Abn logo
Nov 28 2020 @ 01:14AM

ముసురు.. ఉసురు

  • తుఫాను ప్రభావంతో జిల్లాలో రెండు రోజూ కుండపోత వాన
  • నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు.. ఉప్పాడలో భయానకం
  • కొనసాగుతున్న ఈదురుగాలులు, అధికమైన చలి తీవ్రత
  • అత్యధికంగా అమలాపురంలో 14 సె.మీ వర్షపాతం నమోదు
  • 18 మండలాల్లో పది సెంటీ మీటర్లకుపైగా వర్షపాతం 
  • 1.43 లక్షల ఎకరాల్లో వరి పంటకు దెబ్బ.. పెట్టుబడి నష్టం రూ.343 కోట్లు


నివర్‌ తుఫాను ప్రభావంతో జిల్లాలో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా రెండు రోజుల నుంచి ఆగకుండా వర్షాలు పడుతున్నాయి. ఒకపక్క కమ్మేసిన మబ్బులతో ఎక్కడికక్కడ చీకటి వాతావరణం నెలకొంది. అటు ఈదురుగాలులు సైతం కొనసాగుతూనే ఉన్నాయి. వీటికితోడు ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి  పడిపోవడంతో చలి తీవ్రత మరింత అధికమైంది. దీంతో ఇళ్లలోంచి జనం బయటకు రావాలంటేనే గజగజ వణికిపోతున్నారు. జిల్లాలో తీరప్రాంతంలోను అలల తీవ్రత అధికంగా ఉంది. ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. బీచ్‌ రోడ్డుపైకి కెరటాలు ఎగసిపడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా అమలాపురంలో అత్యధికంగా 14 సెం.మీ. వర్షపాతం నమోదవగా, మరో 18 మండలాల్లో పది సెం.మీ.కుపైగా వర్షాలు కురిశాయి. అటు జిల్లావ్యాప్తంగా 1.43 లక్షల ఎకరాల్లో వరిపంట దెబ్బతినడంతో అన్నదాత నిలువునా నష్టపోయే పరిస్థితి తలెత్తింది.


(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

నివర్‌ తుఫాను ముప్పు తొలగిపోయినప్పటికీ వాయుగుండం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏమాత్రం ఎడతెరిపినివ్వకుండా వాన పడుతూనే ఉంది. వాస్తవానికి తుఫాను తీరం దాటిన తర్వాత ఆ ప్రభావంతో గురువారం ఉదయం నుంచీ జిల్లావ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురవడం మొదలుపెట్టాయి. శుక్రవారం నుంచి కాస్త ఎడతెరిపినిస్తుంది అనుకుంటే అంతకుమించిన కుండపోత వాన జిల్లాను ముంచెత్తింది. ఎక్కడికక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు విరామం అన్నది లేకుండా వాన ఏకధాటిగా కురుస్తూనే ఉంది. ఈదురుగాలులు కూడా వానలకు తోడవ్వడంతో చలి తీవ్రత అధికంగా ఉంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు జిల్లాలో 15కు పడిపోయాయి. దీంతో జనం కూడా ముసురు వాతావరణంతో దాదాపుగా ఇళ్లకే పరిమితమయ్యారు. రోడ్లు బోసిపోవడంతోపాటు వాణిజ్య దుకాణాల న్నీ వెలవెలపోయాయి. శుక్రవారం కూడా వర్షాల తీవ్రత కోనసీమలోనే అధికంగా నమోదైంది. అమలాపురంలో అత్య ధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాకినాడ, యు.కొత్తపల్లి, మండపేట, మామిడికుదురు, అనపర్తి, అయినవిల్లి, రాజోలు, ఆత్రేయపురం, కాజులూరు, కొత్తపేట, అంబాజీపేట, సఖినేటిపల్లి, కాట్రేనికోన వంటి మండలాల్లో  పది సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసింది. అటు ఎడతెరిపిలేని వానలతో కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లోని లోతట్టు, శివారు ప్రాంతాలు మునిగిపోయాయి. అనేక ఇళ్లను వర్షం నీరుచుట్టుముట్టింది. దీంతో వారంతా బయటకు రావడానికి అనేక అవస్థలు పడుతున్నారు. కాగా గోదా వరిలోకి స్వల్పస్థాయిలో వరద వచ్చిచేరుతోంది. పంపా, ఏలేరు రిజర్వాయర్లకు ఎగువ నుంచి వర్షం నీరు భారీగా వస్తోంది. చెరువులు సైతం నిండుకుండల్లా మారాయి.


  • చి‘వరి’కి ఏం మిగిలింది...


కుండపోత వానలతో అన్నదాతలు రోడ్డునపడ్డట్టు అయ్యింది. గత నెల్లో భారీ వర్షాలు, వరదలకు జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల ఎకరాల్లో వరి పంట తీవ్రంగా దెబ్బతింది. ఎక్కడికక్కడ పొట్ట దశలో ఉన్న పైరు నేలకొరగ్గా, ఇంకొన్నిచోట్ల నీరు నిల్వ ఉండిపోయి కుళ్లిపోయింది. ఈ గాయం నుంచి అన్నదాతలు కోలుకోకుండా మళ్లీ ఇప్పుడు నడ్డివిరిచాయి. గడచిన రెండు రోజుల వానలకు జిల్లావ్యాప్తంగా 1.43 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. అనేకచోట్ల వరి పంట కోసి మడుల్లో పనలు ఉంచారు. వర్షాలతో ఇవన్నీ మునిగిపోయి కుళ్లిపోయాయి. కుప్పలు వేసినచోట ఈదురుగాలులకు కొట్టుకుపోయాయి. కోతకు సిద్ధంగా ఉన్న పొలాలు కూడా దెబ్బతిన్నాయి. మండలాలవారీగా నీటమునిగిన పంట అమలాపురంలో 1,603 హెక్టార్లుకాగా, అల్లవరం 1,150, ఉప్పలగుప్తం 2,010, కాట్రేనికోన 1,954, ఐ.పోలవరం1,521, రాజోలు 1,495, యు.కొత్తపల్లి 2,400, ప్రత్తిపాడు 1,320, తుని 1,213, రౌతులపూడి 1,423 చొప్పున మొత్తం 46 మండలాల పరిధిలో 23,436 హెక్టార్ల లో పంట నీటమునిగింది. 11,620 హెక్టార్లలో కోత కోసిన పనలు నీట మునగగా, 9,509 హెక్టార్లకు చెందిన వరి కుప్పలు తడిచి ముద్దయ్యాయి. వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా ప్రకారం పెట్టుబడి నష్టం ఎకరాకు రూ.24 వేల చొప్పున రూ.343 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. మరోపక్క వర్షాలు వీడకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

అంబాజీపేట మండలం ఇరుసుమండలో తడిసిన ధాన్యాన్ని గట్టుకు చేరుస్తున్న దృశ్యం

  • క’న్నీటి’ పాలైన సార్వా పంట


అమలాపురం (ఆంధ్రజ్యోతి) : సార్వా సేద్యమంటేనే రైతులను కడగండ్ల పాలు చేస్తుంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందే నీటి పాలైంది. రెండు మూడు రోజుల్లో మంచి ముహూర్తాలు చూసి కోతలు మొదలుపెడదామనుకున్న రైతుల ఆశలన్నీ ఆవిరయ్యాయి. నివర్‌ తుఫాను ప్రభావంతో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో కోనసీమలోని రైతాంగం పూర్తిగా నష్టపోయింది. వేలాది ఎకరాల్లో పంట అంతా పూర్తిగా పడి పోయి తడిసి ముద్దయింది. చేలల్లో అడుగు నుంచి రెండు అడుగుల మేర నీరు నిలబడి పోయింది. తడిసి ముద్దయిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసే  పరిస్థితి లేకపోవడంతో పం డిన పంటను నూర్పిళ్లు చేయకుండానే వదిలేసే యోచనలో ఉన్నామని ఎన.కొత్తపల్లికి చెందిన రైతు ఆకుల సింహాద్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకున్న రెండున్నర ఎకరాల పంటచేను కోత దశకు వచ్చిన పరిస్థితుల్లో నీట మునిగిపోయింది. వరదలు, భారీ వర్షాలు, తుఫాన్ల వంటి వాటి ఆటుపోట్లకు తట్టుకుని నిలబడ్డ కొద్దిపాటి పంట నివర్‌ ముంచేసిందని నల్లమిల్లి గ్రామా నికి చెందిన అప్పారి వెంకటరమణ ఆవేదన చెందారు. కోతకు వచ్చిన చేలన్నీ నీటమునగడంతో కోసేందుకు పనికిరావని జనుపల్లికి చెందిన రైతు కొలిశెట్టి త్రిమూర్తులు వాపోయారు. 

Advertisement
Advertisement
Advertisement