తడిసే అవకాశం ఉండడంతో ఆందోళన పడుతున్నారు. త్వరగా కొనుగోలు చేపట్టాలని గన్ని బ్యాగులను ఎక్కువగా సరఫరా చేయాలని, కొనుగోలు చేయగానే తరలించేవిధంగా వాహనాలను సమకూర్చాలని కోరుతున్నారు.

సన్న రకాలకు డిమాండ్‌..

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగానే సన్న రకాలను డిమాండ్‌ పెరిగింది. వ్యాపారులు వారం క్రితం వరకు క్వింటాలు రూ.1450 వరకు కొనుగోలు చేయగా ప్రస్తుతం రూ.1750 వరకు ధర పెడుతున్నారు. జిల్లాలో ఈ సీజన్‌లో గంగాకావేరి, ఆర్‌ ఎన్‌ఆర్‌, బీపీటీ, హెచ్‌ఎంటీ రకాలను ఎక్కువగా సాగు చేశారు. రాష్ట్రంతో పాటు కర్నాటకలోని ఈ దఫా ఎక్కువగా సన్న రకాలు సాగయ్యాయి. మిగతా రాష్ట్రాల్లో సాగు చేయకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల వ్యాపారులు కూడా ఇక్కడి సన్న రకాలను కొనుగోలు చేస్తున్నారు. సన్న బియ్యానికి దేశమంతటా డిమాండ్‌ ఉండడం వల్ల రైతులు ఆరబోసి నిల్వ చేసుకుంటే వచ్చే మూడు నాలుగు నెలల్లో సన్నాలకు మరింత డిమాండ్‌ పెరుగుతుందని వ్యాపారులతో పాటు అధికారులు కూడా రైతులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువ మంది మద్దతు ధరకు అమ్మకాలు చేస్తున్నా రాబోయే రోజుల్లో ఈ సన్నాలకు డిమాండ్‌ ఉంటుందనే వారు అంచనా వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో సాగు చేయకపోవడం వల్ల వ్యాపారులు ఎక్కువ మొ త్తంలో కొనుగోలు చేస్తారని వారు వివరిస్తున్నారు.

హార్వెస్టర్‌కు ఎక్కువ తీసుకుంటున్నారు..

 ఫ గొల్ల గంగాధర్‌, తొర్లికొండ (జక్రాన్‌పల్లి)

వరి కోతలు అందరు ఒకేసారి మొదలుపెట్టడం వల్ల హార్వెస్టర్‌ యజమానులు ఎక్కువగా డబ్బులు తీసుకుంటున్నారు. గత సంవత్సరం కంటే రెండు నుంచి రూ.400 వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. అందరు రైతులు ఒకేసారి అడగడం వల్ల కూడా రేటు పెంచి వరి కోతలను చేస్తున్నారు. 

అకాల వర్షాలతో కోతలు చేస్తున్నాం..

ఫ అరుణ్‌, జాన్కంపేట (వేల్పూర్‌)

అకాల వర్షంతో పాటు వడగల్లు పడే అవకాశం ఉండడంతో ముందస్తుగానే వరి కోతలు చేస్తున్నాం. కొంత పచ్చిగా ఉన్న తప్పనిసరి పరిస్థితిలో ఈ కోతలు చేస్తున్నాం. తేమ ఎక్కువగా ఉన్నా వరి కోతలు పూర్తిచేస్తున్నాం. ధాన్యం ఆరబోసి కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాం.

ఆలస్యమైతే వ్యాపారులకు అమ్ముతాం.. 

ఫ గంగమల్లు, వేల్పూర్‌

ధాన్యం కొనుగోలు ఆలస్యమైతే వ్యాపారులకు అమ్మకాలు చేస్తాం. వర్షాలు పడే అవకాశం ఉండడం, ధాన్యం నిల్వచేసే పరిస్థితులు లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. అధికారులు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో పాటు వెంటనే ధాన్యం మద్దతు ధరకు సేకరిస్తే ఇబ్బందులు తప్పుతాయి.

Updated Date - 2022-04-23T06:48:39+05:30 IST