పంటలను ముంచిన వాన

ABN , First Publish Date - 2021-04-23T07:37:08+05:30 IST

తెలంగాణలో అకాల వర్షాలతో అన్నదాతలు అతలాకుతలమవుతున్నారు. చేతికి వచ్చిన పంటలపై చెడగొట్టు వానలు పడుతుండటంతో విలవిల్లాడుతున్నారు.

పంటలను ముంచిన వాన

  • భూపాలపల్లి, ములుగులో నష్టం
  • పలు జిల్లాల్లో రాలిన మామిడి 
  • కల్లాల్లో తడిసిన ధాన్యం, మిర్చి
  • మంచిర్యాలలో పిడుగుపాటుకు వ్యక్తి, 7 పశువుల మృతి


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): తెలంగాణలో అకాల వర్షాలతో అన్నదాతలు అతలాకుతలమవుతున్నారు. చేతికి వచ్చిన పంటలపై చెడగొట్టు వానలు పడుతుండటంతో విలవిల్లాడుతున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గురువారం కురిసిన వర్షంతో పంటలకు తీవ్ర నష్టవాటిల్లింది. పలు మండలాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. కాటారం, గణపురం, మల్హర్‌, టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, గణపురం మండలాల్లో కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసి ముద్దయింది. వరి పంట నేలవాలింది. మొక్కజొన్న, మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలోని పలు చోట్ల పిడుగులు పడ్డాయి. భూపాలపల్లి మండలంలోని గొర్లవీడులో గాలివాన బీభత్సానికి గుడిసెకూలి కన్నం లక్ష్మి(75) మృతి చెందింది. కాటారం మండలం గారెపల్లిలో పిడుగుపడి గేదె చనిపోయింది. చిట్యాల మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో గాలి దుమారానికి ఇళ్లు కూలిపోయాయి. ములుగు జిల్లాలోని మంగపేట, కన్నాయిగూడెం, తాడ్వాయి, గోవిందరావుపేట, ములుగు, రామప్ప మండలాల్లో బుధవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కన్నాయిగూడెం మండలంలో కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసిపోయింది. మంగపేట మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. గోవిందరావుపేట మండలంలో మామిడి కాయలు రాలిపోయాయి. 


పలు మండలాల్లో వరి నేలవాలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం రాత్రి పలు చోట్ల గాలివాన కురిసింది. కొత్తగూడెంలో అత్యధికంగా 3.62 సెం.మీ వర్షం కురిసింది. పిడుగుపాటుకు బూర్గంపాడు మండలంలో మూడు గేదెలు, కరకగూడెం మండలంలో రెండు దుక్కిటెద్దులు మృతిచెందాయి. పలు చోట్ల విద్యుత్‌ స్తంభాలు, వృక్షాలు నేలకొరిగాయి. ఈదురుగాలులకు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని పలు గ్రామాల్లో మామిడి కాయలు నేలరాలాయి. కాసిపేట మండలం కోమలిచెను పంచాయతీ పరిధిలోని వరిపేటలో పిడుగుపాటుకు గుండేటి మల్లేశ్‌(62) మృతి చెందాడు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలోని పాత వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు రైతులు తీసుకువచ్చిన ధాన్యం తడిసింది. కామారెడ్డి జిల్లా లింగంపేటలో గురువారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు ప్రధాన రహదారిపై గల మర్రి చెట్టు కొమ్మలు విరిగి పడ్డాయి. దీంతో సుమారు గంట పాటు ఎల్లారెడ్డి-కామారెడ్డి రహదారిపై రాకపోకలు ఆగిపోయాయి. సదాశివనగర్‌ మండలం కుప్రియాల్‌లో ఈదురు గాలులకు రేకు మీద పడి గొల్ల రమేశ్‌(35) మృతి చెందాడు. పాలమూరు జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు వాన కురిసింది. నారాయణపేట జిల్లా దామరగిద్దలో పిడుగుపాటుతో కాడెద్దు మృతి చెందింది. 

Updated Date - 2021-04-23T07:37:08+05:30 IST