మూడో సెషన్ వర్షార్పణం

ABN , First Publish Date - 2021-01-16T18:50:04+05:30 IST

భారత్-ఆసీస్ మధ్య జరుగుతన్న టెస్ట్‌ మ్యాచ్‌‌ రెండో రోజు వర్షం వల్ల అంతరాయం కలిగింది. మ్యాచ్ మూడో సెషన్ మొత్తం వర్షార్పణమైంది. అయితే అంతకుముందు 274/5తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ జట్టు మరో 95 పరుగులు...

మూడో సెషన్ వర్షార్పణం

బ్రిస్బేన్‌: భారత్-ఆసీస్ మధ్య జరుగుతన్న టెస్ట్‌ మ్యాచ్‌‌ రెండో రోజు వర్షం వల్ల అంతరాయం కలిగింది. మ్యాచ్ మూడో సెషన్ మొత్తం వర్షార్పణమైంది. అయితే అంతకుముందు 274/5తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ జట్టు మరో 95 పరుగులు జోడించి మిగతా 5 వికెట్లను కోల్పోయింది. దీంతో ఆసీస్ జట్టు 369 పరుగులకు ఆలౌటయింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో లుబుషేన్ శతకం(108)తో రాణిస్తే.. కెప్టెన్ టిమ్ పైన్ హాఫ్ సెంచరీ(50), కామెరాన్ గ్రీన్(47), మాథ్యూ వేడ్(45) పరుగులతో పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, నటరాజన్, శార్దూల్‌లు ఒక్కొక్కరూ 3 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఒక వికెట్ తీశాడు.


అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ప్రారంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. టెస్టు జట్టులో స్థానం సంపాదించినప్పటి నుంచి చక్కగా రాణిస్తున్న శుభ్‌మన్ గిల్(7: 15 బంతుల్లో) ఈ మ్యాచ్‌లో 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. కమిన్స్ బౌలింగ్‌లో స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ రోహిత్‌(44) మళ్లీ భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యాడు.  లియాన్ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు ప్రయత్నించి లాంగాన్‌‌లో ఉన్న స్టార్క్‌కు చిక్కాడు. ప్రస్తుతం క్రీజులో పుజారా (8), రహానె(2) ఉన్నారు.


అయితే టీ విరామం తరువాత వర్షం కురవడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. సమయం మించిపోతున్నా వర్షం తగ్గేలా కనిపించకపోవడంతో సెషన్ రద్దు చేసి రెండో రోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్ల 62 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, లియాన్లకు చెరో వికెట్ దక్కింది.

Updated Date - 2021-01-16T18:50:04+05:30 IST