‘అకాల’ కష్టం.. ఇరుజిల్లాల్లో గాలివాన

ABN , First Publish Date - 2021-04-16T06:11:56+05:30 IST

‘అకాల’ కష్టం.. ఇరుజిల్లాల్లో గాలివాన

‘అకాల’ కష్టం..  ఇరుజిల్లాల్లో గాలివాన
చర్ల మండలంలో కల్లంలో నీరు చేరడంతో మిర్చిని ఎత్తుతున్న రైతులు

పలుచోట్ల దెబ్బతిన్న పంటలు

భద్రాద్రి జిల్లాలో 29.9, ఖమ్మం జిల్లాలో 4.3మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు 

మధిర మండలంలో పిడుగు పడి వ్యక్తి మృతి

ఖమ్మం(ప్రతినిధి)/కొత్తగూడెం/మధిర రూరల్‌, ఏప్రిల్‌ 15: ఆరుగాలం కష్టించిన రైతులను అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. పంట చేతికొచ్చిన సమయంలో వర్షాలు కురుస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో గురువారం పలుచోట్ల ఈదురుగాలులతో వర్షం కురసింది. దాంతో పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధ, గురువారాల్లో కురిసిన అకాల వర్షాలకు పలు పంటలు దెబ్బతిన్నాయి. మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. అరటి తోటలు సైతం నేలమట్టమయ్యాయి. జిల్లాలో పలుచోట్ల గురువారం తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 29.9మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం 340ఎకరాల్లో పంటనష్టం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. 22 గ్రామాలో 202ఎకరాల్లో వరి, 45ఎకరాల్లో మొక్కజొన్న, 30 ఎకరాల్లో నువ్వులు, 60 ఎకరాల్లో జొన్న, మూడు ఎకరాల్లో అలిచెంద పంట అకాల వర్షాలకు దెబ్బతిన్నాయి. ప్రదానంగా చుంచుపల్లి, సుజాతనగర్‌, ఇల్లెందు, ములకలపల్లి, చర్ల, పినపాక, అశ్వారావుపేట, అశ్వాపురం, బూర్గంపాడు, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, మండలాల్లో ఈ అకాలవర్షాలు ప్రభావం చూపాయి. 85ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం చేకూరింది. జిల్లాలో అత్యధికంగా భద్రాచలం మండలంలో 64.4మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ములకలపల్లి మండలంలో కొన్ని ఇళ్ల పైకప్పులు దెబ్బతిన్నాయి. రేకుల షెడ్లు కూలిపోయాయి. చంద్రుగొండ మండలంలో కురిసిన వర్షానికి ధాన్యం కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. అన్నపురెడ్డిపల్లి తదితర మండలాల్లో ధాన్యం తడవకుండా ఉండేందుకు పైన పట్టాలు కప్పారు. చర్ల మండలంలో మిర్చి కల్లాల్లో నీరు నిలబడింది. ఇక బుధవారం జిల్లాలోని ములకలపల్లి మండలం, జగన్నాధపురం గ్రామంలో 50ఎకరాల్లో అరటి, 35 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి.  



ఖమ్మం జిల్లాలో 

ఖమ్మం జిల్లాలో గురువారం పలుచోట్ల భారీవర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 4.3మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షంతో పలు పంటలకు నష్టం జరిగింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిచింది. జిల్లాలో ఏన్కూరు, తల్లాడ, వైరా, చింతకాని, కొణిజర్ల, కారేపల్లి, తదిర మండలాల్లో  వర్షంకుసింది. తల్లాడ మండలంలో అత్యధికంగా 30.4మి.మీ వర్షం కురసింది.  

పిడుగు పడి గొర్రెలకాపరి మృతి 

మధిర మండలం మల్లారం గ్రామంలో పిడుగుపడి ఒక వ్యక్తి మృతిచెందాడు.  మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన జి.నర్సింగయాదవ్‌(45) గొర్రెలు మేపుకుంటూ సంచారజీవనం సాగిస్తుంటాడు. అయితే గురువారం ఉదయం గొర్రెలతో ఓ పొలంలో ఉండగా వర్షం కురిసింది. ఈ క్రమంలో పిడుగుపడి నర్సింగయాదవ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు.  


Updated Date - 2021-04-16T06:11:56+05:30 IST