మినుము రైతుకు వర్షాల దెబ్బ

ABN , First Publish Date - 2021-12-05T05:03:59+05:30 IST

భారీ వర్షాలు మినుము రైతును తీవ్రంగా దెబ్బతీసింది.

మినుము రైతుకు వర్షాల దెబ్బ
భారీ వర్షాలకు దెబ్బతిన్న మినుము పంట

రాజుపాళెం, డిసెంబరు 4: భారీ వర్షాలు మినుము రైతును తీవ్రంగా దెబ్బతీసింది. గతేడాది క్వింటా రూ.8 వేలు పలుకడంతో మిగతా పంటలు వేసినా గిట్టుబాటు కాని రైతన్నలు మినుము పంటపై శ్రద్ధచూపారు. మండలంలోని వివిధ గ్రామాల్లో 5,200 హెక్టార్లు ఈ పంట సాగులోకి వచ్చింది. డిసెంబరు ఆఖరుకల్లా చేతికొచ్చే పంట ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడంతో పంటంతా నేలవాలి పండాకువర్ణం తిరుగడంతో రైతులు ఏమీ చేయలేక గడ్డిమందు పిచికారి చేస్తున్నారు. అర్కటవేముల, పర్లపాడు, టంగుటూరు, వెలువలి, తొండలదిన్నె, గాదెగూడూరు గ్రామాల్లో ఈ పంట ఎక్కువగా సాగులో ఉంది. 20 రోజులు గడిచి ఉంటే ప్రతి రైతుకు ఆరు నుంచి 8 క్వింటాళ్లు దిగుబడి వచ్చేవని, వేలాది రూపాయలు ఖర్చు అంతా వర్షార్ఫణం అయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు మినుము రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-12-05T05:03:59+05:30 IST