చినుకు జాడేది ?

ABN , First Publish Date - 2022-09-06T05:57:51+05:30 IST

వర్షాకాలం వచ్చినా ఇంకా ఎక్కడా సరైన వర్షాలే పడలేదు. వర్షాల కోసం రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. జిల్లాలో 5.01 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగులో ఉన్నా వర్షాలు సకాలంలో కురవక పంటలు దెబ్బతినే పరిస్థితులు కనబడుతున్నాయని చెబుతున్నారు.

చినుకు జాడేది ?

ముఖం చాటేస్తున్న వాన

అల్పపీడనం ఉంటేనే వర్షాలు 

జిల్లాలో గతేడాది కంటే తక్కువ వర్షపాతం 

సాధారణానికి మించి 6.4 శాతం నమోదు

13 మండలాల్లో మైనస్‌ వర్షపాతం 

మరోపక్క ఠారెత్తిస్తున్న ఎండలు

విభిన్న వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి


ఈ ఏడాది మబ్బులు ముసుగేశాయి.. చినుకు చిన్నబోయింది.. వానాకాలం వచ్చినా చినుకు జాడే కరువైంది..జిల్లాలో విభిన్న వాతావరణం నెలకొని ఉంది. ఈ సార్వా సీజన్‌ ఆరంభం నుంచి జిల్లాలో వ్యవసాయానికి అవసరమైన వర్షాలు కురవకపోవడంతో  రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.


ఏలూరుసిటీ, సెప్టెంబరు 5: వర్షాకాలం వచ్చినా ఇంకా ఎక్కడా సరైన వర్షాలే పడలేదు. వర్షాల కోసం రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. జిల్లాలో 5.01 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగులో ఉన్నా వర్షాలు సకాలంలో కురవక పంటలు దెబ్బతినే పరిస్థితులు కనబడుతున్నాయని చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే జిల్లాలో ఈ సార్వా సీజన్‌లో (జూన్‌ 1వతేదీ నుంచి సెప్టెంబరు 3వతేదీ వరకు) తక్యువ వర్షపాతం నమోదైందని జిల్లా ప్రణాళికా శాఖ నివేదికలు చెబుతున్నాయి. గతేడాది జూన్‌ 1 నుంచి సెప్టెంబరు 30 వతేదీ వరకు సాధారణ వర్షపాతాన్ని మించి 10 శాతం వర్షాలు అధికంగా కురవగా ఈ ఏడాది జూన్‌ 1 వతేదీ నుంచి సెప్టెంబరు 3 వతేదీ వరకు పరిశీలిస్తే కేవలం 6.4 శాతం మాత్రమే అధికంగా వర్షాలు కురిసినట్టు చెబుతున్నారు. గతేడాది సార్వా సీజన్‌లో 9 మండలాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు కాగా ఈ ఏడాది సార్వా సీజన్‌లో ఇప్పటివరకు 13 మండలాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. దీనిని బట్టి పరిశీలిస్తే ఈ ఏడాది జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు భారీగానే కురిసినా కొన్ని ప్రాంతాల్లో మాత్రం అనుకూలంగా లేవని తెలుస్తోంది. మరోవైపు ఎండలు చూస్తుంటే వేసవి కాలంలో ఉన్నామా అనిపిస్తోంది. పగటి పూట 33 నుంచి 34 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా ఎండ మాత్రం మంట పుట్టిస్తోంది. ఇటువంటి విభిన్న వాతావరణం ఎప్పుడూ చూడలేదని రైతులు చెబు తున్నారు. ఇదే వాతావరణం కొనసాగితే సార్వాలో దిగుబడులు మీద కూడా ప్రభావం చూపే అవకాశాలున్నాయని చెబుతున్నారు. 


జిల్లాలో వర్షపాతం వివరాలు ఇలా..

జిల్లాలో ఈ ఏడాది జూన్‌ 1 వతేదీ నుంచి సెప్టెంబరు 3వ తేదీ వరకు జిల్లాలో సాధారణంగా 609.9 మిల్లీమీటర్లు వర్షపాతం కురవాల్సి ఉండగా 648.7 మి.మీ నమోదైంది. అంటే 6.4 శాతం వర్షాలు అధికంగా కురిశాయి. ఏలూరు జిల్లాలో డివిజన్ల వారీగా పరిశీలిస్తే ఏలూరు డివిజన్‌లో 12 మండలాలు ఉండగా ఇందులో 6 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. తక్కువ వర్షపాతాలు కురిసిన మండలాల్లో సాధారణం/ప్రస్తుతం కురిసిన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. భీమడోలు మండలంలో 562.2/549.4 మి.మీ (మైనస్‌ 2.3 శాతం), పెదపాడు మండలంలో 581.2/505.1 (మైనస్‌ 13 శాతం), ఏలూరులో 583.3/419.5 (మైనస్‌ 28 శాతం), నిడమర్రులో 600.8/514,8 (మైనస్‌ 14 శాతం), గణపవరంలో 608.3/552.9 (మైనస్‌ 9.1 శాతం), మండవల్లిలో 569.8/ 510.3మిల్లీమీటర్లు  (మైనస్‌ 10 శాతం) వర్షాలు కురిశాయి. నూజివీడు డివిజన్‌లో 6 మండలాలు ఉండగా ఇందులో నాలుగు మండలాల్లో తక్కువ వర్షపాతాలు నమోదయ్యాయి. చింతలపూడిలో 700.6/591.7 (మైనస్‌ 16 శాతం), లింగపాలెంలో 631.6/564 (మైనస్‌ 11 శాతం), ముసునూరులో 553.7/492.2 (మైనస్‌ 11 శాతం) ఆగిరిపల్లిలో 583/535.3 (మైనస్‌ 8.2 శాతం) మిల్లీమీటర్లు వర్షపాతాలు నమోద య్యాయి. జంగారెడ్డిగూడెం డివిజన్‌లో 10 మండలాలు ఉండగా ఇందులో మూడు మండలాల్లో తక్కువ వర్షపాతాలు నమోదయ్యాయి. వేలేరు పాడులో 843.4/812.8 (మైనస్‌ 3.6 శాతం), టి.నరసాపురంలో 625.1/ 571.8 (మైనస్‌ 8.5 శాతం ), కామవరపుకోటలో 657.9/ 480.9 (మైనస్‌ 27 శాతం) మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఇక జిల్లాలోని 28 మండలాల్లో ఈ సీజన్‌లో నెలల వారీ వర్షపాతాలు పరిశీలిస్తే జూన్‌ నెలలో 112.2/136( 21.3 శాతం అధికంగా ), జూలై నెలలో 242.5/ 327.4 (35శాతం అధికంగా), ఆగస్టులో 239.3/179 (మైనస్‌ 25 శాతం) సెప్టెంబరులో మూడు రోజుల్లో 15.9/6.2 మిల్లీమీటర్లు (మైనస్‌ 61 శాతం) వర్షాలు కురిశాయి. 


2021లో సార్వా సీజన్‌లో వర్షపాతం

గతేడాది జూన్‌ 1 వతేదీ నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు సార్వా సీజన్‌లో జిల్లాలోని 28 మండలాల్లో వర్షపాతాలు పరిశీలిస్తే సాధారణం కంటే అధికంగా 10 శాతం వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తం మీద సాధారణ వర్షపాతం 765.1 మిల్లీమీటర్లుకు 841.4 మి.మీ వర్షపాతం నమోదైంది.  సార్వా సీజన్‌లో నెలలవారీ వర్షపాతాలు పరిశీలిస్తే జూన్‌లో 112.2/ 84.2( మైనస్‌ 25 శాతం),జూలైలో 242.5/323.9 (33.6 శాతం అధికంగా), ఆగస్టులో 239.3/ 149.3 (మైనస్‌ 38 శాతం), సెప్టెంబరులో 171.1/ 284.1 (66 శాతం అధికంగా) వర్షాలు కురిసినట్టు జిల్లా ప్రణాళికా శాఖ నివేదికలు చెబుతున్నాయి.  


Updated Date - 2022-09-06T05:57:51+05:30 IST