నిరాశగా నైరుతి

ABN , First Publish Date - 2022-06-20T08:27:24+05:30 IST

భారత్‌లో వ్యవసాయ రంగానికి నైరుతి రుతుపవనాలే ప్రధానాధారం. దేశంలోని వార్షిక వర్షపాతంలో 70 శాతం వాటా రుతుపవనాలదే. ఈసారి నాలుగు రోజులు ముందుగానే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించడంతో రైతాంగంలో..

నిరాశగా నైరుతి

జూన్‌ ప్రథమార్థంలో వాన లోటు

పరిస్థితి ఇలాగే ఉంటే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

ఈ నెలాఖరుకల్లా లోటు భర్తీకి అవకాశం: నిపుణులు

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

ఆసిఫాబాద్‌ జిల్లాలో తల్లీకుమారుడు

ఖమ్మం జిల్లాలో యువకుడు..


న్యూఢిల్లీ, జూన్‌ 19: భారత్‌లో వ్యవసాయ రంగానికి నైరుతి రుతుపవనాలే ప్రధానాధారం. దేశంలోని వార్షిక వర్షపాతంలో 70 శాతం వాటా రుతుపవనాలదే. ఈసారి నాలుగు రోజులు ముందుగానే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించడంతో రైతాంగంలో ఆశలు చిగురించాయి. కానీ.. గత నెల 28నే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు అనుకున్నంత స్థాయిలో ముందుకు కదలడం లేదు. దేశంలో ఇంకా చాలాచోట్ల వేడిగాలుల ప్రభావం కొనసాగుతోంది. దీంతో జూన్‌ మొదటి అర్ధ భాగంలో అంచనా వేసిన వర్షపాతం నమోదు కాలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యవసాయరంగం కుదేలై.. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రుతుపవనాలు పుంజుకుని విస్తారంగా వర్షాలు కురిస్తేనే ఆహార ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు.


రుతుపవనాలు మందకొడిగా కదులుతున్నందున జూన్‌ మొదటి అర్ధ భాగంలో ఆశించిన వర్షపాతం నమోదుకాలేదు. దీంతో వరి సాగు చేసే రైతుల్లో ఆందోళన మొదలైంది. అయితే వాతావరణ శాఖ మాత్రం.. రుతుపవనాల్లో మందగమనం తాత్కాలికమేనని, త్వరలోనే అవి పుంజుకుని లోటు వర్షపాతాన్ని భర్తీచేస్తాయని భావిస్తోంది. వారు అంచనా వేస్తున్నట్టుగానే జూన్‌ రెండో వారం నుంచి వర్షాలు పుంజుకున్నాయి. ఈ నెల 11న దేశవ్యాప్తంగా వర్షపాత లోటు 43 శాతం ఉండగా.. ఈ నెల 17 నాటికి అది 18 శాతానికి తగ్గిందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర తెలిపారు.


ఈ నెల 23 తర్వాత వాయవ్య భారతంలో వర్షపాతం పెరుగుతుందని ఆయన వెల్లడించారు. వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు ఈ సీజన్‌లో ఇప్పటి వరకు లోటు వర్షపాతమే నమోదైందని ప్రైవేటు వాతావరణ ఏజెన్సీ స్కైమెట్‌ వెదర్‌ తెలిపింది. కాగా.. ఈనెలాఖరు కల్లా వర్షపాత లోటు భర్తీ అవతుందని ఇండియన్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఐఏఆర్‌ఐ) ప్రొఫెసర్‌ వినోద్‌ సెహెగల్‌ చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉందని, రుతుపవనాలు పుంజుకున్నట్టు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. ఇక ఆహార ద్రవ్యోల్బణానికి వడగాలులు, ప్రపంచ మార్కెట్లలో అస్థిరత కారణమని ఆయన చెప్పారు.


ఐదు రోజుల్లో భారీ వర్షాలు: ఐఎండీ

నైరుతి రుతుపవనాల్లో కదలిక ఏర్పడిన నేపథ్యంలో రానున్న ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. రాబోయే 24 గంటల్లో ఈశాన్య భారతం, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్‌, సిక్కింలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశం అంతటా రెండు, మూడు రోజుల్లో  భారీ వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న ఐదు రోజుల్లో ఏపీ, యానాం, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలలో అక్కడక్కడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 

Updated Date - 2022-06-20T08:27:24+05:30 IST