ఈదురు గాలి.. వర్షంతో రైతులకు నష్టం

ABN , First Publish Date - 2021-04-24T05:07:48+05:30 IST

ఉరుములు, మె రుపులు ఈదురుగాలులతో శుక్రవారం పడిన మోస్తరు వర్షంతో రైతులు నష్టపోయారు.

ఈదురు గాలి.. వర్షంతో రైతులకు నష్టం
తాళ్లపూడిలో విరిగిపడిన విద్యుత్‌ స్తంభం

తాళ్లపూడి/జీలుగుమిల్లి/పోలవరం/నల్లజర్ల, ఏప్రిల్‌ 23: ఉరుములు, మె రుపులు ఈదురుగాలులతో శుక్రవారం పడిన మోస్తరు వర్షంతో రైతులు నష్టపోయారు. తాళ్లపూడి మండలం లో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగి తీగలు తెగిపడ్డాయి. మరో పక్క చేతికందిన మామిడి, జీడిమామిడి రాలిపోయాయి. అరటితోటలు నేలవాలాయి. ఎండ మండుతుందని ధాన్యం ఆరబెడితే వర్షానికి తడిసిముద్దయ్యాయి. పల్లపు ప్రాంతాలలో మసూళ్లు పూర్తికాకముందే వర్షాలు పడుతుండడంతో పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. విద్యుత్‌ అంతరాయానికి ప్రజలు అల్లాడిపోతున్నారు.


జీలుగుమిల్లిలో మిర్చి, మొక్కజొన్న, వేరుశెనగ, పొగాకు రైతులు వర్షానికి నష్టపోయారు. నిత్యం మారుతున్న వాతావరణం, వర్షం రైతుల కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. పోలవరంలో శుక్రవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన చిరుజల్లులు పడ్డాయి. కల్లాలపై మొక్కజొన్న, వరి ఆరబెట్టిన రైతులు బరకాలు కప్పి భద్రపరుచుకున్నారు. నల్లజర్లలో సాయంత్రం ఈదురు గాలులతోపాటు వర్షం పడింది. కల్లంలో ఉన్న ధాన్యం, మొక్కజొన్న తడిసిపోయాయి. రైతుల నుంచి కొనుగొలు చేసిన ధాన్యం సైతం రైస్‌ మిల్లర్లు వద్ద తడిసిపోవడంతో ఇటు రైతులు ఆటు వ్యాపారులకు కొంత నష్టం కలిగింది. వరి, మొక్కజొన్న పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

Updated Date - 2021-04-24T05:07:48+05:30 IST