పసుపు వర్షార్పణం!

ABN , First Publish Date - 2021-12-03T03:37:14+05:30 IST

పసుపు రైతుపై ప్రకృతి పగపట్టింది. అతివృష్టితో రైతన్న రెక్కల కష్టం వర్షార్పణమైంది.

పసుపు వర్షార్పణం!
పసుపు పంటలో నిలిచిన వర్షపు నీరు

నెల రోజులుగా పొలాల్లో నీరు

రూ.కోట్లలో పెట్టుబడి నష్టం

లబోదిబోమంటున్న రైతన్న

ఉదయగిరి రూరల్‌, డిసెంబరు 2: పసుపు రైతుపై ప్రకృతి పగపట్టింది. అతివృష్టితో రైతన్న రెక్కల కష్టం వర్షార్పణమైంది. గతేడాది నివర్‌ తుఫాన్‌ కారణంగా ఏర్పడ్డ గాయం మాన్పుకొని చేతిలో చిల్లి గవ్వలేకున్నా అప్పు చేసి ఎన్నో ఆశలతో పంట సాగు చేసిన రైతన్న ఈఏడాది అల్పపీడనం ప్రభావంతో ప్రకృతి కోపానికి బలయ్యాడు. నెల రోజులుగా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పొలాల్లో నీరు నిలవడంతో పంట పూర్తిగా దెబ్బతింది. దుంప కుళ్లిపోయి, మొక్కలు పాచిపట్టి నేలవాలడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.  

రూ.కోట్లలో పెట్టుబడి నష్టం 

పసుపు తొమ్మిది నెలల కాలం పంట. ఎకరా పంట సాగు చేసేందుకు సుమారు రూ.1.50 లక్షలు ఖర్చవుతోంది. మెట్ట ప్రాంతమైన ఉదయగిరిలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో జూన్‌ మాసంలో సుమారు 500 ఎకరాల్లో రైతులు పసుపు పంట సాగు చేశారు. పంట ఏపుగా పెరిగి దుంప ఏర్పడే సమయంలో ఎడతెరిపిలేని వర్షాలు పడ్డాయి. పొలాల్లో రోజుల తరబడి నీరు నిల్వ ఉండడం, ఉరకలెత్తడంతో దుంపకుళ్లిపోయి రైతుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మొక్కలు సైతం పాచిపోయి నేలవాలుతుండడంతో ఏమీ చేయలేని దుస్థితిలో రైతన్న కొట్టుమిట్టాడుతున్నారు. పంట నష్టపోయిన రైతులు పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థంకాక తలలు పట్టుకొంటున్నారు. 




Updated Date - 2021-12-03T03:37:14+05:30 IST