ముంబైలో రేపటి నుంచి లోకల్ రైళ్ల పరుగులు.. కానీ..

ABN , First Publish Date - 2020-07-01T05:28:07+05:30 IST

మహారాష్ట్ర రాజధాని ముంబైలో లోకల్ ట్రైన్స్ రాకపోకలపై రైల్వే శాఖ కీలక నిర్ణయం...

ముంబైలో రేపటి నుంచి లోకల్ రైళ్ల పరుగులు.. కానీ..

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో లోకల్ ట్రైన్స్ రాకపోకలపై రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి నగరంలో 350 లోకల్ ట్రైన్స్‌‌ను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అయితే.. ఈ ట్రైన్స్‌లో సాధారణ ప్రయాణికులకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ రైళ్లలో ప్రయాణించేందుకు కేవలం  రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్నవారికి, అత్యవసర సేవల విభాగాల్లో పనిచేస్తున్నవారికి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఐటీ, జీఎస్‌టీ, కస్టమ్స్, పోర్టల్, నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఎంబీపీటీ, జ్యుడీషియరీ, డిఫెన్స్, రాజ్‌భవన్ ఉద్యోగులకు మాత్రమే అనుమతి ఉంటుందని ప్రకటించింది.


ముంబై నగరంలో కేసులు పెరుగుతున్నప్పటికీ లోకల్ ట్రైన్స్‌లోనే రాకపోకలు సాగించే మెజార్టీ ఉద్యోగుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే.. శానిటైజేషన్, భౌతిక దూరం పాటిస్తూ ఈ రైళ్లలో ప్రయాణించాలని ఉద్యోగులకు రైల్వే శాఖ స్పష్టం చేసింది. 


వాస్తవానికి జూన్ 15 నుంచే ముంబైలో ఉద్యోగుల కోసం లోకల్ ట్రైన్స్ రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే.. ఇప్పటివరకూ వాటిలో ప్రయాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, మంత్రాలయ, విద్యుత్ శాఖ ఉద్యోగులకు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు, పోలీసులకు, మెడికల్ విభాగంలో పనిచేస్తున్న వారికి మాత్రమే అనుమతి ఉండేది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, బ్యాంక్ ఉద్యోగులకు అనుమతి ఉండేది కాదు. అత్యవసర విభాగాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు ఉన్నప్పటికీ లోకల్ ట్రైన్స్‌లో ప్రయాణించేందుకు ఇప్పటివరకూ అనుమతి లేదు. తాజాగా రైల్వే తీసుకున్న ఈ నిర్ణయంతో వీరికి ఊరట లభించింది.

Updated Date - 2020-07-01T05:28:07+05:30 IST