కమ్ముకున్న ముసురు

ABN , First Publish Date - 2021-07-22T05:55:02+05:30 IST

జిల్లాను ముసురు కమ్మేసింది. ఎడతెరిపి లేని వర్షంతో తడిసి ముద్దయ్యింది. మంగళవారం రాత్రి మొదలైన వర్షం బుధవారం కూడా యథావిధిగా కొనసాగింది. వర్షానికి జిల్లాలోని వాగులు పొంగి పోర్లాయి. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. చెరువులు మత్తడి దూకుతున్నాయి. పలు చోట్ల పొలాల్లోకి నీళ్లు చేరాయి. ఈ సారి సకాలంలో కురుస్తున్న వర్షాలకు ఖరీఫ్‌ పంటలకు జీవం పోసినట్లైంది. బుధవారం జిల్లాలో సరాసరి 32.5 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది.

కమ్ముకున్న ముసురు
సిరిసిల్లలో ప్రవహిస్తున్న మానేరువాగు

- జిల్లాలో సరాసరి 32.5 మిల్లీమీటర్లు 

- పొంగుతున్న వాగులు

 - ప్రాజెక్ట్‌ల్లోకి భారీ వరద

- మత్తడి దూకుతున్న ఎగువ మానేరు 

- మిడ్‌ మానేరులో 24.61 టీఎంసీల నీరు

- జిల్లాలో వానాకాలం పంటలకు జీవం 

- జోరందుకున్న వరినాట్లు

- 1.49 లక్షల ఎకరాల్లో వరి సాగు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) 

జిల్లాను ముసురు కమ్మేసింది.  ఎడతెరిపి లేని వర్షంతో  తడిసి ముద్దయ్యింది. మంగళవారం రాత్రి మొదలైన వర్షం బుధవారం కూడా యథావిధిగా కొనసాగింది. వర్షానికి జిల్లాలోని వాగులు పొంగి పోర్లాయి. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది.  చెరువులు మత్తడి దూకుతున్నాయి. పలు చోట్ల పొలాల్లోకి నీళ్లు చేరాయి. ఈ సారి సకాలంలో కురుస్తున్న వర్షాలకు ఖరీఫ్‌ పంటలకు జీవం పోసినట్లైంది. బుధవారం జిల్లాలో  సరాసరి 32.5 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా బోయినపల్లి మండలంలో 52.1 మిల్లీమీటర్లు, అతి తక్కువగా తంగళ్లపల్లి 23.3,  రుద్రంగి 42.2, చందుర్తి 37.7, వేములవాడ రూరల్‌ 41.2, వేములవాడ 43.2, సిరిసిల్ల 30.4, కోనరావుపేట 23.7, వీర్నపల్లి 26.0, ఎల్లారెడ్డిపేట 27.3, గంభీరావుపేట 27.4, ముస్తాబాద్‌ 24.3, ఇల్లంతకుంట 26.3 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జిల్లాలోని వివిధ గ్రామాల్లో మట్టిగోడలు తడిసి కూలిపోయాయి. పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అనేక గ్రామాల్లో రోడ్లు చిత్తడిగా మారాయి. 

వాగులకు వరద 

జిల్లాలోని వాగులు వరద నీరుతో  పొంగి పోర్లుతున్నాయి. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్ట్‌  ఐదు రోజులుగా మత్తడి దూకుతోంది. దీంతో మానేరు వాగు పరవళ్లు తొక్కుతోంది. 27.5 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌లో 24.61 టీఎంసీల నీరు చేరింది. మిడ్‌ మానేరు బ్యాక్‌ వాటర్‌తో సిరిసిల్ల మానేరు బ్రిడ్జి వరకు జలకళ సంతరించుకుంది.     మిడ్‌ మానేరులోకి వర్షాలతో 2,365 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. జిల్లాలోని నిమ్మపల్లి ప్రాజెక్ట్‌ నిండింది. మూల వాగు పొంగిపోర్లుతోంది. కొత్తపేట వాగు, మద్దిమల్ల రాయినిచెరువు, మానాల గొర్రెగుండం చెరువు, గోళపులొద్ది చెరువులతోపాటు తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్‌ చంద్రవంక ప్రాజెక్ట్‌లోకి వరదనీరు చేరుతోంది. జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లోని  పొలాల్లోకి భారీగా నీరు చేరింది. 

 జోరుగా వ్యవసాయ పనులు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాళేశ్వరం జలాలతో ఖరీఫ్‌ పంటలకు భరోసా ఇవ్వగా వాటికి తోడుగా ముందుగానే భారీ వర్షాలు కురుస్తుండడంతో ఖరీఫ్‌ సాగు పనులు జోరందుకున్నాయి. 2.81 లక్షల ఎకరాల్లో  రైతులు వివిధ పంటల సాగు చేపట్టారు.  భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండడంతో  వరిసాగును పెంచుకున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1.49 లక్షల ఎకరాల్లో రైతులు నాట్లు వేస్తున్నారు. 1.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. మరో రెండు మూడు రోజులు వర్షాలు ఉండడంతో రైతులు అందుకు అనుగుణంగా వ్యవసాయ పనులు చేస్తున్నారు. 

నేలకూలిన భారీ వృక్షం 

ఎల్లారెడ్డిపేట: రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి శివారులోని కామారెడ్డి-సిరిసిల్ల ప్రధాన రహదారిపై బుధవారం సాయంత్రం భారీ వృక్షం నేలకూలింది. రోడ్డుకు అడ్డుగా పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు గంట పాటు వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న సీఐ మొగిలి, ఎస్సైలు వెంకటకృష్ణ, సంధ్య ఆధ్వర్యంలోని పోలీసులు ఎక్స్‌కావేటర్‌తో చెట్టును తొలగింపంజేశారు. 

Updated Date - 2021-07-22T05:55:02+05:30 IST