రొయ్య ఉక్కిరి బిక్కిరి

ABN , First Publish Date - 2022-06-29T05:44:33+05:30 IST

వాతావరణంలో మార్పులతో రొయ్యకు వైరస్‌ సోకి చనిపోతున్నాయి. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండ వర్షం కురుస్తుండటంతో చెరువుల్లో ఆక్సిజన్‌ లోపించి రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి.

రొయ్య ఉక్కిరి బిక్కిరి
పెదగొన్నూరులో రొయ్యల పట్టుబడులు

చెరువుల్లో ఆక్సిజన్‌ కొరత

వాతావరణంలో మార్పులతో మృత్యువాత

ముదినేపల్లి/కలిదిండి, జూన్‌ 28 : వాతావరణంలో మార్పులతో రొయ్యకు వైరస్‌ సోకి చనిపోతున్నాయి. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండ వర్షం కురుస్తుండటంతో చెరువుల్లో ఆక్సిజన్‌ లోపించి రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. ముదినేపల్లి మండలంలో సుమారు 500 ఎకరాల్లోని చెరువులకు వర్షం వల్ల నష్టం ఏర్పడింది. రైతులు హడావుడిగా రొయ్యల పట్టుబడులు నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా రొయ్యల రైతులు సుమారు రూ.10 కోట్ల మేర నష్టపోయారు. వైరస్‌ సోకిన రొయ్యలు చనిపోయి నీటిపై తేలుతుండటంతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. పట్టుబడులు నిర్వహించిన రొయ్యలకు అంతగా ధర కూడ పలకడం లేదు. రొయ్యలు 80 నుంచి 120 కౌంట్‌ వరకే పెరగ్గా, వీటి ధర కేజీ ఒక్కింటికి సగటున రూ.180 మాత్రమే పలుకుతున్నది. దీంతో రైతులు మరింత నష్టపోతు న్నారు. వర్షాలు కురుస్తుండటంతో చెరువుల్లో ఆక్సిజన్‌ పెంచేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఏరియేటర్లు తిప్పడం, మందులు వాడటం ముమ్మరం చేశారు. చల్లదనాన్ని తట్టుకుని రొయ్యలకు వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


రంగుమారిన వనామి

కలిదిండి మండలంలో 15 వేల ఎకరాల్లో వనామి రొయ్యల సాగు చేస్తున్నారు. వర్షాల కారణంగా ఆక్సిజన్‌ అందక రొయ్యల చనిపోతున్నాయి. దీంతో పెదలంక, మూల్లంక, భాస్కరావుపేట, మట్టగుంట, కలిదిండి, కొండంగి, కోరుకొల్లు, కాళ్లపాలెం, గొల్లగూడెం, కొండూరు గ్రామాల్లో హడావుడిగా పట్టుబడి చేస్తున్నారు. చిన్నసైజు రొయ్యలు కూడా చని పోతుండటంతో పెట్టుబడులు కూడా రావడం లేదని వాపో తున్నారు. చనిపోయిన రొయ్యలు ఎరుపు రంగులోకి మార డంతో వ్యాపారులు కొనుగోలు చేయక పోవడంతో గోతుల్లో వేసి పూడ్చుతున్నారు. ముమ్మరంగా రొయ్యల పట్టుబడులు చేయడంతో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మండలంలో సుమారు రూ.2 కోట్లు నష్టం ఉంటుందని రైతులు తెలిపారు. 


Updated Date - 2022-06-29T05:44:33+05:30 IST