గాలి.. వాన.. రైతుకు నష్టం

ABN , First Publish Date - 2021-04-16T06:26:09+05:30 IST

మండలంలో గురువారం తెల్లవారు జామున ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

గాలి.. వాన.. రైతుకు నష్టం
రేచర్లలో నేలనంటిన పామాయిల్‌ చెట్టు

చింతలపూడి, ఏప్రిల్‌ 15: మండలంలో గురువారం తెల్లవారు జామున ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రేచర్ల గ్రామంలో సుడిగాలితో చెలికాని రామకృష్ణ, దుర్గారావు పామాయిల్‌ తోటల్లో సుమారు 20 చెట్లు విరిగిపడిపోయాయి. మొక్కజొన్న చేలు గాలికి ఒరిగిపోయాయి. బాలా వారి గూడెం మామిడితోటల్లో మామిడి రాలిపోయింది. కొన్నిచోట్ల విద్యుత్‌ స్తంభా లు విరిగిపడిపోవడంతో సరఫరాకు అంతరాయం కలిగింది. సాయంత్రానికి అధికారులు సరఫరా పునరుద్ధరించారు.


నేలకొరిగిన మొక్కజొన్న

పోలవరం: మండలంలో వెంకటాపురం, పట్టిసీమ, బంగారమ్మపేట, గుటాల గ్రామాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. కోతకు వచ్చిన పంట గాలి దుమ్ముకు నేలకొరగడంతో రైతులు ఆందోళనతో ఉన్నారు. ముందుగానే ఎక్కడిక్కడ పంటను కోసి ఆరబెట్టారు. బుధవారం వర్షంతో పాటు గురు వారం కూడా వాతావరణంలో మబ్బులు కమ్ముకుని ఉండడంతో పంట  ఎక్కడ నష్టపోతామోనని రైతులు అదనపు కులీలను వినియోగించి పంట కోసి అమ్ముకున్నారు. ఎకరాకు రూ.4వేలు వెచ్చించి పంటను తెగనమ్ము కోవల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-04-16T06:26:09+05:30 IST