చెడగొట్టు వాన

ABN , First Publish Date - 2020-10-13T06:20:04+05:30 IST

ఈసారి పంటలు ఆశాజనకంగా సాగవుతున్నా, వరుణుడి భయం మాత్రం రైతులను వెన్నాడుతోంది

చెడగొట్టు వాన

రైతులను భయపెడుతున్న వాయుగుండం

వదలని ముసురుతో పంటలకు చేటు

తగ్గనున్న నాణ్యత.. పడిపోనున్న దిగుబడి

మార్కెట్‌లో ధరపై ప్రభావం పడుతుందని ఆందోళన

సాధారణ స్థాయిని మించిన నమోదవుతున్న వర్షపాతం

మళ్లీ మొదలయితే తీవ్ర నష్టమే


(ఆంధ్రజ్యోతిప్రతినిధి-ఖమ్మం)

ఈసారి పంటలు ఆశాజనకంగా సాగవుతున్నా, వరుణుడి భయం మాత్రం రైతులను వెన్నాడుతోంది. వరుసగా కురుస్తున్న వర్షాలకు తోడు అక్టోబరు నెలలో వాయుగుండం ప్రభావం ఉండడంతో  రైతులు ఆందోళన చెందుతున్నారు. మబ్బులు కమ్ముతుండడంతో  భీతిల్లుతున్నారు. వానాకాలంలో వేసిన పంటలు గతంలో ఆశానకంగా ఉన్నా వరుసగా కురుస్తున్న వర్షాలతో నష్టం కష్టం కలుగుతోంది. జిల్లాలో వానాకాలం పంట కింద మొత్తం 5,18,676 ఎకరాలు సాగు లక్ష్యం కాగా 5,88,993 ఎకరాల్లో రైతులు పంటలువేశారు. నిర్దిష్ట లక్ష్యంకంటే పంటలు అదనంగా సాగవుతున్నాయి. అందులో వరి 2,30,000 ఎకరాలకు గాను 2,83,854 ఎకరాల్లో సాగుచేయగా, ప్రస్తుతం వరిపంట పొట్ట, కంకి దశలో ఉంది. రైతులు ఎరువులు వేసి ఉండడంతో దసరా తర్వాత కొన్నిచోట్ల వరికోతలు కూడా మొదలయ్యే అవకాశం ఉంది.ఈ తరుణంలో వర్షం పడితే వరిపంట మొత్తం నేలమట్టం కానుంది.


దీంతో ధాన్యంరైతులు ఎక్కడ వర్షం వస్తే పంటలు దెబ్బతింటాయోనన్న భయంతో ఉన్నారు. పెసర 22వేల ఎకరాల్లో సాగులక్ష్యం కాగా 24,664 ఎకరాల్లో వేశారు. ఇందులో ఇప్పటికే కొంత భారీవర్షాలకు దెబ్బతినగా కొంతమేర మాత్రమే రైతుల చేతికి వస్తుంది. మినుము 320 ఎకరాలకు290ఎకరాలు, కంది పదివేల ఎకరాలకు 5344 ఎకరాల్లో వేశారు. వేరుశనగ 950 ఎకరాలకు గాను 167 ఎకరాలు, పత్తి 2,43,537 ఎకరాలకుగాను 2, 68,124 ఎకరాల్లో వేశారు. పత్తిపంట కాతపూత దశలో ఉంది. కొన్నిచోట్ల కొత్తపత్తి చేతికి వస్తుంది. ఇప్పటికే కురిసిన వర్షాలతో కాయలు నల్లబడి దిగుబడి రాక రైతాంగం ఆందోళన వ్యక్తంచేస్తుంది.


మళ్లీ భారీవర్షాలు పడితే మొదటిపంట చేతికి రాకుండానే చేలోనే పోయే పరిస్థితి నెలకొంది. దీంతో పత్తి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. జిల్లాలో చెరుకు  6,420 ఎకరాలకుగాను 4,320 ఎకరాల్లో, ఇతర పంటలు 5,450 ఎకరాలకుగాను 2,209 ఎకరాల్లో వేశారు. ప్రస్తుతం పచ్చగా పైరుతో ఉన్న ఈపంటల మీద భారీవర్షాలు పడితే తీవ్ర నష్టం  కలగనుంది. వేలాదిరూపాయల పెట్టుబడులతో పంటలు సాగుచేసిన రైతులకు పెట్టుబడిపై ప్రభావం చూపనుంది. దిగుబడులు తగ్గి నాణ్యత పడిపోనుంది. 


అధిక వర్షపాతం

ఇప్పటికే జిల్లాలో జూన్‌ నుంచి ఇప్పటి వరకు లక్ష్యానికి మించి అధిక వర్షపాతం నమోదవుతోంది. జూన్‌లో 105.2మి.మీకు 189.3మి.మీ, జులైలో 272మి.మీకు 323.2మి.మీ, ఆగస్టులో 253మి.మీకు 385మి.మీ, సెప్టెంబరులో 161మి.మీకు 253.1మి.మీ కురిసింది. అక్టోబరులో ఇప్పటి వరకు 46.6 మి.మీకుగాను 74.4మి.మీ పడింది. ఈనెలలో జిల్లా సగటు వర్షపాతం 143మి.మీ మళ్లీ భారీవర్షాలు పడితే అక్టోబరులో కూడా సగటువర్షపాతం దాటే పరిస్థితి కనిపిస్తుంది. ఇలా వరుసగా అధికవర్షాలు రైతుల సాగుపంటలను దెబ్బతీస్తున్నాయి. 

Updated Date - 2020-10-13T06:20:04+05:30 IST