జోరు వాన

ABN , First Publish Date - 2022-06-25T04:32:45+05:30 IST

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భారీ వర్షం పడింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైంది. మధ్యాహ్నం ఒంటి గంట తరువాత ఉరుములు, మెరుపులు ప్రారంభ

జోరు వాన
నరసన్నపేట పట్టణంలో వర్షపు నీరు

జిల్లావ్యాప్తంగా వర్షం
ఉరుములు, మెరుపుల బీభత్సం
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/నరసన్నపేట, జూన్‌ 24:
జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భారీ వర్షం పడింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైంది. మధ్యాహ్నం ఒంటి గంట తరువాత ఉరుములు, మెరుపులు ప్రారంభమయ్యాయి. పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుకు కోటబొమ్మాళిలో తొమ్మిది గొర్రెలు మృత్యువాత పడ్డాయి. రణస్థలం, శ్రీకాకుళం, సోంపేట, ఎచ్చెర్ల, నరసన్నపేట, కోటబొమ్మాళి తదితర మండలాల్లోభారీగా వర్షం కురిసింది.
 ‘పేట’ను ముంచెత్తిన వర్షం
నరసన్నపేట పట్టణానికి వర్షపు నీరు ముంచెత్తింది. గంటన్నర పాటు వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మురుగునీటి కాలువలు పొంగి ప్రవహించాయి. ప్రధానంగా బజారు వీధి, మఠం వీధి, తిరుమల వీధి, కోవెల వీధి, బండి వీధి, గాంధీనగర్‌-2, మారుతీనగర్‌, శివానగర్‌ కాలనీ, పాతబస్టాండ్‌, కొత్తబస్టాండ్‌, జయలక్ష్మీనగర్‌లో నీరు రోడ్లపై ప్రవహించింది. మార్కెట్‌ వీధిలో మోకాళ్ల వరకూ వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇప్పటికే ప్రధాన రహదారి విస్తరణతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో మురుగు నీటి ప్రవహంతో పట్టణవాసులు అసౌకర్యానికి గురయ్యారు.
నమోదైన వర్షపాతం..
అత్యధికంగా రణస్థలం మండలం గరికపాలెంలో 72.75 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం మండలం రాగోలులో 53.0 మిల్లీమీటర్లు, సోంపేట మండలం కొర్లాం 52.0, ఎచ్చెర్ల 48.0, నరసన్నపేట 41.25, ఇచ్ఛాపురం 32.0, పలాస 30.75, సంతబొమ్మాళి 20.25, కవిటి మండలం రాజపురం 16.75, టెక్కలి మండలం రావివలసలో 16.25, మందస మండలం హరిపురం 14.5, కోటబొమ్మాళి 12.0, గార మండలం బూరవెల్లి 11.0, ఆమదాలవలస మండలం చింతాడలో 7.0, పొందూరు 3.5, శ్రీకాకుళం ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌ 3.5, పాతపట్నం మండలం జగ్గిలిబొంతు 3.5, నందిగాం మండలం మదనాపురం 3.0, పోలాకి 1.5, జలుమూరు మండలం సైరిగాం 1.5, బూర్జ మండలం మదనాపురం 0.5, జి.సిగడాంలో 0.25, లావేరు మండలం చినబందాంలో 0.25 మిల్లీమీటర వర్షపాతం నమోదైంది.



Updated Date - 2022-06-25T04:32:45+05:30 IST