వర్షం.. నష్టం.. కష్టం

ABN , First Publish Date - 2022-05-27T06:30:03+05:30 IST

నల్లగొండ జిల్లా దేవరకొండ, పీఏ.పల్లి, తిరుమలగిరి(సాగర్‌) మండలాలతో పాటు పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం చిరుజల్లులు కురిశాయి.

వర్షం.. నష్టం.. కష్టం
దేవరకొండ: ఈదురుగాలులకు ఇంటిపై విరిగిపడిన చెట్టు

ఈదురుగాలులకు నేలవాలిన చెట్లు

ధ్వంసమైన ఇంటిపైకప్పులు



దేవరకొండ, తిరుమలగిరి(సాగర్‌), పెద్దఅడిశర్లపల్లి, మే 26: నల్లగొండ జిల్లా దేవరకొండ, పీఏ.పల్లి, తిరుమలగిరి(సాగర్‌) మండలాలతో పాటు పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం చిరుజల్లులు కురిశాయి. భారీగా ఈదురుగాలుతో చెట్లు నేలవాలాయి. విద్యుత్‌ తీగలు తెగి సరఫ రాకు అంతరాయం ఏర్పడింది. దేవరకొండ మండలంలోని తాటికోలు, వైదోనివంపు, కాసారం గ్రామాల్లో ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయి ధ్వంసమయ్యాయి. తిరుమలగిరి(సాగర్‌) మండల కేంద్రంతోపాటు పరిసర గ్రామాల్లో భారీ ఈదురుగాలులతో సుమారు గంటపాటు వర్షం కురిసింది. తిరుమలగిరి అల్వాల ఎక్స్‌రోడ్డు ప్రధాన రహదారిపై చెట్లు విరిగి పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పీఏ.పల్లి మండలంలోని సింగరాజుపల్లిలో రెండు విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. అంగడిపేట గ్రామ శివారులో ట్రాన్స్‌ఫార్మర్‌ కింద పడి మూడు విద్యుత్‌ స్తంభాలు విరిగాయి. పీఏ.పల్లి ఫీడర్‌లో మొత్తం 8 విద్యుత్‌ స్తంభాలు విరిగి సుమారు మూడు గంటల పాటు సరఫరా నిలిచింది. విద్యుత్‌ అధికారులు విరిగిన స్తంభాలకు సరఫరాను నిలిపి విద్యుత్‌ను పునరుద్ధరించారు. ఇదిలా ఉండగా, వేసవి ఎండ, ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు చిరు జల్లులతో కాస్త ఉపశమనం పొందారు. రోహిణికార్తెలో వర్షం కురవడంతో మెట్ట పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు.

Updated Date - 2022-05-27T06:30:03+05:30 IST