బొప్పాయికి వాన దెబ్బ

ABN , First Publish Date - 2021-07-26T05:03:20+05:30 IST

బొప్పాయి కోతలు ఆరంభంలో టన్ను రూ. 13000 పలికింది.

బొప్పాయికి వాన దెబ్బ
రైల్వేకోడూరులో సాగు చేస్తున్న బొప్పాయి తోట

రైల్వేకోడూరు, జూలై 25: బొప్పాయి కోతలు ఆరంభంలో టన్ను రూ. 13000 పలికింది. ఇటీవల దేశంలో ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబాయ్‌, కోల్‌కత్తా తదితర ప్రాంతాల్లో వర్షాలు విపరీతంగా కురుస్తుండడంతో బొప్పాయి టన్ను ధర రూ.10 వేలకు పడిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్య నగరాలకు చెందిన మార్వాడీలు రైల్వేకోడూరులో తిష్ఠ వేసి ఉన్నారు. అక్కడ వర్షాలు కురవడంతో ఇక్కడి నుంచి లారీలు వెళ్లలేకపోతున్నాయని అందు వల్లే ధరలు తగ్గించారని వ్యాపారులు అంటున్నారు. రైతులు మాత్రం ధర లు బాగా ఉన్నాయని సంతోషంగా ఉన్న సమయంలో తగ్గించడంతో బొప్పాయి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే...బొప్పాయి కాయలు అంటే రైల్వేకోడూరుకు పెట్టింది పేరు. రైల్వేకోడూరు నుంచి ఢిల్లీ దాకా పేరుగాంచింది. సీజన్‌లో ఢిల్లీకి చెందిన మార్వాడీలు రైల్వేకోడూరులోనే మకాం చేసి ఉంటారు. రైతుల నుంచి తోటలను కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల మార్కెట్లకు ఎగుమతి చేస్తుంటారు. బొప్పాయి రైతులు అప్పులు చేసి సాగు చేశారు. తీరా మొదటిలో ధరలు బాగా ఉన్నా రానురాను తగ్గిపోతున్నాయి. ఇతర నగరాల్లో కురుస్తున్న వర్షాలకు కాయలు ఎగుమతి కాకుండా ఉంది. తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. బొప్పాయి కాయలకు నగరాల్లో మంచి డిమాండు ఉంది. అయితే వర్షాలు కురవడంతో ధరలు తగ్గిపోవడమే కాకుండా కాయలు అక్కడి కి ఎగుమతి కావడం లేదని వ్యాపారులు అంటున్నారు. వర్షం దెబ్బతో బొప్పాయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దున్నకాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలు తదితర వాటికి విపరీతంగా ఖర్చులు అయ్యాయి. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటట్లుగా లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి ఇంకా ధరలు తగ్గించే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. తమను ఆదుకోవాలని బొప్పాయి రైతులు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు.



Updated Date - 2021-07-26T05:03:20+05:30 IST